Apr 02,2023 09:09

ఎండల్లో ఉదయం టిఫిన్‌ చేయాలంటే ఏం తింటే ఏ సమస్యో అని.. ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటాం. అయితే ఈ ఎండల్లో చలువ చేసే అల్పాహారం ఒంటికి చాలా మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి కదా.. మరి అలా చలువ చేసే అల్పాహారాలు ఏమిటో.. అవి ఎలా తయారుచేయాలో ఫటాఫట్‌ తెలుసుకుందాం..

  • జొన్న పరాటా..
1

కావాల్సినవి: జొన్నపిండి - కప్పు, గోధుమపిండి /శనగపిండి - 1/4 కప్పు, మెంతికూర / పాలకూర - తరిగినది కప్పు, ఉప్పు - తగినంత, ధనియాల పొడి - 1 స్పూన్‌, కారం - 1/2 స్పూన్‌, పచ్చిమిర్చి కారం - 1/2 స్పూన్‌ కన్నా తక్కువ, పసుపు - పావు స్పూన్‌, జీలకర్ర పొడి - 1/2 స్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- 1/2 స్పూన్‌, నువ్వులు - 3 స్పూన్లు, పెరుగు -3/4 కప్పు. నూనె - తగినంత.
తయారీ: మిక్సింగ్‌ బౌల్‌లోకి ముందు జొన్నపిండిని, గోధుమపిండిని జల్లించుకోవాలి. బాగా కడిగిన మెంతికూర సన్నగా తరిగినది వేసుకోవాలి. దీనిలో ఉప్పు, ధనియాలపొడి, కారం, పచ్చిమిర్చి కారం, పసుపు, జీలకర్రపొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, నువ్వులు, పెరుగు వేసి బాగా కలపాలి. ఇవన్నీ కలిపేటప్పుడు రెండు స్పూన్ల నూనె కూడా వేయాలి. ఈ పొడులన్నింటి బదులు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. పిండి బాగా కలిపాక కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఈ పిండిని ఒక ముద్దగా చేసుకుని, పొడి జొన్నపిండిలో అద్ది, కాస్త మందంగా పరాటా చేయాలి. మరీ పలుచగా అవసరం లేదు. దీనిపై నువ్వులు చల్లి ఒకసారి చేతితోనే అద్దాలి. దీన్ని పెనం బాగా కాలాక చేసుకున్న పరాటా వేసి రెండు వైపులా 50 శాతం ఏమీ వేయకుండా కాల్చాలి. తర్వాత నెయ్యి రాసి రెండువైపులా బంగారు వర్ణం వచ్చే వరకూ కాల్చుకోవాలి. దీన్ని మామిడికాయ పచ్చడితోగానీ, పెరుగు చట్నీతోగానీ సర్వ్‌ చేసుకోవాలి. భలే రుచిగా ఉంటాయి. ఇవి తింటే అంత తొందరగా ఆకలి వేయదు.

  • సగ్గుబియ్యంతో..
saggu

కావల్సినవి : సగ్గుబియ్యం - కప్పు, నీళ్లు - తగినన్ని, - పల్లీలు - పావు కప్పు, పచ్చిమిర్చి -3, కొత్తిమీర తరుగు - కొద్దిగా, ఉడికించిన బంగాళదుంపలు - 2, ఉప్పు - తగినంత, జీలకర్ర -అర స్పూన్‌, ఎండుమిర్చి ఫ్లేక్స్‌ - అర స్పూను, నూనె - తగినంత.
తయారీ: మిక్సింగ్‌ బౌల్‌లోకి సగ్గుబియ్యం వేసి రెండు సార్లు బాగా నలిపి కడగాలి. వీటిని మూడు గంటలు నానబెట్టాలి. ఉదయం చేసుకోవాలంటే రాత్రి కూడా నానబెట్టుకోవచ్చు. పల్లీలను దోరగా వేయించుకోవాలి. వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకుని, పచ్చిమిర్చి కూడా వేసి కోర్సుగా గ్రైండ్‌ చేసుకోవాలి. నానిన సగ్గుబియ్యంలో ఈ మిశ్రమాన్ని వేయాలి. దీనిలోనే కొత్తిమీర తరుగు, జీలకర్ర, ఉప్పు, ఉడికించిన బంగాళదుంపల తురుము వేసి బాగా కలపాలి. నీళ్లు అసలు పోయొద్దు. ఒక పాలిథిన్‌ కవర్‌ తీసుకుని, దానిపై కొద్దిగా నూనె రాసి, కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక ముద్ద తీసుకుని రెండో చేయి సపోర్టుతో రౌండుగా చిన్న రొట్టెలా ఒత్తుకోవాలి. పాన్‌ మీద నూనె అప్లరు చేసి, ఈ రొట్టెను మూడు నిమిషాలు ఒకవైపు, మరోవైపు మూడు నిమిషాలు కాల్చాలి. ఇవి రెండువైపులా దోరగా కాలితే సరిపోతుంది. వీటిలోకి అల్లం చట్నీగానీ, పెరుగుచట్నీ గానీ, టమాటా సాస్‌గానీ మంచి కాంబినేషన్‌. ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. చల్లారాక కూడా బాగానే ఉంటాయి.

  • సొరకాయ రొట్టె..
rotte

కావల్సినవి : సొరకాయ తురుము - ఒకటిన్నర కప్పు, (లోపలిది కాకుండా పైనిది మాత్రమే), బియ్యం పిండి - అరకప్పు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, జీలకర్ర - అరస్పూన్‌, అల్లవెల్లుల్లి పేస్ట్‌ - అర స్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపోను. ఎండుమిర్చి ఫ్లేక్స్‌ - అరస్పూన్‌ (సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలైనా వేసుకోవచ్చు), ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు.
తయారీ : మిక్సింగ్‌ బౌల్‌లో సొరకాయ తురుము, బియ్యం పిండి వేసి కలపాలి. సొరకాయలో తేమను బట్టి పిండి పలుచగా అనిపిస్తే ఇంకొంచెం పొడి పిండి కలపాలి. దానిని కొద్దిసేపు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా నలిపిన ఉల్లిముక్కల్ని పిండిలో వేయాలి. ఇందులోనే జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, కొత్తిమీర తరుగు, ఎండుమిర్చి ఫ్లేక్స్‌ వేసి కలపాలి. చివరిగా ఉప్పు వేసి కలపాలి. ఇవన్నీ వేసిన ఈ మిశ్రమాన్ని మరోసారి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అప్పాలుగా చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి రెండువైపులా సమంగా గోల్డెన్‌ కలర్‌ వచ్చే వరకూ కాల్చాలి. ఇష్టమైన వారు డీప్‌ఫ్రై కూడా చేసుకోవచ్చు. చేతిలో ఉండను కొద్దిగా నొక్కి, పాన్‌పై పెట్టాక మనకు కావలసినట్లు ఒత్తుకోవచ్చు. వీటిని సన్న సెగమీదే రెండువైపులా బంగారువర్ణం వచ్చే వరకూ వేయించుకోవాలి. ప్లేట్‌లోకి తీసుకుని నిమ్మకాయ పచ్చడితోగానీ, మామిడికాయ తురుము పచ్చడితోగానీ సర్వ్‌ చేసుకోవాలి. ఇవి భలే టేస్టీగా ఉంటాయి.

  • బియ్యంపిండి గారెలు..
gare

కావల్సినవి : బియ్యం పిండి - కప్పు, పుల్లటి పెరుగు - అరకప్పు, (తాజా పెరగయితే, రెండు స్పూన్ల నిమ్మరసం కలుపుకోవాలి), నీళ్లు - కప్పు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, జీలకర్ర, ఆవాలు- అరస్పూన్‌, అల్లవెల్లుల్లి పేస్ట్‌ - అర స్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపోను. ఎండుమిర్చి ఫ్లేక్స్‌ - అరస్పూన్‌ (సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలైనా వేసుకోవచ్చు), ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు.
తయారీ : ముందుగా మిక్సింగ్‌ బౌల్‌లో బియ్యంపిండి, పెరుగు, నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి పక్కనుంచుకోవాలి. స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి, దానిలో ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. అందులోనే అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి దోరగా వేయించాలి. అందులోనే కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని వేసి, సన్న సెగమీద చపాతీ పిండిలా దగ్గరపడేవరకూ కలపాలి. దీనిలోనే కొత్తిమీర తరుగు, ఎండుమిర్చి ఫ్లేక్స్‌ వేసుకోవాలి. ఇలా పాన్‌ నుండి పిండి విడిపోయే వరకూ కలుపుతూ ఉడికించుకోవాలి. పాన్‌ నుంచి పిండి సపరేట్‌ అయ్యాక స్టవ్‌ ఆపేసి, మూతపెట్టి కాసేపు ఉంచాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మళ్లీ ఈ మిశ్రమాన్ని బాగా కలిపి చేతికి నూనె రాసుకుని, చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక ఉండ తీసుకుని గారెలా ఒత్తుకోవాలి. మధ్యలో చిల్లు పెట్టాలి. ఇలా అన్నీ చేసుకుని, ఒక ప్లేట్‌లో ఉంచాలి. స్టవ్‌ మీద కళాయిపెట్టి నూనె పోసి, కాగనివ్వాలి. మంట మధ్యస్థంగానే ఉంచి, చేసిపెట్టుకున్న గారెలు నూనెలో వేసి వేగనివ్వాలి. బంగారువర్ణంలోకి వచ్చాక ప్లేట్‌లోకి తీసుకోవాలి. వీటిలోకి కొబ్బరి, పల్లీ చట్నీగానీ, అల్లం చట్నీగాని మంచి కాంబినేషన్‌.