Aug 21,2022 10:07

'ఎక్కడమ్మా నీవు లేనిది.. ఏమిటీ నువ్వు చేయలేనిదీ..' అంటూ అది ఇది ఏమని అన్ని రంగాల్లో స్త్రీ భాగస్వామ్యం అత్యవసరం. అందుకే స్త్రీలకు విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఆహారం, చివరకు రాజకీయాల్లో సైతం వారి భాగస్వామ్యం తప్పనిసరి. స్త్రీ సమాన భాగస్వామ్యంతోనే ఏ రంగంలోనైనా ప్రగతి సాధించగలం. అందుకే స్త్రీ సమానత కోసం పోరాటం జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీ సమానత కోసం పోరాటం.. సమాజాభివృద్ధికీ దోహదపడుతుంది. స్త్రీల భాగస్వామ్యంతోనే సమాజాభ్యున్నతి సాధ్యమవుతుంది. అందుకే స్త్రీలకు అన్నిరంగాల్లో భాగస్వామ్యం కల్పించేందుకు పోరు జరపాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ నెల 26న 'జాతీయ మహిళా సమానత్వ దినోత్సవం' సందర్భంగా ప్రత్యేక కథనం..

 

01

 

హిళలకు సరైన విద్యావకాశాలు ఇవ్వకుండా.. వారికి ఉపాధి మార్గాలు చూపించకుండా.. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టకుండా.. రాజకీయాల్లో సమ ప్రాధాన్యత లేకుండా.. ప్రగతి సాధించామన్నా.. అభివృద్ధిలో ముందున్నామన్నా.. అది డొల్లతనమే. అలా ఏ దేశం చెప్పుకున్నా అవాస్తవమే అవుతుంది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పినా.. అది అసంపూర్ణమైన అభివృద్ధే అవుతుంది. సమానత్వ సాధన కోసం, బహుశా మరో శతాబ్దం కూడా మహిళా పోరాటాలు సాగించాల్సిందే. అందుకు మహిళలంతా ఏకమవ్వాల్సిందే. అందరూ కదలి రావాల్సిందే. అందుకు ఈ ఏడాది ఆగస్టు 26 ''మహిళల సమానత్వ దినోత్సవం'' నాంది కావాలి.

                                                                     ఏ దేశంలోనైనా..

అమెరికాలోనైనా, ఇండియాలోనైనా మహిళలు పొందుతున్న ప్రతి హక్కు.. పోరాడి సాధించుకున్నదే. అమెరికాలో మహిళలు తమకు ఓటుహక్కు కావాలని చేసిన పోరాటానికి సూచిక ఆగస్టు 26, మహిళల సమానత్వ దినోత్సవం. అభివృద్ధి చెందిన దేశమని, కలల సౌధమని గొప్పగా చెప్పుకునే అమెరికాలో వందేళ్ల క్రితం వరకు కూడా మహిళలకి ఓటు హక్కే లేదు. అక్కడి మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నూరేళ్ల నాడే రోడ్డు మీదకొచ్చారు. పురుషులతో సమానంగా తమకు ఓటు హక్కుతో పాటు, అన్ని హక్కులూ కావాలని డిమాండ్‌ చేశారు.

 

02


 

                                                                       నేపథ్యం..

ఈ పోరాటాల తర్వాతే వారికి ఓటు హక్కును కల్పిస్తూ.. అమెరికా 1920, ఆగస్టు 26న రాజ్యాంగంలోని 19వ సవరణ ద్వారా ఒక తీర్మానం చేసింది. దీనికి స్ఫూర్తిగా 1972లో ప్రెసిడెంట్‌ రిచర్డ్‌ నిక్సన్‌ ఆగస్ట్‌ 26న ''సమానత్వ దినోత్సవం''గా జరపాలని అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 26న మహిళల సమానత్వ దినంగా జరుపుకోవాలని.. 1973లో మహిళా హక్కుల కార్యకర్త, న్యాయవాది, న్యూయార్క్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి బెల్లా అబ్గుగ్‌ మరోసారి తీర్మానం ప్రవేశపెట్టగా, అమెరికా కాంగ్రెస్‌ దాన్ని ఆమోదించింది. అదే సంవత్సరం మొదటిసారి అమెరికాలో ''మహిళల సమానత్వ దినోత్సవం'' జరుపుకోవడం మొదలైంది. ఇదీ ఆగస్టు 26, మహిళల సమానత్వ దినోత్సవ నేపథ్యం.
 

                                                                     మన దేశంలో..

భారత్‌ విషయానికొస్తే, బ్రిటీష్‌ పాలకులు 1921లో మొదటిసారి, బాంబే మరియు మద్రాస్‌ ప్రావిన్స్‌లో కొంతమంది మహిళలకు ఓటు హక్కు అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326లో ప్రస్తావించినట్లు.. 1950లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. పురుషులతో సమానంగా మహిళలందరికీ తొలిసారి ఓటు హక్కును కల్పించారు. మహిళలు ఓటు హక్కైతే పొందారు. కానీ ఆ రోజు నుండీ ఈ రోజు వరకు రాజకీయ, ఆర్థిక, విద్య, ఆరోగ్య రంగాలలో.. ఇంటా, బయటా, ప్రపంచమంతా వివక్షను ఎదుర్కొంటున్నారు. ఇది గ్లోబర్‌ జెండర్‌ రిపోర్ట్‌ 2022 సూచిక తేటతెల్లం చేసింది. ప్రతి సంవత్సరం ఈ సంస్థ దాదాపు 150 దేశాల్లో మహిళల స్థితిగతులపై అధ్యయనం చేసి, ఒక రిపోర్ట్‌ వెల్లడిస్తుంది.
 

                                                                      ఆచరణ ముఖ్యం..

'మహిళల విద్య కోసం ప్రత్యేక కృషి చేస్తున్నాం. మహిళలకు ఆర్థిక చేయూతనిస్తున్నాం. మహిళల రాజకీయ సాధికారత కోసం ప్రయత్నిస్తున్నాం. మహిళల ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా చేయూతనిస్తున్నాం' అని ప్రభుత్వాలు చెప్పే మాటలన్నీ వినేందుకు బాగానే ఉంటాయి. కానీ, ఆచరణలో కనిపించే నిజాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి.
       75 సంవత్సరాల ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ చాలా సంబరంగా జరిపేసుకున్నాం. దేశం చాలా ప్రగతి సాధించేసిందని గొప్పగా చర్చలు కూడా చేసుకున్నాం. మహిళల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని, వారి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వాలు గొంతు చించుకుంటున్నాయి. అలా ఎంత చించుకున్నా.. స్త్రీ-పురుష సమానత్వంలో మాత్రం మొత్తం 146 దేశాల సూచీలో మన దేశం 135వ స్థానంలో ఉంది. భారత్‌ కంటే కేవలం 11 దేశాలు మాత్రమే వెనకబడి ఉన్నాయి. 'వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ జెండర్‌ గ్యాప్‌ రిపోర్ట్‌ 2022' ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది.
      మహిళలకు అందుతున్న విద్యావకాశాలు, వారి ఆరోగ్యం కోసం చేపడుతున్న చర్యలు, రాజకీయ రంగంలో వారికిస్తున్న ప్రాధాన్యత, ఆర్థిక రంగంలో వారి భాగస్వామ్యం, ఇలా ఈ నాలుగు అంశాల మీద ఆధారపడి, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం, లింగ వివక్ష ఏ స్థాయిలో ఉందనే రిపోర్ట్‌ తయారుచేస్తుంది. దాదాపు 146 దేశాల్లోని మహిళల పరిస్థితిని అధ్యయనం చేసింది. జెండర్‌ సమానత్వం విషయంలో.. ఐలండ్‌ 90.8 శాతంతో ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. ఫిన్‌లాండ్‌, నార్వే, న్యూజిలాండ్‌, స్వీడన్‌ దేశాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయని ఈ రిపోర్ట్‌ తెలియచేస్తుంది.

 

03



                                                                    వివక్ష మయం..

మన దేశంలో లింగ వివక్ష అన్ని రంగాల్లో ఉంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మేధోపరమైన రంగాలలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యంలో 48వ స్థానంలో, ఆర్థిక రంగంలో అవకాశాలు, ఉపాధి కల్పనలో 143వ స్థానంలో, విద్యావకాశాల్లో 107వ స్థానంలో ఉన్నాం. మహిళల ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యతలో 146వ స్థానంలో ఉన్నాం. అంటే, ప్రపంచంలో సమానత్వం విషయంలో అనేక దేశాలకన్నా, 'మేరా భారత్‌ మహాన్‌' అని గొప్పలు చెప్పుకునే మనమే చాలా వెనకబడి ఉన్నాం. ఇది 'వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ జెండర్‌ గ్యాప్‌ రిపోర్ట్‌ -2022' వెల్లడించిన వాస్తవం.
      జెండర్‌ సమానత్వంలో మన స్థానం ఎక్కడుందో చూసుకున్నాక.. 75 సంవత్సరాల ఆజాదీ దేశంలో మహిళల పట్ల వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఐక్యరాజ్య సమితి కూడా ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ''నేటి లింగ సమానత్వం, రేపటి భవిష్యత్‌కు సోపానం'' అనే నినాదాన్ని ఇచ్చింది. అంటే, ప్రపంచ వ్యాప్తంగా జెండర్‌ గ్యాప్‌ ఏ తీరులో ఉందో అర్థం చేసుకోవచ్చు.
     మహిళల రాజకీయ సాధికారతలో చిన్న దేశాలు కూడా మనకంటే ముందున్నాయి. ఐలండ్‌ మొదటిస్థానంలో ఉంటే, బంగ్లాదేశ్‌ తొమ్మిదవ స్థానంలో ఉంది.
     స్త్రీ-పురుషులకు సమాన పనికి సమాన వేతనాలు ఇచ్చే విషయంలోనూ బారత్‌ చాలా వెనకబడి ఉంది. మొత్తం 156 దేశాల లిస్టులో 151వ స్థానంలో ఉండటమే అందుకు నిదర్శనం. మనకన్నా ఇరాన్‌, పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌ కూడా ముందువరుసలో ఉండటం గమనార్హం.
    మహిళల అక్షరాస్యతకు సంబంధించి, 2021 లెక్కల ప్రకారం యునెస్కో విడుదల చేసిన జాబితాలో 129 మిలియన్ల మంది మహిళలు చదువుకు దూరంగా ఉన్నారని చెప్పింది. ఇందులో 32 మిలియన్ల మంది ప్రైమరీ స్కూల్‌ స్థాయిలో, 30 మిలియన్ల మంది సెంకడరీ స్థాయిలో, 67 మిలియన్ల మంది హైస్కూల్‌ స్థాయిలో చదువుకు దూరమయ్యారని చెప్పింది. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే 2019-21 రిపోర్ట్‌ ప్రకారం.. దేశంలో అతి తక్కువ అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది.
      డ్రాపవుట్స్‌గా మిగిలిన చిన్నారులు, చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసుకుని, ఆరోగ్య, ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటున్నారు. మరికొంత మంది కార్మికులుగా మారుతున్నారు. అమ్మానాన్నల పేదరికం కారణంగా, ఇంకొందరు అనివార్యంగా వ్యభిచార వృత్తిలోకి సైతం అడుగుపెడుతున్నారు.

 

04


 

                                                                     ఉపాధి రంగంలో..

భవన నిర్మాణ రంగంలోనూ పురుషులతో సమానంగా మహిళలు పనిచేస్తున్నారు. కానీ అక్కడా సమానపనికి సమాన వేతనం లేదు. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ వారి లెక్కల ప్రకారమే.. ఈ రంగంలో 40 లక్షల మంది మహిళలు పనిచేస్తున్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఎంత వేతనాలు ఇవ్వాలో కార్మికశాఖ చెప్పింది. కానీ, ఆచరణలో ఎక్కడా కూడా ఆ వేతనాలు అమలు కావడం లేదు. ఏ భవన నిర్మాణ కార్మికురాలిని పలకరించినా, మగవారికన్నా తక్కువ కూలీ ఇస్తున్నారని, ఎలాంటి భద్రత లేకుండానే పనిచేయాల్సి వస్తోందని వాపోతున్నారు. కార్మికులుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే కొన్ని చట్టబద్ధ హక్కులైనా వస్తాయి కదా అంటే.. ఆ ప్రభుత్వ కార్యాలయాలకి రోజుల తరబడి తిరిగినా పనులు కావని, కూలి పని వదులుకుని ఆ ఆఫీసుల చుట్టూ తిరిగే శక్తి లేదని తెలుపుతున్నారు.

 

05


 

                                                                      కోవిడ్‌ తర్వాత..

కోవిడ్‌ తర్వాత, చాలామంది పనులు కోల్పోయారు. పరిస్థితులు గతంలో కన్నా దుర్భరంగా మారాయి. పైగా పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉపాధి అవకాశాలు పోగొట్టుకున్నారు. కోవిడ్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రెండు మిలియన్ల మంది మహిళలు పనులు కోల్పోయారు. ఇది ఒక అంతర్జాతీయ కార్మిక సంస్థ (×ూఉ) ఒక రిపోర్ట్‌లో చెప్పింది. కోవిడ్‌ అనంతర పరిణామాలు మహిళల భద్రత, ఆరోగ్యం, విద్యావకాశాలను మరింత దుర్భరంగా మార్చాయి.
       మహిళల ఆరోగ్యం విషయంలో 140 దేశాల్లో భారత్‌ 112వ స్థానంలో ఉంది. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ప్రతిరోజూ ప్రసవ సమయంలో 800 మంది మహిళలు మరణిస్తుంటే, అందులో 20 శాతం మరణాలు భారత్‌లోనే సంభవిస్తున్నాయని లెక్కలు చెప్తున్నాయి.

 

06


 

                                                                      జెండర్‌ బడ్జెట్‌..

కేంద్రంలో, రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా జెండర్‌ బడ్జెట్‌ ఉండాలనేది చాలా కాలంగా మహిళలు చేస్తున్న డిమాండ్‌. కానీ ఈ రోజుకీ ప్రభుత్వాలు కేటాయిస్తున్న బడ్జెట్‌ తీరు తెన్నులు చూస్తే.. వాటి డొల్లతనం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా రాష్ట్రాలు అసలు జెండర్‌ బడ్జెట్‌ అనే ఆలోచనే చేయట్లేదు. ఇక అందుకు అనుగుణంగా కేటాయింపులు ఎలా చేస్తాయి? జెండర్‌ స్పృహే లేని ప్రభుత్వాలు జెండర్‌ బడ్జెట్‌లను ఎలా రూపొందిస్తాయి ?

 

08


 

                                                                 క్రైమ్‌ రేట్‌ పెరుగుతోంది..

మహిళల మీద జరుగుతున్న నేరాల్లో చూస్తే.. భారత్‌ మొదటి 10 దేశాల్లో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు భారత్‌లోనే, మొదటి పది స్థానాలలో ఉన్నాయి. ప్రతిఏటా 3.6 శాతం క్రైమ్‌ రేట్‌ పెరుగుతోంది. ఈ విషయాన్ని మనదేశ నేర నివేదికే తెలియజేస్తోంది. కరోనా కాలంలో బాల్యవివాహాలు గణనీయంగా పెరిగాయని, మహిళలపై హింస విపరీతంగా పెరిగిందని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి.

     అమెరికా మహిళలు సమానత్వంలో భాగంగా సాధించుకున్న ఓటు హక్కైనా, భారతదేశ మహిళలు దక్కించుకున్న మహిళా చట్టాలైనా పోరాటాల ద్వారానే దక్కాయి. అయినా ఇప్పటికీ మహిళల సమానత్వానికి ఇంకా చాలా దూరంలో ఉన్నామనేది అన్ని రకాల రిపోర్టుల సారాంశం. స్త్రీలకు సరైన విద్యావకాశాలు, ఉపాధి మార్గాలు చూపించకుండా.. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపెట్టకుండా.. రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వకుండా.. అభివృద్ధి సాధ్యం కాదు. అలాకాకుండా ఏదో సాధించామని ఏ దేశం గొప్పలు చెప్పుకున్నా అది అబద్ధం. ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామన్నా.. అది అసంపూర్ణ అభివృద్ధే. సమానత్వ సాధించేందుకు మహిళలు మరో శతాబ్దం కూడా పోరాటాలు చేయాల్సిన స్థితి. అందుకు మహిళలంతా ఏకమై పోరాడటమే మార్గం.. అందుకు అందరూ కదలి రావాలి !

 

10

                                                                    వ్యవసాయంలో..

ఈ రోజుకీ భారత్‌లో అత్యధిక మంది మహిళలు వ్యవసాయ రంగంలోనే పనిచేస్తున్నారు. అయినా వారికి అక్కడా సమాన పనికి సమాన వేతనాలు లేవు. మగకూలీ, ఆడకూలీ వేతనాలు వేర్వేరుగానే ఉన్నాయి. అత్యధికంగా వ్యవసాయ పనులు మహిళలే చేస్తున్నా సరే, అందులో 10 శాతం మహిళలకు కూడా భూమి మీద హక్కులు లేవు. ప్రాజెక్టుల పేరుతో, అభివృద్ధి పేరుతో వ్యవసాయ భూములను ప్రభుత్వాలు, వారి అండతో ప్రైవేట్‌ వ్యక్తులు లాగేసుకుంటున్నారు. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలకు ఉన్న ఊర్లో పనిలేక, నగరాలకు వలస వెళ్తున్నారు. కుటుంబ పోషణ కోసం మహిళలు కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా, ఇంటిపనివారిగా పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల వ్యవసాయ సంక్షోభంతో మహిళలు వ్యభిచార వృత్తిలోకి నెట్టబడుతున్నారు. గ్రామాల్లో ఆత్మగౌరవంతో బతికిన మహిళలు, మనసు చంపుకుని ఇలాంటి పనులు చేయాల్సి వస్తోంది. ఒక్క తెలంగాణా రాష్ట్రంలోనే 10 లక్షల మంది ఇంటిపనివారు ఉంటారని అంచనా. కోవిడ్‌ సమయంలో ఈ పని కూడా కోల్పోయామని చాలా మంది మహిళలు బాధపడ్డారు. తిరిగి పనులు దొరకడం కూడా కష్టంగా ఉందని, ఈ పనికి కూడా విపరీతమైన పోటీ ఉందని, అందువల్ల బేరమాడే శక్తి కోల్పోతున్నామని వాపోతున్నారు.

                                                                      రాజకీయాల్లో..

రాజకీయ అధికారం విషయానికొస్తే.. 542 మంది లోక్‌సభ సభ్యుల్లో 78 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. 245 మంది రాజ్యసభ సభ్యుల్లో, 25 మంది మాత్రమే మహిళలు. ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎంపికైన మహిళలు కూడా రాజకీయ అండదండలతోనో లేక సంపన్న కుటుంబ సభ్యులుగా, సినీ తారలుగా, రాజకీయ వారసులుగా మాత్రమే పోటీలో నిలబడి గెలిచారు. ఎన్నికల సమయంలో ఆయా పార్టీలు, మహిళలకు కేటాయించిన సీట్ల సంఖ్య అంతంత మాత్రం. కొన్ని పార్టీలైతే అసలు మహిళలను పోటీలో కూడా పెట్టలేదు.

 

09


 

                                                                    ఈ ఏడాది థీమ్‌..

జీవితంలోనూ.. సమాజంలోనూ.. అన్ని రంగాలలోనూ మహిళల భాగస్వామ్యం అవసరం. ఆ విధమైన సమానత్వం కోసం నిరంతర పోరాటం 2022, ఆగస్టు 26న 'మహిళా సమానత్వ దినోత్సవం' గా నిర్వహించబడుతుంది.

                                                                    పోరాటమే మార్గం..

ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ జెండర్‌ వివక్ష 62.7 శాతం ఉంది. ఈ లింగ వివక్ష పోవాలంటే ఇంకా 132 సంవత్సరాలు పడుతుంది. ఈ విషయాన్ని 'గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ రిపోర్ట్‌ 2022' చెప్తోంది. అంటే మహిళలు మరో శతాబ్దం పైగా ఇంకా లింగ వివక్షను ఎదుర్కొంటూనే ఉంటారు. ఒక్కో హక్కు కోసం ఒక్కో పోరాటమే ఇంకా చేయాల్సి ఉంటుంది.

పద్మ వంగపల్లి
padmavangapally@gmail.com