
గడచిన వారం రోజుల్లో కురిసిన అకాల వర్షాలు, వీచిన గాలుల మూలంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆరు లక్షల ఎకరాలకుపైగా వివిధ పంటలకు నష్టం వాటిల్లడంతో కోట్లాది రూపాయలు కోల్పోయిన రైతుల పరిస్థితి హదయవిదారకంగా వుంది. రబీ పంటలన్నీ ఏదోఒక రీతిలో దెబ్బతిన్నాయి. అరటి, మొక్కజొన్న, టమోటా, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, కరివేపాకు పంటలకు అసాధారణ నష్టం సంభవించింది. చేతికి వచ్చిన అరటి, బత్తాయి, బొప్పాయి, కర్బూజా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కల్లాల్లో ధాన్యం, మిర్చి తడిచిపోయాయి. మామిడి, జీడిమామిడి పూత పిందె రాలిపోయాయి. పూల తోటలు కకావికలమయ్యాయి. సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించడం అవసరం. క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపడతామని భరోసా కల్పించడం పాలకుల బాధ్యత. రైతులకు ఆత్మ విశ్వాసం కల్పించేందుకు ఎన్యూమరేషన్, ఇతర పాలనాపరమైన చర్యల కోసం వేచి చూడడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం కొంత మొత్తాన్ని ఎక్స్‌గ్రేషియోగా చెల్లించాలి.
వారం పది రోజుల్లో కోత కోయాల్సిన దశలో అరటి తోటలు భీకరమైన గాలులు, వడగండ్ల వానతో నేలకొరిగాయి. వడగండ్ల వాన తీవ్రతకు చీని చెట్లు చీలిపోవడం, వాటి చిగుళ్లు పూర్తిగా రాలిపోయాయి. బొప్పాయి, దానిమ్మ ఒకటేమిటి అన్ని ఉద్యానవన పంటలూ దెబ్బతిన్నాయి. అరటి పంట సాగుకు ఎకరాకు రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి ఖర్చు అవుతోందని రైతులు వాపోతున్నారు. కేవలం అనంతపురం జిల్లాలోనే ఉద్యానవన పంటల రైతులు 500 నుండి 600 కోట్ల రూపాయల మేర నష్టపోయారని ఓ అంచనా. రాష్ట్రంలో నష్టపోయిన మిగిలిన పంటల పరిస్థితీ అలాగే ఉంది. కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది పర్యటించి పంట నష్టాలు నమోదు చేస్తున్నారు. అయితే, వారు ఈ-క్రాప్ బుకింగ్ ఆధారంగా పంట నష్టం నమోదు చేయడంవల్ల వాస్తవ పరిస్థితి ప్రతిబింబించడం లేదు సరికదా నిజంగా నష్టపోయిన వారికి సర్కారు సహాయం అందకపోయే ప్రమాదమూ ఉంది. కౌలుదార్ల పేర్లు కాకుండా భూ యజమాని పేరు నమోదైంది. కొన్ని చోట్ల అసలు ఏమీ లేని పరిస్థితి. కౌలుదార్లు పెట్టుబడి పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ నేపథ్యంలో జరిగిన పంట నష్టం ఆధారంగా సాగుదార్ల పేర్లు నమోదు చేసి (ఈ-క్రాప్ బుకింగ్‌లో వారి పేరు నమోదు కాకపోయినప్పటికీ) నష్టపోయిన వారికే పరిహారం చెల్లించాలి.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు తక్షణం స్పందించడం, మానవతా దృక్పథంతో సహాయం అందించడం పాలకుల కర్తవ్యం. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారు తమకు అనుకూలురా లేక ప్రత్యర్థులా అన్న దృష్టితో చూసి రాజకీయంగానే స్పందించడం సహాయం ప్రకటించడం, దాన్ని మంజూరు చేయడమూ జరుగుతోంది. వివక్ష ఆనవాయితీలా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలను తిరస్కరించిన మోడీ సర్కారు ఆనాటి హుదూద్ తుపాను సహాయంతో సహా కేంద్ర నిధులకు ఎప్పుడూ కోతలూ కొర్రీలే పెట్టింది. అలాంటిది ఈ సందర్భంలో వారు స్పందిస్తారని ఆశించడం కష్టమే! రాష్ట్ర ప్రభుత్వం కనీసం అందుకు ఒత్తిడి కూడా చేయడం లేదు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంట నష్టపరిహారంపై వెంటనే అంచనా మొదలుపెట్టి, వారం రోజుల్లో పంట నష్టం అంచనా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గత ఆదివారంనాడు కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణ ముఖ్యమంత్రి గురువారంనాడు జిల్లాల్లో పర్యటించి రైతులను ఊరడిల్లజేయడం మంచి విషయం. అయితే ఆయన ప్రకటించిన పరిహారం సొమ్ము వెంటనే అందే ఏర్పాటు చేయాలి. అప్పుడే ఈ పర్యటన, ఊరడింపులకు సార్ధకత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా త్వరితగతిన బాధితులకు సహాయాన్ని అందజేయాలి. వారిని ఆదుకోవాలి. అలా చేయకుండా మాది రైతు ప్రభుత్వం అని మాటలు చెబితే చాలదు. పంట కోల్పోయిన రైతులు, కౌలుదార్లు తమకు న్యాయమైన పరిహారం కోసం ఉద్యమిస్తారు.