Apr 18,2023 16:40

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్‌ గోదామును మంగళవారం ఉదయం కలెక్టర్‌ కృతికా శుక్లా రెవెన్యూ, ఎన్నికల, అగ్నిమాపక శాఖల అధికారులతో కలిసి తనీఖి చేశారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ.. ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల) భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ప్రతి నెల ఈవీఎం, వీవీ ప్యాట్‌ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని కలెక్టరు వివరించారు. కార్యక్రమంలో కాకినాడ ఆర్డీవో బీవి రమణ, జిల్లా అగ్ని మాపక శాఖ అధికారి ఎన్‌. సురేంద్ర ఆనంద్‌, కాకినాడ పట్టణం తహసీల్దార్‌ సీతాపతి రావు, కాకినాడ పట్టణ ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌ సీహెచ్‌.లక్ష్మి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.