ప్రజాశక్తి-కాకినాడ : జగన్నాధపురంలోని యంయస్‌యన్ చారిటీస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో వి.బి.వి.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి వినోదం కార్యక్రమాన్ని ఉప తనిఖీ అధికారి ఎల్. గణేష్ బాబు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్, వినోదం, విజ్ఞానం, ఆడుతూ పాడుతూ నేర్పేదే వేసవి వినోదం అన్నారు. మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న వి.బి.వి.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కె.సత్యనారాయణకు అభినందనలు తెలిపారు. ప్రతి విద్యార్థి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల కరస్పాండెంట్ పి.బాబూరావు మాట్లాడుతూ.. ఈ వేసవి వినోదంలో 23 పాఠశాలల నుండి 87 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరిస్తాయన్నారు. వేసవి వినోదం కన్వీనర్ కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 4వ తరగతి నుండి 7వ తరగతి విద్యార్థులు జూనియర్స్‌గాను 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులను సీనియర్స్‌గాను విభజించి వివిధ అంశాలపై శిక్షణ ను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రేవతి సైన్స్ ఫౌండేషన్ అధ్యక్షులు కె.శ్రీకృష్ణ సాయి విద్యార్థులకు అనేక సైన్స్ ప్రయోగాలపై శిక్షణను ఇచ్చారు. ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు. పప్పెట్రి శిక్షకులు పిల్లి గోవింద రాజులు విద్యార్థులకు పప్పెట్రీ ఫై శిక్షణను ఇచ్చారు. ప్రతి విద్యార్థీ వినూత్నంగా ఆలోచించాలన్నారు. బాలవేదిక కన్వీనర్ నోరి బలరామకృష్ణ తన హాస్య గుళికలతో విద్యార్ధులకు వినోదాన్ని, విజ్ఞానాన్ని చిన్న చిన్న బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాషను ఆటపాటలతో నేర్చుకోవాలి. పద్యాలు, గీతాలు, కధలు, కవితలు వంటి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.ఈశ్వర రావు, కె.దుర్గా ప్రసాద్, పి.దేవి, సిహెచ్ శ్రీహరి రావునాయుడు, వి.పద్మావతి, కె.లక్ష్మణరావు, విద్యార్థులు పాల్గొన్నారు.










