
షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల సంక్షేమం, సుస్థిరాభివృద్ధికి జనాభా దామాషాలో నిధులు కేటాయించి ఖర్చు చేసేందుకు ఉద్దేశించిన ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళిక చట్టం కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం మరో పదేళ్లు పొడిగించడం హర్షణీయం. ఈ నెల 23తో యాక్ట్ గడువు ముగుస్తున్న తరుణంలో సర్కారు ఆదివారం ఆర్డినెన్స్ జారీ చేసింది. సబ్‌ప్లాన్ చట్టానికి కాల వ్యవధి ముగుస్తున్నా పొడగింపుపై ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటంతో కెవిపిఎస్ సహా దళిత, గిరిజన సంఘాలు, ప్రజాసంఘాలు, వామపక్షాలు ఆందోళనలు చేశాయి. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం అత్యయిక ఉత్తర్విచ్చింది. ఇది పోరాట విజయం. ఆర్డినెన్స్ అనేది తాత్కాలికం. ఆరు మాసాల్లో అసెంబ్లీలో చట్ట రూపం ఇస్తేనే పూర్తి స్థాయి చట్టం అవుతుంది. ప్రభుత్వం నిబద్ధత కనబర్చాలి. ఎస్‌సి, ఎస్‌టిలు అభివృద్ధికి ఆమడ దూరంలో వివక్షకు గురవుతున్నారని, మిగతా వారితో సమానంగా వారి అభ్యున్నతి లేదని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఇతర ప్రజాసంఘాలు, పార్టీల మద్దతుతో కెవిపిఎస్ సుదీర్ఘ ఉద్యమాలు చేసింది. ఆ ఫలితంగా అప్పటి ప్రభుత్వం 2013 జనవరిలో సబ్‌ప్లాన్ చట్టం తీసుకొచ్చింది. 2015 వరకు నియమ నిబంధనలు రూపొందలేదు. రూల్స్ వచ్చాక అమలు మొదలైంది.
కేంద్రంలో బిజెపి రాగానే ప్రణాళికా సంఘం రద్దు కావడంతో బడ్జెట్‌లో ప్లాన్, సబ్ ప్లాన్ పదాలు మాయమయ్యాయి. నీతిఆయోగ్ నియమాలతో 2017 నుంచి ఎస్‌సి, ఎస్‌టి కాంపొనెంట్ పేరిట నిధులు కేటాయిస్తున్నారు. రాష్ట్రంలో వలెనే కేంద్రంలోనూ సబ్‌ప్లాన్ చట్టం తీసుకొస్తేనే ఆ వర్గాల అభివృద్ధికి కొంతైనా గ్యారంటీ ఉంటుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సబ్ ప్లాన్ బిల్లును మోడీ సర్కారు తేవాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయాలి. ప్రణాళికా సంఘాన్ని ఎత్తేయడంతో అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగట్లేదు. ప్రణాళికాసంఘాన్ని కేంద్రం పునరుద్ధరించాలి. అందుకు రాష్ట్ర సర్కారు కృషి చేయాలి. కేంద్రం ఎస్‌సి, ఎస్‌టిల కోసం పలు ప్రాయోజిత పథకాలను అమలు చేస్తోంది. వాటికి రాష్ట్రం తన వాటా నిధులను మ్యాచ్ చేస్తేనే అమలవుతాయి. రాష్ట్రం సకాలంలో జమ చేయనందున కొన్ని స్కీంలు ముందుకు సాగట్లేదు. ఆ వర్గాలకు లబ్ధి చేకూరట్లేదు. తన వాటా నిధులిచ్చి ఆగిపోయిన స్కీంలను గాడిలో పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత.
ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయించిన నిధులు వందకు వంద శాతం ఆ వర్గాల ప్రయోజనాలకే ఖర్చు చేయాలన్న సబ్ ప్లాన్ చట్ట స్ఫూర్తి ఆచరణాత్మకం కావట్లేదు. ఈ సంవత్సరం కేటాయించిన నిధులు మిగిలిపోతే తదుపరి ఏడాది నిధులతో కలిపి ఖర్చు చేయడం లేదు. ఎస్‌సి, ఎస్‌టి నివాసిత ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో సబ్‌ప్లాన్ నిధులు వ్యయం చేసే సందర్భంలో ఆ వర్గాల జనాభా ప్రాతిపదికన వ్యయం చేయట్లేదు. నిధుల కేటాయింపులు, ఖర్చు విషయంలో జవాబుదారీతనం లేదు. మిగతా ప్రజలతో సమానంగా ఎస్‌సి, ఎస్‌టి వ్యక్తులు, కుటుంబాలు, ప్రాంతాలు అభివృద్ధి చెందే వరకు చట్టం ఉండాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీలో చట్టం ఆమోదించే సమయంలో ప్రభుత్వం ఈ లోపాలు సరిచేసి అవసరమైన సవరణలు చేస్తే ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి మరింత ఉపయుక్తంగా ఉంటుంది. వైసిపి ప్రభుత్వంలో సబ్‌ప్లాన్ నిధులను ఎస్‌సి, ఎస్‌టిల ప్రత్యేక ప్రయోజనాలకు కాకుండా నవరత్నాల వంటి సాధారణ పథకాలతో కలిపి ఖర్చు చేస్తున్నారు. ఎ.పి.లో ఎస్‌సిల జనాభా 16.4 శాతం కాగా ఎస్‌టిల జనాభా 5.3 శాతం. ఆ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించట్లేదు. కోతలు పడుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంపై ఆత్మపరిశీలన చేసుకొని సరిదిద్దుకోవాలి. పారదర్శకత పాటించాలి. ఎస్‌సి, ఎస్‌టిలు ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరిగేందుకు దోహదపడే భూమి కొనుగోలు, స్వయం ఉపాధి పథకాలను పక్కాగా అమలు చేయాలి. ఎస్‌సి, ఎస్‌టిలు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఉపాధి పరంగా ముందడుగు వేయడానికి సబ్‌ప్లాన్ చట్టం ఊతం వంటింది. ప్రభుత్వం చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడమే ఆ వర్గాలకు చేసే ఉపకారం.