- రేవతి సైన్స్ ఫౌండేషన్ అధ్యక్షులు కృష్ణ సాయి
ప్రజాశక్తి - పెద్దాపురం (కాకినాడ) : భారతదేశం ఆధునిక వైజ్ఞానిక దేశంగా అభివృద్ధి చెందాలంటే విద్యార్థులకు చిన్ననాటి నుండి నూతన ఆవిష్కరణలపై ఆసక్తిని పెంపొందించాలని రేవతి సైన్స్ ఫౌండేషన్ అధ్యక్షులు కృష్ణ సాయి అన్నారు. స్థానిక వరహాలయ్య పేటలోని యాసలపు సూర్యారావు భవనంలో పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో గురువారం ఆయన వివిధ సైన్సు ప్రయోగాలు నిర్వహించి విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఈ ప్రయోగాలు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనేక ఆవిష్కరణలకు విద్యార్థి దశలోనే బీజాలు పడతాయన్నారు. నిరంతర పరిశీలన నూతన ఆలోచనలకు తావిస్తుందని, ఈ ఆలోచనలు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. తరగతుల సిలబస్ నుండి సైన్సును, పరిణామ సిద్ధాంతాలను తొలగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సైన్స్ ప్రయోగాలను ఎంత ఎక్కువగా విద్యార్థులలో ప్రోత్సహిస్తే అంత ఎక్కువగా ఆధునిక భారతదేశం వైజ్ఞానికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబడుతుందన్నారు. ఈ శిక్షణా శిబిరంలో జేవీవీ జిల్లా కార్యదర్శి ఈశ్వరరావు, సైన్స్ అండ్ టెక్నాలజీ కన్వీనర్ బుద్దా శ్రీనివాసరావులు ప్రసంగించారు. ఈ శిబిరంలో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎంఎస్సీ మూర్తి లెక్కలు, రేవతి క్రాఫ్ట్, దుంగల పూజిత కరాటే, శ్యామ్ కుమార్ డ్రాయింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా శిబిరాన్ని రొంగల అరుణ్, డి.కృష్ణ, జ్యోత్స్న, కూనిరెడ్డి అరుణ, రవికుమార్, అమృత, నమ్రత, శ్యామ్ కుమార్ తదితరులు పర్యవేక్షించారు.











