Jun 30,2023 06:57

సైనిక సంబంధాల్లో-సంయుక్త విన్యాసాలు, భారత ఓడరేవుల్లో అమెరికా నౌకల మరమ్మతులు, నిర్వహణకు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, ఇరు దేశాల సైనిక సంస్థల్లో లైజాన్‌ అధికారుల నియామకాలు, రెండు దేశాల సాయుధ బలగాల మధ్య పరస్పర కార్యకలాపాల నిర్వహణకు చర్యలు తీసుకోవడం-సాధించిన పురోగతిని ఉభయ పక్షాల సంయుక్త ప్రకటన నమోదు చేసింది. వీటన్నింటితో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఒక స్థాయికి చేరాయి. ఈ సంబంధాలను 'ఒక రకమైన పొత్తు'గా అమెరికా వ్యూహాత్మక నిపుణుడు వ్యాఖ్యానించారు.

మోడీ అమెరికా పర్యటన ఫలితంగా భారత్‌ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి మరింతగా తుడిచిపెట్టుకుపోయింది. తన స్వతంత్ర విదేశాంగ విధానానికి తనకు తానే సంకెళ్లు వేసుకుంది. న్యూఢిల్లీలో జులైలో జరగాల్సిన షాంఘౖౖె సహకార సంస్థ (ఎస్‌సిఓ) సదస్సు ఇప్పటికే ఆన్‌లైన్‌ సమావేశంగా మారిపోయింది. మోడీ ప్రభుత్వం అనుసరించిన అమెరికా అనుకూల వైఖరి... బహుళధృవ ప్రపంచంలో సృజనాత్మకమైన, స్వతంత్ర పాత్ర పోషించడం ద్వారా భారత్‌కు అందివచ్చిన మహత్తర అవకాశాన్ని కాలదన్నేలా వుంది.

           ఇటీవల అమెరికాలో మోడీ జరిపిన పర్యటనతో ఒక విషయం చాలా స్పష్టంగా అర్ధమైంది-వ్యూహాత్మకంగా, సైనిక సంబంధాల పరంగా అమెరికాతో భారత్‌ బంధం మరింత బలపడింది. ''ఇరు ప్రజాస్వామిక దేశాల మధ్య భాగస్వామ్యం'', పంచుకుంటున్న విలువలు అంటూ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించినా, చైనాను ఆర్థికంగా, సైనికంగా కట్టడి చేయడానికి ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్‌ను ధృఢమైన భాగస్వామిగా తన జాబితాలో చేర్చుకునేందుకు అమెరికాకు గల అవసరమే ఈ లోతైన, సమగ్ర సంబంధాలకు పురిగొల్పిన ఒత్తిళ్ళని స్పష్టమవుతోంది.
          2002లో పెంటగన్‌ చేపట్టిన అధ్యయనంలోనే భారత్‌ పట్ల అమెరికా వైఖరి ఏమిటనేది వెల్లడైంది. చైనాను ప్రతిఘ టించే శక్తిగా భారత్‌ను పెంటగన్‌ చూసింది. గత కొన్నేళ్ళుగా చైనాను కట్టడి చేసేందుకు, ఏకాకిని చేసేందుకు అన్ని ప్రయ త్నాలు చేసినా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని బైడెన్‌ ప్రభుత్వం గ్రహించిన నేపథ్యంలోనే, నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ప్రభుత్వ విందు, రెండోసారి అమెరికన్‌ కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించే అవకాశం వచ్చాయి.
           మోడీ అమెరికాలో పర్యటించడానికి ముందుగానే అమెరికా కొన్ని సన్నాహక చర్యలు చేపట్టింది. అందులో భాగమే, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌ భారత్‌లో పర్యటించడం. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో-హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు ముఖ్యమైన పాత్ర ఇచ్చే ఉద్దేశ్యంతో రూపొందించిన పథకం ఇది-భారత్‌ను కీలక భాగస్వామిగా చేయాలన్నది ముఖ్యమైన అంశమని చివరగా ఉభయ పక్షాలు జారీ చేసిన సంయుక్త ప్రకటనతో రుజువైంది. ఉభయ పక్షాల సంయుక్త ప్రకటనలో క్వాడ్‌కు కీలకమైన ప్రాధాన్యత లభించింది. ప్రకటన మొదటి పేరాగ్రాఫ్‌ లోనే దీని గురించి ప్రస్తావించారు. రక్షణ రంగ ఉత్పత్తిలో సహకారం, ఉన్నత సాంకేతికతల గురించి చర్చలనేవి క్వాడ్‌ను భద్రతా కూటమిగా మార్చడంలో భాగమే.
             2005లో పౌర అణు ఒప్పందంలో చేరాలని కోరడమే భారత్‌ను వ్యూహాత్మక మిత్రపక్షంగా చేయడానికి అమెరికా తీసుకున్న తొలి ప్రధాన చర్యగా వుంది. పౌర అణు సాంకేతికత అనేది భారత్‌కు అమెరికా ఇస్తున్న ఒక రాయితీ వంటిదే. అందుకు ప్రతిఫలంగా భారత్‌ రక్షణ రంగ ఒప్పందం చేసుకుంది. అణు ఒప్పందానికి నాందిగా 2005 జూన్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అయితే, వామపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో రక్షణ రంగ చట్ర పరిధి ఒప్పందంలోని వివిధ లాజిస్టిక్స్‌ (వసతి సదుపాయాలు), ఇంటరాపరబిలిటీ (పరస్పర కార్యకలాపాలు లేదా చర్యల) ఒప్పందాల అమలుకు ఆటంకం కలిగింది. అందువల్లే, గత కొద్ది సంవత్సరాలుగా ఇరుదేశాల సాయుధ బలగాల మధ్య అవసరమైన వివిధ రంగాల్లో మద్దతు, సహకారానికి హామీ కల్పిస్తూ నాలుగు ప్రాథమిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సైనిక సంబంధాల్లో-సంయుక్త విన్యాసాలు, భారత ఓడరేవుల్లో అమెరికా నౌకల మరమ్మతులు, నిర్వహణకు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, ఇరు దేశాల సైనిక సంస్థల్లో లైజాన్‌ అధికారుల నియామకాలు, రెండు దేశాల సాయుధ బలగాల మధ్య పరస్పర కార్యకలాపాల నిర్వహణకు చర్యలు తీసుకోవడం-సాధించిన పురోగతిని ఉభయ పక్షాల సంయుక్త ప్రకటన నమోదు చేసింది. వీటన్నింటితో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఒక స్థాయికి చేరాయి. ఈ సంబంధాలను 'ఒక రకమైన పొత్తు'గా అమెరికా వ్యూహాత్మక నిపుణుడు వ్యాఖ్యానించారు. అంటే ఒక దేశంపై దాడి చేయడమంటే మరో దేశంపై దాడిగా కూడా పరిగణించే నాటో ఒప్పందంలోని ఐదవ అధికరణ వంటి క్లాజు మినహా అమెరికా-భారత్‌ సైనిక సంబంధాల్లో పొత్తుకు సంబంధించిన అంశాలన్నీ వున్నాయి.
ఉన్నత సాంకేతికత రంగంలో సహకరిస్తామన్న హామీ గురించి ముందుగా చాలా తతంగం జరిగింది. ''మన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో సాంకేతికత అనేది నిశ్చయాత్మక పాత్ర పోషిస్తుంది'' అని ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది. రోదసీ సాంకేతికత నుండి క్వాంటమ్‌ పరిశోధన, ముఖ్యమైన ఖనిజాలు, కృత్రిమ మేధస్సు వరకు అనేక రంగాల్లో సంయుక్త పరిశోధనలు, సహకారానికి ప్రతిపాదనలు రూపొందించారు. అయితే, ఆ ప్రకటనను నిశితంగా చదివితే వాస్తవికంగా సాంకేతికత బదిలీ అనేది లేకపోవడం కనిపిస్తుంది. అయితే అన్నింటికీ మించి, అటువంటి ఉద్దేశ్యం వుందన్న ప్రకటన వెలువడింది.
             రక్షణ రంగ ఉత్పత్తిలో సహకారానికి సంబంధించి, పెద్ద తతంగమే జరిగింది. ఎఫ్‌-414 జెట్‌ ఇంజన్లను జనరల్‌ ఎలక్ట్రిక్‌, హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లు కలిసి ఉత్పత్తి చేయడానికి అవగాహనా ఒప్పందం కుదిరింది. అలాగే తేలికపాటి యుద్ధ విమానాలు ఎంకె 2 కోసం కూడా ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అయితే, దీనివల్ల అమెరికా జెట్‌ ఇంజను సాంకేతిక పరిజ్ఞానమంతా గొప్పగా బదిలీ కావడానికి దారి తీస్తుందని చెప్పడం తప్పు దారి పట్టించడమే. హెచ్‌ఎఎల్‌లో జెట్‌ ఇంజను విడిభాగాల కూర్పులో చాలా పరిమితమైన సాంకేతికత బదిలీనే వుంది. పెద్ద మొత్తంలో కీలకమైన సాంకేతికతలన్నీ కూడా అమెరికా తన వద్దనే అట్టిపెట్టుకుంది.
           ఇక్కడ అమెరికా ఉద్దేశ్యం, లక్ష్యం రెండు రకాలుగా వుంది. - రష్యా రక్షణ పరికరాల సరఫరా నుండి భారత్‌ను వేరు చేయడం మొదటి లక్ష్యం కాగా, రెండోది, భారత్‌కు తానే ప్రధాన ఆయుధ సరఫరాదారుగా వుండడం. క్వాడ్‌లో, హిందూమహా సముద్ర ప్రాంతంలో భారత సైన్యం పోషించాల్సిన పాత్ర కోసం ఆయుధాలను సమకూర్చడం, పరస్పర కార్యకలాపాలు, చర్యలను పెంపొందించడానికి ఈ రక్షణ పారిశ్రామిక సహకారం ఉద్దేశించబడింది. అందుకోసమే దాదాపు 300 డాలర్లకు ఎంక్యు-9బి గార్డియన్‌ సాయుధ డ్రోన్‌లను కొనుగోలు చేయాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చింది. ఈ ప్రిడేటర్‌ డ్రోన్‌లను చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుంది. పైగా కొత్త తరం డ్రోన్‌ల కన్నా నెమ్మదిగా కదులుతాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర జలాలపై అవగాహన (మారిటైమ్‌ డొమైన్‌ అవేర్‌నెస్‌ -ఎండిఎ) కింద నిఘా, ఇంటెలిజెన్స్‌ సమాచారం రాబట్టడానికి భారత్‌ వీటిని ఉపయోగించాలని అమెరికా భావిస్తోంది. గుజరాత్‌లో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి అమెరికా ప్రైవేట్‌ కంపెనీ మైక్రాన్‌ టెక్నాలజీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోందనడాన్ని చూసినట్లైతే వాస్తవానికి అమెరికా కార్పొరేట్ల కోసం భారత్‌ ఇచ్చిన రాయితీ ఇది. సెమీ కండక్టర్ల విడిభాగాలను కూర్చేందుకు, పరీక్షించడానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 82.5 కోట్ల డాలర్లను మైక్రాన్‌ ఖర్చు పెట్టాల్సి వుంది. అంతేకానీ సెమీ కండక్టర్ల రూపకల్పన కోసం కాదు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ 275 కోట్ల డాలర్లు. కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం వరకు సబ్సిడీ ఇచ్చారు. అంటే రూ.11 వేల కోట్లు అవుతోంది. గుజరాత్‌ ప్రభుత్వం మరో 20 శాతం మొత్తం సమకూర్చాల్సి వుంటుంది. అమెరికా కంపెనీ లాభాలు సమకూర్చుకోవడానికి ఇదొక పబ్లిక్‌ ఫండింగ్‌.
          ఇక మరింత విస్తృతమైన ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాలు గురించి మాట్లాడుకుంటే, వాణిజ్య ఒప్పందాల చట్టం గుర్తింపు పొందిన దేశంగా తమను గుర్తించాలని, అమెరికా జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ ప్రోగ్రామ్‌ (సాధారణీకరించబడిన ప్రాధాన్యతా క్రమం) కింద భారత్‌ హోదాను పునరుద్ధరించాలని భారత్‌ చేసిన అభ్యర్ధనను అమెరికా అంగీకరించలేదు.
           భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడులు, మతపరమైన మైనారిటీల హక్కుల నిరాకరణ అంశాలను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ లేవనెత్తుతారా లేదా అన్న అంశంపై చాలా చర్చ జరిగింది. భారత్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించాల్సిన అవసరాన్ని మోడీతో చర్చించాలంటూ 75 మంది అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంపై, మానవ హక్కులపై బైడెన్‌ ప్రభుత్వం మరింత దృఢంగా వుండాలని కొన్ని ఉదారవాద వర్గాలు భావించాయి. కానీ, ప్రజాస్వామ్యం, పరస్పరం పంచుకునే విలువల పట్ల మరింత నిబద్ధతతో ఏ అమెరికా ప్రభుత్వమైనా నిలబడాలని భావించడం కేవలం భ్రమ. వాస్తవానికి, మితవాద కమ్యూనిస్టు వ్యతిరేకులైన సైనిక నియంతలు, నిరంకుశ పాలకులతో వ్యవహరించడానికే అమెరికా ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంది. బైడెన్‌ ప్రభుత్వానికి సంబంధించినంతవరకు, గత అమెరికా ప్రభుత్వాల మాదిరిగానే, అమెరికా సామ్రాజ్యవాద భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలే కీలకం. ఇక నరేంద్ర మోడీని చూసినట్లైతే, దేశీయంగా తన ప్రతిష్టను పెంచుకోవడానికి ఈ అమెరికా పర్యటన, ఫలితాలు కొంత ఉపయోగపడతాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎప్పుడూ సామ్రాజ్యవాద అనుకూలమే కాగా, బడా బూర్జువాల నేతృత్వంలోని భారత పాలక వర్గాలు అమెరికాతో వ్యూహాత్మక పొత్తు కోసం పాతుకుపోతున్నాయి. అమెరికా మిత్రపక్షంగా అన్నింటికీ లొంగివుండే కింది స్థాయి హోదా అయినా అదొక గొప్ప ఘన విజయంగా భావించే ఈ దృక్పథం కార్పొరేట్‌ మీడియాలో బాగా ప్రబలంగా వుంది.
           మోడీ అమెరికా పర్యటన ఫలితంగా భారత్‌ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి మరింతగా తుడిచిపెట్టుకుపోయింది. తన స్వతంత్ర విదేశాంగ విధానానికి తనకు తానే సంకెళ్లు వేసుకుంది. న్యూఢిల్లీలో జులైలో జరగాల్సిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) సదస్సు ఇప్పటికే ఆన్‌లైన్‌ సమావేశంగా మారిపోయింది. మోడీ ప్రభుత్వం అనుసరించిన అమెరికా అనుకూల వైఖరి...బహుళధృవ ప్రపంచంలో సృజ నాత్మకమైన, స్వతంత్ర పాత్ర పోషించడం ద్వారా భారత్‌కు అందివచ్చిన మహత్తర అవకాశాన్ని కాలదన్నేలా వుంది.
( 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం )