
సరదాలు-సంబరాలు.. ఆచారాలు-ఆనందాలు.. సందళ్ళూ-సంకల్పాలు.. సందేశాలూ-సంతోషాలు.. ఎన్నో మరెన్నో సంస్కృతీ సాంప్రదాయాల కలబోతే పండుగలు.. పబ్బాలు.. అలాంటి ఆనందాల్లో పాలుపంచుకోవాలనే దసరా ఉత్సవాలు. కొత్త బట్టలు.. కలసి చేసే విందులు, పిల్లలకైతే ఆనందాల పరవళ్లు.. ఆటలతో మైమరచిపోతారు. కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో జరిగే పండుగను వీక్షించాలని సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు కోలాహలంగా ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నారు. పల్లెల్లో ప్రకృతిని పొదువుకున్న పాటలెన్నో.. నదీ నదాలను పొగుడుతూ జానపదాలెన్నో వినిపించేవి ఒకప్పుడు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకునేవారు. కలసిమెలసి పిండి వంటలు చేసుకునేవారు. ఇప్పుడు ఎంతలేదన్నా మనిషి ఆహారంలోనూ ఆహార్యంలోనూ కృత్రిమత్వం కనబడుతోంది. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సంస్కృతి సౌరభాలు కనువిందు చేస్తున్నాయనే చెప్పాలి. దసరా సందర్భంగా దీనిపైనే ఈ ప్రత్యేక కథనం..

శరత్‌కాలంలో తొమ్మిది రోజులపాటు జరిగే ఉత్సవాలు కాబట్టి దసరాను శరన్నవరాత్రి అనీ అంటారు. అంతేకాక చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా విజయదశమి అని అంటారు. ఈ సందర్భంలోనే ఆయుధపూజ చేస్తారు. ఇలా దేశ వ్యాపితంగా జరుపుకునే పండుగ కాబట్టి వివిధ ప్రదేశాల్లో ఆయా రాష్ట్రాల చరిత్ర, సంస్కృతిని మేళవించి, రకరకాల పేర్లతో పిలుస్తారు.
వివిధ రాష్ట్రాలు.. విభిన్న రీతులు..
విభిన్న సంస్కృతులకు నిలయమైన మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో భిన్న రీతుల్లో దసరాను జరుపుకుంటారు. ఈ సంబరాల కోలాహలం కొన్ని ప్రాంతాల్లో అంబరాన్నంటుతాయి. ఆయా ప్రాంతాల సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా జరుపుకుంటారు. చారిత్రాత్మక విశిష్టతను చాటుతారు. అలా అన్నింటినీ మేళవించి, పండుగను ఘనంగా జరుపుతారు.

ఆంధ్రప్రదేశ్‌లో...
మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు జరుగుతాయి. వీటిలో కొన్ని జిల్లాల్లో ఉత్సవాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. విజయవాడలో కృష్ణమ్మ ఒడ్డున ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ సంబరాల్లో పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఒక్కొక్కరోజు ఒక్కోవిధంగా కనువిందు చేస్తాయి. ఆఖరిరోజు ప్రభలను కట్టి, వాటి ముందు వేసే భేతాళనృత్యం ప్రజలను ఆకట్టుకుంటాయి. అదేరోజు తెప్పోత్సవం చూడటానికి దూరప్రాంతాల నుంచి వేలాది మంది తరలివస్తారు. హంసరూపంలో ఉన్న పడవలాంటి వాహనాన్ని అలంకరించి, నదిలో సాగేదే ఈ తెప్పోత్సవం. ఇక గోదావరి జిల్లాలో కొబ్బరిపీచు, వెదురుకర్రలు, గడ్డితో ఆకర్షణీయంగా తయారుచేసిన ఏనుగుల ఊరేగింపు కడు రమ్యంగా ఉంటుంది. విజయనగరంలో గజపతి వంశానికి చెందిన మహిళలు పైడితల్లికి చేసే ప్రత్యేక పూజలు, దసరా తరువాత వచ్చే మొదటి మంగళవారం నిర్వహించే సిరిమాను ఉత్సవం అక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.

ఇంటిల్లపాదీ..
దసరా పండుగను ముఖ్యంగా స్త్రీ ప్రధాన పండుగగా భావిస్తారు. ప్రతి ఇంటిలో వారి వారి అభిరుచికి అనుగుణంగా రకరకాల బొమ్మలతో బొమ్మల కొలువు పెడతారు. ఊళ్ళలో సంబరాలు జరుపుకునే విధానం కొంతవరకూ కనుమరుగైనప్పటికీ ఉత్తరాంధ్ర, తెలంగాణాలో ఇప్పటికీ కొన్నిచోట్ల గ్రామీణ సంబరాలు కనిపిస్తాయి.
'శ్రీలక్షి నీమహిమలు గౌరమ్మా
చిత్రమై తోచునమ్మ గౌరమ్మా
భారతీదేవివై బ్రహ్మ కిల్లాలివై
పార్వతీ దేవివై పరమేశురాణివై
పరగ శ్రీలక్షివై గౌరమ్మా
హరికి భార్యవైతివి గౌరమ్మా...
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మా
తంగేడు పువ్వొప్పునే గౌరమ్మా
ఏమేమి కాయొప్పునే గౌరమ్మా
తంగేడు కాయొప్పునే గౌరమ్మా!' అంటూ-
పొన్నపువ్వు, గుమ్మడి, రుద్రాక్ష, కాకర, చేమంతి పువ్వులను సమర్పిస్తున్నామని పాటలో చెప్పి ప్రకృతిమాతను శాంతపరచే ప్రయత్నం చేస్తారు.
'మచ్చల పెద్దపులినెక్కింది పెద్దమ్మ
కొండల్లో తిరుగుతోంది మాయమ్మ
మము కరుణించరావమ్మ దుర్గమ్మ...!' అని పాడుకుంటూనే-
పనులలో మునిగిపోతారు. దేవి ప్రతిమను రకరకాల పువ్వులతో అలంకరించి దీపాలెలిగించి చుట్టూ చేరిన స్త్రీలు కోలాటం ఆడటం, పురుషులు డప్పులు వాయిస్తుంటే ఆ శబ్దానికి లయబద్దంగా నర్తిస్తూ పల్లెజనం పరవశిస్తారు. పూజలే కాకుండా ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు జరుగుతాయి. పండుగను ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల విజయదశమి రోజుతో ముగించరు. 'నందెన్న సంబరాలు' పేరుతో పండుగరోజు రాత్రి ప్రారంభించి, 21 రోజులు అంటే దీపావళి వరకూ జరుపుతారు. 21వ రోజు అలంకరించిన గౌరమ్మను బండ్లపై మేళతాళాలతో, నృత్యాలతో తీసుకెళ్ళి, జలాశయంలో నిమజ్జనం చేస్తారు. శివపార్వతుల విగ్రహాలను నందిపై పెట్టి, పూజించి, చివరి రోజున నిమజ్జనం చేస్తారు. దసరా తర్వాత వచ్చే పౌర్ణమిని 'గౌరీ పౌర్ణమి'గా పిలుస్తారు.
'ఈవొచ్చె ఆవొచ్చె
ఎలగా పళ్ళు కాపుకొచ్చె
నీవంది పుచ్చుకోరా నందెన్న
నీ గాలి మేడలుకే నందెన్న
దబ్బాపళ్ళూ కాపూకొచ్చే
నీవంది పుచ్చుకోరా నందెన్న' అంటూ-
పాటలు పాడుతూ శివపార్వతుల ప్రతిమలకు పండ్లను నివేదిస్తారు.
ఉత్తరాంధ్ర ప్రాంతాల నుండి వెళ్ళి అండమాన్ దీవుల్లో స్థిరపడిన వారు వ్యవసాయం చేయకపోయినా, తమ సాంప్రదాయ మూలాలను ప్రతియేడు సంబరాల రూపంలో గుర్తు చేసుకుని, ఆనందిస్తారు.
రామాయణ, మహాభారత ఇతివృత్తాలతో...
ఈ సంబరాల్లో పాడుకునే పాటల్లో రామాయణ, మహాభారత గాథల ఇతివృత్తాలు, విజయాలు, శౌర్యాలు ఇమిడి ఉంటాయి. నిత్యం చేసుకునే పనులు, కుటుంబ నేపథ్యాలు, సంబంధ బాంధవ్యాలు, చతురోక్తులు జోడించుకుని, జోరుగా హుషారుగా సాగుతాయి. దైవాన్ని తమ ఇష్టరీతిలో ఇముడ్చుకుంటూ.. కొంటెగా పాడుకుంటూ.. పనుల్లో శ్రమను మర్చిపోతారు.
తెలంగాణలో...

దసరాను తెలంగాణలో బతుకమ్మ పండుగ చేసుకుంటారు. 'ప్రకృతి స్వరూపిణి'గా భావించిన బతుకమ్మను రకరకాల పూలతో అలంకరించి, ఆరాధిస్తారు. ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, సాంప్రదాయ నృత్యరీతులకు ప్రతీక. నవ ధాన్యాలకు, నిధులకు ప్రతినిధిగా భావించి, బతుకమ్మను కొలుస్తారు. తొమ్మిది రోజులూ బతుకమ్మను పూలతో అలంకరించి పూలమ్మగా, తమ ఇంటి ఆడపడుచుగా భావించి అభిమానిస్తారు, ఆరాధిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్ణయించారు. వారి సాంప్రదాయం, సంస్కృతిని మేళవించుకుని..
'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
ఆనాటి కాలాన ఉయ్యాలో
ధర్మాంగుడనురాజు ఉయ్యాలో
ఆ రాజు భార్యయు ఉయ్యాలో
అతి సత్యవతియంద్రు ఉయ్యాలో!' అని-
బతుకమ్మ పుట్టుకకు సంబంధించిన కథలను పాటగా పాడుకుంటారు. అలా తర్వాతి తరాలకు నీతి బోధ చేస్తారు. బతుకమ్మ పండుగలో సింహభాగం స్త్రీలదే. పుట్టినింట తనవారితో ఆమె సంబరం, సంబంధం.. మెట్టినింట అత్తింటివారిని కలుపుకుని మెలిగే ఆమె అనుబంధం కలగలసిన కుటుంబ నేపథ్యాలు కనపడతాయి పండుగలో. బతుకమ్మ మళ్ళీ సంవత్సరానికిగానీ రాదని.. అప్పటివరకూ ఎదురుచూస్తూ ఉంటామని..
'ఘనమైన పొన్నపూలె గౌరమ్మా...
గజ్జెలా వడ్డాణమే గౌరమ్మా...
పోయిరా గౌరమ్మ
పోయి రావమ్మా...
మళ్ళొచ్చే ఏడాది
మా ఇంట రావమ్మా..!' అని పొగుడుతూ గౌరవంగా సాగనంపుతారు.
పోయిరా గౌరమ్మ
పోయి రావమ్మా...
మళ్ళొచ్చే ఏడాది
మా ఇంట రావమ్మా..!' అని పొగుడుతూ గౌరవంగా సాగనంపుతారు.
ఒడిశాలో..
భువనేశ్వర్‌లోనూ కోల్‌కతా తరహాలోనే వేడుకలు జరుపుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసే మండపాల మధ్య పోటీలు నిర్వహిస్తారు. అమ్మ వారి విగ్రహాలను జీవం ఉట్టిపడేలా తయారుచేయడం ఇక్కడి ప్రత్యేకత.
కులులో..
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు ప్రకృతి అందాలకేకాక, దసరా వేడుకలకూ ప్రత్యేకమే. 1637లో రాజా జగత్‌సింగ్ విగ్రహాలను ఊరేగించే సాంప్రదాయాన్ని ప్రారంభించారు. మరో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే.. నవరాత్రుల సమయంలో ఇక్కడ వేడుకలు జరగవు. విజయదశమి రోజున ప్రారంభమై, ఏడు రోజులు దసరా వేడుకలు జరుగుతాయి. గడ్డి, ఆకులు కాల్చి, లంకా దహనం జరిపినట్లు భావిస్తారు.
బస్తర్ దసరా..
దసరా అంటే నవరాత్రులు, విజయదశమి పది రోజుల పండుగగా జరుపుకుంటాం దేశమంతటా. కానీ ఛత్తీస్‌గడ్‌లోని ఆదివాసీలు 75 రోజులపాటు దసరా వేడుకలు జరుపుకుంటారు. ప్రకృతిని ఆరాధిస్తారు. దేవీ దంతేశ్వరిని ప్రకృతి దేవతగా భావిస్తారు. వేడుకల్లో భాగంగా వాళ్లు చెట్లను పూజిస్తారు.

తమిళనాడులో..
తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరుపుకునే విజయదశమికి ఒక సారూప్యత ఉంది. మూడు ప్రదేశాలలో బొమ్మల కొలువు తీర్చిదిద్దుతారు. చెన్నైలో 'బొమ్మై కలు' అని, కర్ణాటకలో 'బొమ్మె హబ్బా' అని, ఏపీలో 'బొమ్మలకొలువు' అని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ప్రత్యేకంగా రామాయణ, మహాభారత థీమ్‌లలో దేవుళ్ళ బొమ్మలను చెక్క అల్మారాల్లో అందంగా అలంకరిస్తారు. దీనిపై పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. తమిళనాడులోని కులశేకర పట్టణంలో 'కులసాయి పండుగ' పేరుతో ఈ ఉత్సవాలు జరుగుతాయి.

వారణాసిలో..
వారణాసిలోని రామ్‌నగర్ కోటలో దసరా వేడుకలు నిర్వహిస్తారు. 'వారణాసి రామలీల' పేరుతో 1800వ సంవత్సరం నుంచి చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. కోటను భారీ వేదికగా చేసి అయోధ్య, లంక, అశోకవాటిక సెట్టింగ్స్ ఏర్పాటు చేశారు. ఇవి పర్మినెంట్‌గానే ఉంటాయి. పండుగ రోజుల్లో ఇవి చాలా సహజంగా కనిపిస్తాయి.
అహ్మదాబాద్‌లో..
గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా ఉంటాయి. అహ్మదాబాద్ ఉత్సవ నిర్వహణలో మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ వేడుకల్లో డోలు, బాజాలు వాయిస్తూ రంగురంగుల దుస్తుల్లో కళాకారులు ప్రదర్శించే దాండియా నృత్యాలు చూసి తరించాల్సిందే. అమ్మవారికి సమర్పించే 'గుజరాతీ హారతి' నృత్యం మరింత శోభిల్లుతుంది.

కోల్‌కతాలో..
పశ్చిమ బెంగాల్‌లో దసరాను 'పుజొ' పేరుతో జరుపుకుంటారు. కోల్‌కతాలో కాళికాదేవిని పూజిస్తారు. నగరమంతా పెద్దపెద్ద మండపాలను ఏర్పాటు చేసి, దేదీప్యమానంగా ఈ సంబరాలు జరుపుకుంటారు.
జాతీయోద్యమ ప్రచారానికి, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహానికి ఈ ఉత్సవాలు వేదికగా మారిందీ ఇక్కడే. అదే సామాజిక బాధ్యతను ఇప్పుడూ నిర్వహిస్తున్నారు కోల్‌కతా బెహలాకు చెందిన బారిష క్లబ్ వారు. కరోనా సమయంలో లాక్‌డౌన్ కారణంగా లక్షలాది వలస కార్మికుల బతుకు ప్రయాణం ఎవ్వరూ మరచిపోలేనిది, చరిత్రలో నిలిచిపోయేది. ఎన్ని అవాంతరాలెదురైనా వేల కిలో మీటర్లు పిల్లలు, సంచులు, మూటలు మోస్తూ గమ్యాన్ని చేరుకోవాలనే వారి ఆకాంక్ష, పట్టుదల వెలకట్టలేనిది. అందుకే ఒకవైపు పిల్లలను ఎత్తుకుని.. మరోవైపు సంచులను మోస్తూ.. వలస కార్మిక మహిళ విగ్రహాన్ని.. వారు ఎలా కనిపించారో అలాగే రెండేళ్ల నాడు రూపొందించారు. ఈ విగ్రహాన్ని నగరంలోని మండపాలలో పెట్టి, కాళికాదేవి స్థానంలో కార్మిక మహిళను పూజించారు.

దేశ రాజధానిలో..
దసరా వచ్చిందంటే దేశ రాజధాని ఢిల్లీలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. రామలీలా మైదానంలో చేసే 'రావణ దహనం' కార్యక్రమాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వేలాది మంది ప్రజలు తరలి వస్తారు. కంజక్ పూజ ఇక్కడి ప్రత్యేకం. నవరాత్రుల ఆఖరి రోజున రామలీలా మైదానంలో రావణ, మేఘనాథ, కుంభకర్ణ రూపాలను దహనం చేస్తారు. రాజస్థాన్ కోటలోనూ ఇదే తరహా వేడుకలు నిర్వహిస్తారు.

మైసూర్‌లో..
దసరా ఉత్సవాలకు మైసూర్ ప్రసిద్ధి. దసరా వేడుకకు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ వేడుకలను చూడటానికి దేశ, విదేశాల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఇక్కడి దసరా పండుగ దుర్గ పూజలకే పరిమితంకాక రాష్ట్ర చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక ఉత్సవంలా ఉంటుంది. నవరాత్రుల్లో తొమ్మిదోరోజున రాజు ఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెతో కలిపి ఊరేగిస్తారు.

విజయదశమి అంటేనే దుష్టత్వాన్ని కాలరాచి, విజయ దుందుభి మోగించిన రోజు. పురాణగాథలు ఎలా ఉన్నా.. మహిషాసురులు, రావణాసురులు మన మధ్యలో ఉంటూనే ఉన్నారు. అలాంటి వారి దుష్టత్వాన్ని అంతమొందించాలనే సందేశాన్ని తీసుకుందాం. పాడిపంటలకు నిలయమైన, విభిన్న సంస్కృతులకు ఆలవాలమైన భారతావనిలో ప్రజలు వారివారి సంతోషాలను అందరితో పంచుకునే సందర్భంగా అంకురించినవే. కానీ కాలక్రమేణా వెలసిపోతున్నాయి. కళలు కళావిహీనం అవుతున్నాయి. రకరకాల కథలు చెప్పుకున్నా.. విభిన్న సంస్కృతులను ప్రతిబింబించినా.. ఏ ప్రాంత ప్రజలనైనా ఆనందోత్సాహాలను పంచుకునే ఉత్సవంగా దసరా సరదాలను ఆస్వాదిద్దాం.. ఆహ్వానిద్దాం..
టి టాన్యా
7095858888