
అలాంటి పదవిలో ఉండి ఆర్‌ఎస్‌ఎస్ నేతను వెళ్లి కలవటం మర్యాదలను అతిక్రమించటం కాదా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్‌ఎస్‌ఎస్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి వివరించటంతో పాటు తాను వ్యక్తిగతంగా కలసినట్లు సమర్ధించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ మూలాలు ఉన్నవారు రాజభవన్లకు సంబంధించిన అనేక పదవుల్లో ఉన్నారు. మీరంతా వారిని కలుస్తున్నారు. అలాంటపుడు రాజభవన్లో ఉన్న వారు ఆర్‌ఎస్‌ఎస్ వారిని కలిస్తే తప్పేమిటంటూ ఎదురు దాడి, కుతర్కానికి దిగారు. తాను కనీసం ఆరుసార్లు ఆర్‌ఎస్‌ఎస్ సభలకు వెళ్లానని, ఆ సంస్థతో తనకు ఉన్న అనుబంధం అలాంటిదంటూ దానిలో అసాధారణత ఏముందని ప్రశ్నించారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రోటోకాల్‌ను తీసి గట్టున పెట్టి ఆర్‌ఎస్‌ఎస్ నేత ఇంటికి వెళ్లి కలసి వచ్చారు. రాజభవన్ వెలుపలికి తానుగా వెళ్లి ప్రయివేటు వ్యక్తులను గవర్నర్లు కలిసిన దాఖలా లేదు. 2015లో ఉత్తర ప్రదేశ్ రాజభవన్లో నాటి గవర్నర్ రామ్ నాయక్ ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్‌ను కలిశారు. కేరళ గవర్నర్ సోమవారం నాడు (19వ తేదీ) తొలిసారిగా విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసిన తన చర్యను సమర్ధించుకున్నారు. తాను అధిపతిగా ఉన్న రాష్ట్రానికి భగవత్ వచ్చారు, అసలు ఆయన వస్తున్నట్లు నాకు తెలియదు, తెలియగానే వెళ్లి కలిశాను. మరోసారి గనుక వస్తే తిరిగి కలుస్తాను-అంటూ తన చర్య గురించి ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా మాట్లాడారు. దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని తరువాత గవర్నర్ వస్తారు. అలాంటి పదవిలో ఉండి ఆర్‌ఎస్‌ఎస్ నేతను వెళ్లి కలవటం మర్యాదలను అతిక్రమించటం కాదా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్‌ఎస్‌ఎస్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి వివరించటంతో పాటు తాను వ్యక్తిగతంగా కలసినట్లు సమర్ధించు కున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ మూలాలు ఉన్నవారు రాజభవన్లకు సంబంధించిన అనేక పదవుల్లో ఉన్నారు. మీరంతా వారిని కలుస్తున్నారు. అలాంటపుడు రాజభవన్లో ఉన్న వారు ఆర్‌ఎస్‌ఎస్ వారిని కలిస్తే తప్పేమిటంటూ ఎదురు దాడి, కుతర్కానికి దిగారు. తాను కనీసం ఆరుసార్లు ఆర్‌ఎస్‌ఎస్ సభలకు వెళ్లానని, ఆ సంస్థతో తనకు ఉన్న అనుబంధం అలాంటిదంటూ దానిలో అసాధారణత ఏముందని ప్రశ్నించారు.
కమ్యూనిజం విదేశీ సిద్ధాంత మంటున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ రేపు ప్రజాస్వామ్యాన్ని కూడా అలాగే తృణీకరిస్తారని కేరళ సిఎం పినరయి విజయన్ చెప్పారు. సోమవారం నాడు కన్నూరులో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ పదవి గౌరవాన్ని మంటకలిపి వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష నేతల స్థాయికి దిగజారవద్దని గవర్నర్‌కు హితవు చెప్పారు. ఒక ఆర్‌ఎస్‌ఎస్ భక్తుడిగా, కమ్యూనిస్టు వ్యతిరేకిగా ప్రవర్తిస్తున్నారని రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీని అర్ధం చేసుకోవాలని అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించకూడదన్నారు. వామపక్ష ప్రభుత్వ కమ్యూనిస్టు భావజాలం విదేశీదని, ఇక్కడికి తీసుకువచ్చారని, అసమ్మతిని అణచేందుకు హింసను అనుమతిస్తుందని అంతకు ముందు విలేకర్ల సమావేశంలో గవర్నర్ ఆరోపించారు. దాన్ని ప్రస్తావించిన విజయన్ ఇటలీ లోని ఫాసిజం ప్రాతిపదికపై ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉందని దాన్ని అక్కడి నుంచి, కమ్యూనిజం- క్రైస్తవం-ముస్లిం వ్యతిరేకతను హిట్లర్ నుంచి అరువు తెచ్చుకున్నారని చెప్పారు.
గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ రాజభవన్ను బిజెపి భవన్‌గా దిగజార్చడమే కాదు, పార్టీ నేత మాదిరి అవకాశం వచ్చినపుడల్లా ప్రభుత్వం, పాలక సిపిఎం మీద విరుచుకుపడుతున్నారు. 2019 డిసెంబరులో కన్నూరులో తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని వెల్లడిస్తానంటూ 2022 సెప్టెంబరు 19న విలేకర్లను రాజభవన్‌కు రప్పించారు. కొండంత రాగం తీసి కీచుగొంతుతో అరచినట్లు ప్రహసనప్రాయంగా ముగించారు. మూడు సంవత్సరాల నాడు కన్నూరులో జరిగిన భారత చరిత్రకారుల సభలో ప్రారంభ ఉపన్యాసం పేరుతో చేసిన గవర్నర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆ సభలో పాల్గొన్నవారు తీవ్ర నిరసన తెలిపారు. చరిత్రకారుల సభలో సంబంధిత అంశాలు గాకుండా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ (సిఎఎ), ఎన్‌ఆర్‌సికి మద్దతు పలుకుతూ...వ్యతిరేకిస్తున్నవారిని విమర్శించటంతో సభలో కొందరు తీవ్ర నిరసన తెలిపారు. ఆ సభలో వేదిక మీద ఉన్న ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ గవర్నర్ చర్యకు నిరసన తెలుపుతూ ఈ విధంగా మీరు మాట్లాడేట్లయితే గాంధీ బదులు గాడ్సే గురించి చెప్పండనటాన్ని పత్రికలు ప్రస్తావించాయి. తన అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందంటూ నిరసన తెలుపుతున్నవారితో గవర్నర్ వాదులాటకు దిగారు. ఈ తరుణంలో వేదిక మీద ఉన్న సిపిఎం నేత కెకె రాగేష్ పోలీసులు-నిరసన తెలుపుతున్నవారి వద్దకు వెళ్లి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. ఆ దృశ్యాలున్న వీడియో క్లిప్పింగ్‌ను గవర్నర్ విలేకర్లకు అందచేశారు.
ఆ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి సన్నిహితుడైన రాగేష్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవటం, తనను అవమానించటం, భయపెట్టటం కుట్రలో భాగమని ఆరోపించారు. ఆ సభకు తనను ఆహ్వానించిన కన్నూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి గోపీనాధ్ రవీంద్రన్ కూడా కుట్రలో భాగస్వామే అన్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారన్న ప్రశ్నకు తనకు ఇటీవలే నాటి వీడియో దొరికిందని, దాన్లో పోలీసులను అడ్డుకుంటున్న రాగేష్‌ను చూశానని గవర్నర్ చెప్పుకున్నారు. ఈ కుట్ర గురించి ఇటీవలే తెలిసిందని కూడా చెప్పారు. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన ఒక స్నేహితుడు కన్నూరులో ఏం జరగనుందో తమకు ఐదు రోజుల ముందే తెలుసునని చెప్పాడని కేరళ ఇంటిలిజెన్స్ ఏం చేస్తున్నదని కూడా అడిగాడంటూ గవర్నర్ కథ వినిపించారు. ప్రముఖ చరిత్ర కారుడు ఇర్ఫాన్ హబీబ్ తనపై హత్యాయత్నం చేశాడని చెప్పటం అతిశయోక్తి కాదా అన్న ప్రశ్నకు గవర్నర్ ఇర్ఫాన్ హబీబ్‌ను కించపరుస్తూ దూషణలకు దిగి హబీబ్ తనను బెదిరించేందుకు, భయపెట్టేందుకు చూశారని ఆరోపించారు. అంతే కాదు అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ రోజుల నుంచి హింసాత్మక చర్యలకు పాల్పడేవారని, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘానికి నాయకుడిగా ఉన్నారని, దెబ్బలాటలకు దిగేవారని అందువలన ఇక్కడ కూడా అదే చేశారని అనుకున్నానని కానీ తరువాత ఒక కుట్ర ప్రకారమే జరిగిందని తెలిసిందని ఆరోపించారు. గవర్నర్ ప్రదర్శించిన క్లిప్పింగ్‌ను చూసిన వారెవరికీ ఇర్ఫాన్ హబీబ్ అనుచితంగా ప్రవర్తించినట్లు ఏమాత్రం అనిపించలేదు. అయితే దాన్ని చూసినపుడు గవర్నర్ చేసిన అనుచిత ప్రసంగం హబీబ్‌కు ఆగ్రహం తెప్పించినట్లుగా కనిపించింది. మౌలానా అబుల్ కలామ్ అజాద్ గురించి తప్పుగా ఉటంకిస్తున్నారని, దాని బదులు గాడ్సే గురించి చెప్పాలని తన స్ధానం నుంచి లేచి ఇర్ఫాన్ హబీబ్ అన్నట్లు దానిలో ఉంది. గవర్నర్ ఆరోపణలు పసలేని, కట్టుకథలు తప్ప మరొకటి కాదు. ఈ పత్రికా గోష్టి లోనే గవర్నర్ కమ్యూనిజం మీద, పాలక పార్టీ నేతల మీద నోరుపారవేసుకున్నారు. వారిని ఉగ్రవాదులతో పోల్చారు.
వివాదాస్పద బిల్లులపై తాను ఆమోదం వేసేది లేదని ప్రకటించిన గవర్నర్ అదే చేశారు. అసెంబ్లీ ఆమోదించిన పదకొండు బిల్లులకు గాను ఐదింటి మీద సంతకం చేసి అక్టోబరు మూడు వరకు ఢిల్లీలో ఉండేందుకు బుధవారం నాడు వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు. ప్రతిదాని మీద సంతకం చేసేందుకు తాను రబ్బరు స్టాంపును కానని కొద్ది రోజుల క్రితం గవర్నర్ ప్రకటించారు. అసెంబ్లీలకు బిల్లులను ఆమోదించే అధికారం ఉంటే వాటిని తన ఆమోదానికి పంపినపుడు అవి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నదీ లేనిదీ నిర్ణయించే అధికారం తనకు ఉన్నదని అన్నారు. ఒకసారి తిప్పి పంపిన బిల్లులను మరోసారి సవరణలతో లేదా వాటినే తిరిగి అసెంబ్లీ పంపితే వాటిని ఆమోదించటం మినహా మరొక మార్గం గవర్నర్లకు లేదని నిబంధనలు చెబుతున్నాయి. తాజా పరిణామాలను బట్టి ప్రభుత్వంతో లడాయి పెట్టుకొనేందుకు గవర్నర్ సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
ఎం. కోటేశ్వరరావు