సూపర్‌స్టార్ కష్ణ కన్నుమూతతో ఒక తరం తెలుగు వెండితెర తారాలోకం తరలిపోయినట్టయింది. 350 పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ ఓ రైతుగా, కుటుంబ సభ్యునిగా, విప్లకారునిగా, కార్మికునిగా, ప్రేమకునిగా, వృత్తిదారుగా, సీతారామరాజుగా కనిపించి అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. విజయనిర్మలతో కలిసి నటించిన 'మీనా', 'పాడి పంటలు' చిత్రాల్లో రైతుగా, 'అల్లూరి సీతారామరాజు', ఈనాడు, చిత్రాల్లో ప్రజా సమస్యలపై ఉద్యమించే విప్లవకారునిగా కనిపించారు. మంచి కుటుంబం, విచిత్ర కుటుంబం, అక్కాచెల్లెళ్లు, పండంటి కాపురం, ఉండమ్మ బొట్టు పెడతా వంటి చిత్రాల్లో భాద్యతగల వ్యక్తిగా, ప్రేమికుడిగా కనిపించారు. ఇలాంటి మరెన్నో సినిమాల్లో తనదైన శైలిలో నటించారు. అన్ని కోణాలూ ప్రదర్శించే సామర్థ్యం ఉన్న వ్యక్తిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

అద్భుతమైన పాటలు
సినిమాల్లో ఘంటసాల మొదలుకొని పీబీ శ్రీనివాస్, బాల సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, మాధవపెద్ది రమేశ్, జేసుదాసు, రాజ్ సీతారాం అందరూ పాడారు. ఆయన నటించిన చిత్రాల్లో ఎన్నో పాటలూ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. సీతారామరాజు చిత్రంలో 'తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా..', 'వస్తాడు నా రాజు ఈ రోజు', సింహాసనం సినిమాలో 'ఆకాశంలో ఒక తార', ఇంద్రధనస్సు చిత్రంలో 'నేనొక ప్రేమ పిపాసిని', పండంటి కాపురంలో 'ఈనాడే కట్టుకున్న పొదరిల్లు' పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తాయి. గూడు పుఠాణి చిత్రంలో 'తనివి తీరలేదే.. నా మనసు నిండలేదే' పాట ప్రేమికుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈనాడు చిత్రంలో 'నేడే.. ఈ నాడే..' పాట ప్రజలను ఇప్పటికీ చైతన్య పరుస్తుంది. చుట్టాలున్నారు జాగ్రత్త...లో శ్రీదేవితో కలిసి 'రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక' పాట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కృష్ణ తన కుమారులు రమేష్, మహేష్‌బాబుతో కలిసి నటించిన 'ముగ్గురు కొడుకులు' చిత్రంలో 'సంసారమే బృందావనం' పాట ప్రతి ఒక్కరినీ ఎమోషనల్‌గా దగ్గర చేసింది. చాలా కాలం తర్వాత ఆలీ హీరోగా నటించిన 'యమలీల' చిత్రంలో కృష్ణ 'జుంబారే.. జుజుంబరే' పాట కుర్రకారుకు ఊపునిచ్చింది. ఇటువంటి ప్రేక్షకుల హృదయాలను కదిలించే ఎన్నో పాటలు ఆయన చిత్రజీవితంలో నిండి ఉన్నాయి.

అనేకమంది కథానాయికలతో ...
అలనాటి టాప్ హీరోయిన్స్ అయిన శ్రీదేవి, జయసుధ, జయప్రదలతో జతకట్టి సినిమాలు తీశారు కృష్ణ. విజయనిర్మలతో 50 వరకూ చిత్రాల్లో నటించారు. జయప్రద, జయసుధలతో 40కి పైగా, శ్రీదేవి సరసన 30 సినిమాలకు పైగా నటించారు. ఆ తర్వాత తరం అయిన విజయశాంతి, రాధా, సౌందర్య వంటి తారల పక్కనా అనేక చిత్రాలు చేశారు.
సంక్రాంతికి సినిమాలు విడుదల చేసే విషయంలో కృష్ణ రికార్డు సృష్టించారు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఆయన నటించిన 30 చిత్రాలు సంక్రాంతి పండగకు విడుదల అయ్యాయి. 1976 నుంచి 1996 వరకూ 21 సంవత్సరాల పాటు ప్రతి ఏటా వరుసగా సంక్రాంతి సినిమాలు విడుదల చేశారు. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ సినిమాలతో పాటు కృష్ణ సినిమాలూ విడుదల అయ్యేవి.
మరికొన్ని విశేషాలు..
హీరోగా తొలి సినిమా విడుదలైన 50 ఏళ్ల తరువాత ఆయన కీలక పాత్రధారిగా 'శ్రీశ్రీ' పేరుతో 2016లో చివరి సినిమా విడుదలైంది. ఏ నటులకు లేనన్ని అభిమాన సంఘాలు రికార్డు స్థాయిలో 2500 ఉండేవి. 'సింహాసనం' సినిమా శతదినోత్సవ సభకు 30 వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో వచ్చారు. చిత్రసీమకు ఆయన చేసిన సేవకు గుర్తింపుగా ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్రవిశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) లభించాయి.










