ప్రజాశక్తి-కొండాపురం (నెల్లూరు) : మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన మండలంలోని చిన్నపల్లె గ్రామం నీట మునిగింది. ఈ గ్రామానికి పక్కగా గండికోట ప్రాజెక్ట్ లో అంతర్భాగంగా తిమ్మాపురం చెరువు నిర్మించడంతో గ్రామంలో నుంచి నీరు బయటికి వెళ్లకుండా ఆగిపోతున్నాయని, గత ఏడు సంవత్సరాలుగా సమస్యను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు చిన్నపల్లి గ్రామస్తులు స్వయంగా వెళ్లి విన్నవించుకున్నప్పటికీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తమ గ్రామాన్ని గండికోట ప్రాజెక్టులో ముంపు గ్రామంగా ప్రకటించి పరిహారం చెల్లించాలని అనేకసార్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో తమ బతుకులు నీట మునగాల్సిందేనా అంటూ చిన్నపల్లె గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చిన్నపల్లె గ్రామాన్ని ముంపు గ్రామముగా ప్రకటించి పరిహారం చెల్లించాలని వారు కోరారు.










