- దేశ వ్యాప్తంగా రెండో దశ ఉద్యమానికి సన్నద్ధం
అశోక్ ధావలే ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : రైతులకు వ్యతిరేకంగా రూపొందించిన వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న సందర్భంగా గతేడాది నవంబరులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంతవరకూ అమలుకు నోచుకోలేదని అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే పేర్కొన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా కిసాన్ సంయుక్త మోర్చా (ఎస్‌కెఎం) ఆధ్వర్యంలో 13 నెలలపాటు పోరాటం జరిగిందని, తరువాత కేంద్రం దిగి వచ్చి చట్టాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిందని తెలిపారు. గుంటూరులో శని, ఆదివారాల్లో జరిగిన ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలకు హాజరైన అశోక్ ధావలే 'ప్రజాశక్తి ప్రతినిధి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు తెలియజేశారు.
మూడు వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమిటి ?
పంటల ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర ఇవ్వాలన్న స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలుకు కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. విద్యుత్తు సంస్కరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, రైతాంగ ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని, లఖింపూర్ ఘటనలో కీలకమైన కేంద్ర మంత్రి అజరు మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశాం. వీటి అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పిన కేంద్రం... ఇంతవరకూ ఇందుకు సంబంధించి ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. వీటితోపాటు కొత్తగా మరో మూడు డిమాండ్లతో రెండో దశ పోరాటానికి సన్నద్ధం అవుతున్నాం.
రెండో దశ ఉద్యమంలో ప్రధాన డిమాండ్లు ఏమిటి ?
ప్రస్తుతం వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడింది. కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు, రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి మళ్లీ ఉద్యమం చేయాలని కార్యాచరణ రూపొందించాం. రైతులకు సంపూర్ణ రుణ మాఫీ చేయాలి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. 60 ఏళ్లు దాటిన రైతులకు పింఛను సదుపాయం కల్పించాలి. బీమా పథకాలను పునర్‌వ్యవస్థీకరించాలి. కేంద్రం ఇచ్చిన హామీలతో పాటు ఈ డిమాండ్ల సాధనకు మరో విడత పోరాటానికి సన్నద్ధం అవుతున్నాం. బ్యాంకుల నుంచి వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలి. గత ఎనిమిదేళ్లలో అంబానీ, ఆదాని తదితర కార్పొరేట్ సంస్థలకు రూ.10.72 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. కానీ, రైతులకు మాత్రం ఒక్క రూపాయీ మాఫీ చేయలేదు. గత ఎనిమిదేళ్లలో లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలి. ప్రధాన మంత్రి బీమా పథకాలను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించాలి. ఈ బీమా పథకాల వల్ల రైతుల కన్నా బీమా కంపెనీలకు ఎక్కువగా మేలు కలుగుతోంది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బీమా పథకాల నుంచి బయటకు వచ్చాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతింటున్న రైతులకు గ్రామం యూనిట్‌గా బీమా పరిహారం అందించాలి. బీమా అమలుకు ఉన్న ఆంక్షలను సడలించాలి. 60 ఏళ్ల వయస్సు దాటిన సన్న, చిన్నకారు రైతులకు నెలకు రూ.5 వేలు పింఛను ఇవ్వాలి.
మరో ఉద్యమానికి కార్యాచరణ ఏమిటి ?
ఢిల్లీ సరిహద్దులో రైతాంగ పోరాటాలు ప్రారంభమై ఈ ఏడాది నవంబరు 26వ తేదీకి రెండేళ్లు అవుతున్నాయి. అదే రోజున రాజ్యాంగ ఆమోద దినోత్సవం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతు డిమాండ్ల సాధనకు ఈ నెల 26న అన్ని రాష్ట్రాల్లో రాజ్‌భవన్‌ల వద్ద వేలాదిమంది రైతులలో ర్యాలీలు జరగనున్నాయి. రాష్ట్రాల గవర్నర్ల ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రాలు సమర్పిస్తాం. డిసెంబరు ఒకటో తేదీ నుంచి 11వ తేదీ వరకూ దేశ వ్యాప్తంగా పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులకు వినతిపత్రాలు అందిస్తాం. డిసెంబరు ఎనిమిదిన హర్యానాలోని కర్నాల్‌లో భవిష్యత్తు కార్యాచరణ కోసం రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తాం. డిసెంబరు 13 నుంచి 16 వరకు త్రిచూర్‌లో జరగబోయే ఎఐకెఎస్ ఆలిండియా మహాసభలో తుది కార్యాచరణ ప్రకటిస్తాం. రైతాంగ సమస్యలతోపాటు కార్మిక చట్టాల స్థానంలో నూతనంగా తెచ్చిన లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా సిఐటియు, ఎఐకెఎస్, ఎఐఎడబ్ల్యుయు తదితర సంఘాలతో కలిసి దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నాం. వీటిపై ఈ ఏడాది సెప్టెంబరు ఐదున ఢిల్లీల రెడ్‌ఫ్లాగ్ డే నిర్వహించాం. వచ్చే ఏడాది ఏప్రిల్ ఐదున ఐదు లక్షల మందితో ఢిల్లీలో ర్యాలీ నిర్వహిస్తాం. రైతుల డిమాండ్లతోపాటు ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకిస్తూ పోరాటం చేయనున్నాం. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని విస్తరించి పట్టణ ప్రాంతాల్లోని వ్యవసాయ కార్మికులకు కూడా ఉపాధి కల్పించాలనే డిమాండ్‌తో ఆందోళన చేయనున్నాం. ఢిల్లీలో జరిగే ర్యాలీకి సంబంధించి జనవరి 5 నుంచి మార్చి 31 వరకూ గ్రామ స్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు, పాదయాత్రలు నిర్వహించనున్నాం. ఐదో తేదీన పార్లమెంటుకు ఐదు లక్షల మందితో ర్యాలీ నిర్వహిస్తాం.
రైతాంగ పోరాటం తర్వాత కేంద్ర ప్రభుత్వ తీరు ఎలా ఉంది ?
కేంద్రం తీరు ఏమీ మారలేదు. రాజ్యాంగంపై దాడి జరుగుతోంది. ప్రజాస్వామ్యాన్ని, సెక్కులరిజాన్ని దెబ్బతీసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.










