
ఇరాన్‌లో హిజాబ్ తప్పనిసరిగా ధరించాలనే నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు గత నెల రోజుల నుండి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. బహిరంగంగా హిజాబ్‌ను తీసి తగులబెడుతూ, జుత్తు కత్తిరించివేస్తూ... అనేక రూపాల్లో తమ నిరసనలు పెద్ద ఎత్తున తెలియజేస్తున్నారు. తాము ఏం ధరించాలో ఏం ధరించకూడదో శాసించడానికి మీరెవరు (పాలకులు, మత ఛాందసవాదులు)? అంటూ ఇరాన్ మహిళలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు తమ విధానాలు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. మరో అమినీని హిజాబ్‌కి బలి కానివ్వబోమంటూ పోరాటం సాగిస్తున్నారు.
కుటుంబంతో కలిసి ప్రయాణం చేస్తున్న 22 ఏళ్ల యువతి అమినీ హిజాబ్ సరిగ్గా ధరించలేదనే కారణంతో గత నెలలో ఇరాన్ మొరాలిటీ పోలీసులు అరెస్టు చేసి, చిత్ర హింసలకు గురి చేశారు. పోలీసు కస్టడీలో ఉండగానే గుండెపోటుతో హాస్పటల్‌లో చేరిన అమినీ కోమా లోకి వెళ్ళి వారం రోజుల తరువాత మరణించింది. హిజాబ్ కోసం ప్రాణాలు తీస్తారా? అంటూ ఆమె మరణించిన గంటలోనే దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమ య్యాయి. అవి మరింతగా పెరిగి నగరాల్లోనే గాక గ్రామాలు, విద్యాలయాలతో సహా ఇరాన్ మొత్తం అట్టుడుకుతున్నది. హిజాబ్ ధరించాలా లేదా అనేది మా ఎంపిక. కచ్చితంగా ధరించాలి అని చెప్పడానికి ఈ పాలకులెవరు? ప్రభుత్వాలు తమ నిరంకుశ విధానాలు వదులుకోవాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదంటూ నినదిస్తున్నారు. ఈ పోరాటంలో కేవలం మహిళలే కాదు. పురుషులు కూడా పాల్గొంటున్నారు. పోలీసులు ఆందోళనకా రులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపుగా 60 మంది మరణించారు. ఉద్యమంలో పాల్గొన్న వారిపై పెనాల్టీలు వేస్తున్నారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా అరెస్టులు చేస్తున్నారు. అయినా ఉద్యమం ఆగడం లేదు. హిజాబ్‌కి వ్యతిరేకంగా ఇరాన్ మహిళల పోరాటం గత నెల రోజుల నుండి కోనసాగుతూనే ఉంది.
స్వేచ్ఛ కోసం పోరాటం
ఇరాన్ మహిళలు స్వేచ్ఛ కోసం పోరాడడం కొత్తేమీ కాదు. వాస్తవానికి 1979లో ఇరాన్‌లో జరిగిన ఇస్లామిక్ రివల్యూషన్‌లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అప్పటి వరకూ ఉన్న పాలీగమీ (బహు భార్యత్వం)పై వివిధ పోరాటాలు చేసి విజయం సాధించారు. ఇదే కాదు. మహిళలపై వివక్షత చూపే చట్టాలను రద్దు చేయాలని అనేక పోరాటాలు నిర్వహించారు. మతం పేరుతో గాని, నిరంకుశ ప్రభుత్వ విధానాల పేరుతో గాని ఎప్పుడు హక్కులపై దాడి జరిగినా సరే పోరాటాల ద్వారా తమ వాణి వినిపించిన చరిత్ర ఇరాన్ మహిళలకు ఉంది. అయితే ఇప్పటి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 1980 వరకూ హిజాబ్ సాధారణ మతాచారంగా మాత్రమే ఉంది. కానీ 1981 నుండి ఇస్లామిక్ దేశమైన ఇరాన్‌లో మహిళలు హిజాబ్ తప్పనిసరిగా ధరించాలనే నిబంధనలతో పాలకులు షరియా చట్టాన్ని తీసుకొచ్చారు. షరియా చట్ట ప్రకారం ఏడేళ్ల వయసు నుండే ఆడపిల్లలు హిజాబ్ ధరించాలి. హిజాబ్ లేకుండా స్కూళ్లు, హాస్పిటళ్లు, బహిరంగ ప్రదేశాల్లోకి వారికి అనుమతి లేదు. 1996లో ఈ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. ఇలా అప్పటి నుండి హిజాబ్‌పై ఆంక్షలు పెరుగుతూనే వచ్చాయి. మరలా ఇప్పటి ఇరాన్ అధ్యక్షుడు మరొకడుగు ముందుకు వేసి హిజాబ్ తప్పనిసరి చేస్తూ (గత జులై 5న) ఉత్తర్వులు జారీ చేశాడు. అంతటితో ఆగక హిజాబ్ పర్యవేక్షణ కోసం మొరాలిటీ పేరుతో ప్రత్యేకమైన పోలీసు యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. మహిళలు హిజాబ్ సరిగ్గా ధరించారా లేదా అనేది చూడడం, ధరించని వారిపై జరిమానాలు విధించి, జైలు శిక్షలు వేయడం ఈ పోలీసు యంత్రాంగం పని. అందుకే అక్కడ మహిళలు 'హిజాబ్ మై చాయిస్' అంటూ గత పదేళ్లుగా నినదిస్తూనే ఉన్నారు.
ఎంపిక ఆమెదే
ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్‌లో హిజాబ్ వద్దు అంటున్నారు. సెక్యులర్ ఇండియాలో హిజాబ్ కావాలి అంటున్నారు. కర్ణాటకలో జరిగిన ఘటన మనందరికీ తెలుసు. హిజాబ్ ధరించి కాలేజీకి రాకూడదంటూ ఓ అమ్మాయిపై మత చాందసవాదులు చేసిన అల్లరి దేశమంతా చూసింది. విద్యాలయాల్లో హిజాబ్ ధరించకూడదని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం తీర్పు కూడా ఇచ్చింది (సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ విషయమై భిన్నాభిప్రాయాలను వెలిబుచ్చింది). కుల, మత, ప్రాంత, లింగ బేధాలు లేవని, అందరూ సమానమని చెప్పడానికి చిహ్నంగా యూనిఫామ్ పెట్టారని, అటువంటప్పుడు హిజాబ్ ధరించి కాలేజీకి రాకూడదు కదా అంటూ కొందరు మేధావులు వాదించారు కూడా. ఏదేమైనా మై డ్రస్ మై చాయిస్. నేను హిజాబ్ ధరిస్తాను అని ఆమె ధైర్యంగా చెప్పింది.
ఇండియా లోనే కాదు. టర్కీలో కూడా హిజాబ్ ధరిస్తామంటూ పోరాటాలు జరిగాయి (అక్కడా హిజాబ్ ధరించకూడదనే చట్టాలు ఉన్నాయి). మహిళలు కావాలనుకుంటే ధరిస్తారు. వద్దనుకుంటే వేసుకోరు. వస్త్రధారణ మహిళలు ఎంపిక చేసుకునేలా వుండాలి. ఆడపిల్లల చదువుకు ఆటంకం కాకూడదు. ప్రభుత్వమో లేదా మత పెద్దలో మీరు ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చెప్తే స్వీకరించడానికి నాగరిక మహిళలు సిద్ధంగా లేరు.
- ఎల్. చిన్నారి,
ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు,
సెల్ : 7382004271