ఎండిన నదిలో వర్షం కురవడం లేదు
గొంతులో ఎన్ని నీళ్లు పోసినా తాగుతుంది
పచ్చగడ్డిని కోస్తామంటే నేల ఏడుస్తోంది
సూర్య కిరణాల పొయ్యి మంటను రాజేస్తుంది..
శీతల గృహంలో చిలుక మాట్లాడుతుంటే
మండుటెండలో మానవత్వపు ఎదురుచూపులు
పాదాల చెప్పులు నెత్తిమీద కూర్చుంటే
నీడలేని బతుకు భారమై నిత్యం నడుస్తోంది..
చెమట వర్షంలో తడిచిన సుగంధపు శరీరం
కర్మజలం పుట్టుకకు ప్రశ్నలకు స్పందిస్తూ
కార్మిక లోకపు సౌభాగ్యం వికసించడానికి
రక్తపు చుక్కలు నీటి బిందువై ప్రవహించే..
అర్ధరాత్రి ఉక్కపోతకు ఆరుబయట వెన్నెల్లో
చుక్కలన్నీ కూడదీసుకొని, ఆకాశానికి
చిల్లులు వేస్తే..
చినిగిన ఆకాశపు వస్త్రంతో చల్లగాలి వీస్తుంటే
రాళ్లు మోసి అలసిన తనువు గాఢనిద్రలో జారుకుంది..
మట్టికి పుట్టిన పరిమళం గాలికి ఊగుతుంటే
మొక్కలకు పుట్టిన పువ్వులు మకరందం కారుస్తుంటే..
తనువును సృజించిన చెమట బిందువు నవ్వుతుంటే
రైతు కంట్లో పసిడి ముఖమే కనిపిస్తోంది..
ఎన్ని అక్షరాలు పోగు చేసినా భావం అందడంలేదు
ఇసుక నీటిలో గులకరాళ్ల శబ్దం వినిపించింది
మనసులో ఐశ్వర్యం అంది పుచ్చుకునేందుకు
కవిత్వపు సాలెగూడులో చిక్కుకుని తిరుగుతుంది...
కొప్పుల ప్రసాద్
98850 66235