ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత సంజయ్ సింగ్‌లకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. పరువు నష్టం కేసులో నోటీసులు జారీ అయ్యాయి. ప్రధాని మోడీ డిగ్రీ విషయంలో కేజ్రీవాల్, సంజయ్ సింగ్ అవమానకర ప్రకటనలు చేశారంటూ గుజరాత్ యూనివర్సిటీ ఆరోపించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 500 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ విలేకరుల సమావేశంలో, ట్విట్టర్ హ్యాండిల్‌లో యూనివర్సిటీపై అవమానకర వ్యాఖ్యలు చేశారని యూనివర్సిటీ తెలిపింది. దాంతో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ ప్రతిష్ట దెబ్బతిందని ఆరోపించింది. ఈ మేరకు అహ్మదాబాద్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జయేష్‌భారు చౌవాటియా కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లకు సమన్లు జారీ చేశారు. మే 23న విచారణకు హాజరుకావాలని సూచించారు. గుజరాత్ విశ్వవిద్యాలయం 70 సంవత్సరాల కిందట స్థాపించారని, ప్రజల్లో మంచి పేరుందని, ఇలాంటి ఆరోపణలతో యూనివర్సిటీపై ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతింటోందని గుజరాత్ యూనివర్సిటీ తరఫు న్యాయవాది తెలిపారు.