- రాష్ట్ర ప్రభుత్వ సనాతన ధర్మ ప్రచారంపై సిపిఎం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పాఠశాల నుండి కళాశాలస్థాయి వరకు సనాతన హిందూ ధర్మ ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ అడుగుజాడల్లో విద్యను కాషాయీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం గర్హనీయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహ, సేవా దృక్పథం పెంచే విధంగా సిలబస్, ప్రచారం ఉండాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు అన్ని కులాలు, మతాలకు చెందిన వారుంటారని, ఇది లౌకిక రాజ్యాంగమని తెలిపారు. రాజ్యాంగ బద్ధులై ఉంటామని ప్రమాణం చేసిన రాష్ట్ర మంత్రి పాఠశాలల్లో మతప్రచారం చేస్తామని ప్రకటించడం విద్యార్థుల మధ్య చిచ్చు రేపుతుందని, సామాజిక అశాంతికి దారితీస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్రంలో అవకాశం దొరికిన చోట మత ఘర్షణలు రెచ్చగొట్టడాన్ని చూస్తున్నాయని, వైసిపి ప్రభుత్వం వారి ఒత్తిళ్లకు లొంగి మతోన్మాదుల పట్ల మెతగ్గా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటికే విద్య వాణిజ్యపరమైందని, దానికి తోడు కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేసిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ అడుగుజాడల్లో నడవడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మత వైషమ్యాలను పెంచి సమైక్యతను దెబ్బతీస్తుందని, వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించాలని కోరారు.










