
సమాజంలో అణగారిన తరగతులైన షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికా వ్యయంలో ప్రత్యేక కేటాయింపుగా వున్న సబ్‌ప్లాన్ విధానాన్ని కొనసాగించడం అవశ్యం. కేంద్ర ప్రభుత్వం 1980వ దశకంలోనే చట్టపరంగా తీసుకొచ్చిన ఈ సబ్‌ప్లాన్ విధానం నయా ఉదారవాద ఆర్థిక విధానాలు వచ్చాక క్రమంగా నీరుగారుతూ వచ్చింది. రాష్ట్ర స్థాయిలో సబ్‌ప్లాన్ చట్టం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఉద్యమం సాగిన ఫలితంగానే ప్రభుత్వం 2013లో చట్టం చేసింది. అయితే, దాని కాల పరిమితి పదేళ్లుగా నిర్ణయించడంతో రానున్న జనవరి 24వ తేదీతో గడువు ముగుస్తుంది. సబ్ ప్లాన్ చట్టాన్ని కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టాలని దళితులు, గిరిజనులు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళన చేయవలసిరావడం విచారకరం. అట్టడుగు వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం ఇలాంటి కీలకమైన అంశంపై మీనమేషాలు లెక్కించడం మాని కార్యాచరణకు ఉపక్రమించాలి.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్రంలో సబ్‌ప్లానును క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను తీసుకురావడమే పరమ తిరోగమన చర్య. అసలు ప్లానే లేకపోతే ఇక సబ్‌ప్లాన్ ఇంకెక్కడ అనే స్థితి తెచ్చారు. కాని దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబకడంతో బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తున్నారు. కాని, అదంతా ఖర్చు చేయకుండా కోతలు పెట్టడం, ఇంకొన్ని నిధులను దారి మళ్లించడం షరా మామూలే! కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీలిస్తున్న మోడీ సర్కారు ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమానికి కనీస కేటాయింపులను కూడా ఖర్చు చేయకపోవడం సంఘపరివార్ నైజానికి నిదర్శనం. కాని, కేరళ లోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టిల జనాభా శాతం కన్నా ఎక్కువ శాతం నిధుల్ని ప్రణాళికా వ్యయంలో కేటాయించడం శ్లాఘనీయం. దేశంలో అలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంకేదీ లేదు.
రాష్ట్రంలో సబ్‌ప్లాను చట్టం చేయడంతో నిధుల కేటాయింపు, ఖర్చునకు కొంత గ్యారంటీ వచ్చింది. కాని, 2018 నుండి రాష్ట్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు క్రమంగా తగ్గిస్తున్నారు. నిధుల మళ్లింపు యథేచ్ఛగా సాగిపోతోంది. జనాభా ప్రాతిపదికగా సబ్‌ప్లాన్ నిధులు కేటాయించాలి. ఆ ప్రకారం చూస్తే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో 20 వేల కోట్ల రూపాయలు కేటాయించాలి కానీ అది కేవలం రూ.17,403 కోట్లు మాత్రమే. ఇందులోనూ ఎస్‌సి ఎస్‌టిల అభివృద్ధికి ఖర్చు చేసింది సుమారు ఐదు వేల కోట్లు మాత్రమేననీ మిగతా 12 వేల కోట్లను ఇతర పథకాలకు మళ్లించారన్న ఆరోపణ సత్య దూరం కాకపోవచ్చు. సబ్‌ప్లాన్ నిధులను ఆ తరగతులవారు నివసించే ప్రాంతాలు అంటే దళిత వాడలు, గిరిజన గూడేలు, తండాల అభివృద్ధికి, ప్రత్యేకించి మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలి. చట్టం స్పష్టంగా చెబుతున్నా, గతంలోనూ, ఇప్పుడూ ప్రభుత్వాలు ఆ రీతిలో ఖర్చు చేయడంలేదు. రోడ్లు వేయడానికి, సాగు నీటి ప్రాజెక్టులకూ సబ్ ప్లాన్ నిధులనే వాడేయడం దారుణం. ఎవరైనా ప్రశ్నిస్తే వారూ వాడుకుంటారు కదా అన్న ఏలినవారి సమాధానం పేదలను, సబ్‌ప్లాన్ చట్టాన్ని వెక్కిరించడమే! ఆయా తరగతుల అభివృద్ధికి ప్రత్యేకించి ఖర్చు చేయవలసిన నిధులను నవరత్నాల్లో భాగంగా సాధారణ పథకాలకు వెచ్చించడం ధర్మం కాదు.
ప్రభుత్వ రంగాన్ని పాలకులు క్రమంగా కుదించివేయడంతో సామాజిక న్యాయం చతికిలపడుతోంది. ఎస్‌సి, ఎస్‌టి లకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్ల కోసం ఉద్యమించవలసిన పరిస్థితి. అణగారిన వర్గాల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. కనుక ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు వెచ్చించేలా సబ్‌ప్లాన్ చట్టం కొనసాగాల్సిందే. కేటాయింపులు అణగారిన తరగతులవారి అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి. కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులు మళ్లించే వీలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి న్యాయమైన డిమాండ్లతో వివిధ సామాజిక సంఘాలు, సంస్థలు విశాల ఐక్య ఉద్యమం సాగించాలి. దానికి అభివృద్ధి కాముకుల, ప్రగతిశీల శక్తుల మద్దతు తప్పక లభిస్తుంది. ప్రభుత్వాలు ప్రజా ఒత్తిడికి తలొగ్గక తప్పదు.