
బిజెపి, మతోన్మాదశక్తుల అమ్ములపొదిలిలో ప్రత్యర్ధులపై అబద్ధపు ప్రచారం చేసి రాజకీయ పబ్బం గడుపుకునే వ్యూహాలు ఎల్లవేళలా సిద్ధంగానే ఉంటాయి. ఆ కోవలోనివే నిన్నటి 'కాశ్మీర్ ఫైల్స్' సినిమా అయినా నేటి 'కేరళ స్టోరీ' మూవీ అయినా. అసత్యాల పునాదులపై దర్శకుడు సుదీప్తో సేన్ నిర్మించిన 'కేరళ స్టోరీ' ఇప్పుడు ప్రధాని మోడీ సహా పలువురు బిజెపి అగ్ర నాయకులకు, హిందూత్వ ముఠాలకు ఆయుధం కావడంలో ఆశ్చర్యం లేదు. అది వారి సహజ నైజం. కేరళ రాష్ట్రానికి చెందిన 32 వేల మంది మహిళలు, బాలికలను బలవంతంగా మత మార్పిడి చేసి సిరియా, యెమెన్, అఫ్గనిస్తాన్‌లకు అక్రమంగా రవాణా చేశారన్నది 'కేరళ స్టోరీ' ఇతివృత్తం. అశ్లీలం, హింస సరేసరి. ప్రజల నిరసనల మేరకు సెన్సార్ బోర్డు ఆదేశాలతో ముగ్గురు మహిళలుగా కథ మార్పు చేసినప్పటికీ, మతోన్మాదాన్ని రేగ్గొట్టే డైలాగులతో ముందుగా రిలీజైన ట్రైలర్ జనంలోకి విస్తృతంగా వెళ్లిపోయింది. వాట్సాప్‌లు, వార్తా చానల్స్, ప్రసార మాధ్యమాల్లో హిందూ మతోన్మాద శక్తులు అమిత ప్రచారం కల్పించి తమ లక్ష్యాన్ని సాధించాయి. దేశ వ్యాప్తంగా ఈ నెల 5న హిందీలో విడుదలైన 'కేరళ స్టోరీ'పై హైకోర్టులో వ్యతిరేక పిటిషన్లు పడటంతో వాటిని త్వరగా పరిశీలించాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.
గుజరాత్‌ను తతిమ్మా దేశం ఆదర్శంగా తీసుకోవాలని తరచు బిజెపి వల్లె వస్తూ ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో 41 వేల మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) లెక్కలు కుండబద్దలు కొడుతున్నాయి. ఏడాదికి నాలుగు వేల నుంచి తొమ్మిది వేల మంది కనబడకుండా పోయారు. వీరందరూ ఇతర రాష్ట్రాలకు వ్యభిచార వృత్తికి బలవంతంగా తరలించబడ్డారని, పోలీస్ దర్యాప్తు సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు సుధీర్ సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. 2019-20లో 4,722 మంది మహిళలు అదృశ్యమయ్యారని 2021లో అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. ఒక సినిమా కథ ఆధారంగా కేరళలో మహిళలు అదృశ్యమవుతున్నారని కంకణం కట్టుకొని మరీ ఊరూ వాడా ప్రచారం ప్రచారం చేస్తున్న ప్రధాని మోడీ, అమిత్‌షా ద్వయం తమ సొంత ఇలాకా గుజరాత్‌లో అన్నేసి వేల మంది స్త్రీలు మిస్ అవుతుంటే మాత్రం నోరువిప్పట్లేదు ఎందుకని? కేరళలో మిస్సింగ్‌లపై పోలీస్ రికార్డ్స్ లేవు. అదొక ఊహాజనితం. అదే గుజరాత్‌కు సంబంధించిన గణాంకాలు కేంద్రం నిర్వహించే ఎన్‌సిఆర్‌బి రికార్డ్స్‌లో పదిలంగా ఉన్నాయి. సదరు ఎన్‌సిఆర్‌బి హోం మంత్రి అమిత్‌షా నిర్వహణ కిందనే ఉంది. కాబట్టి గుజరాత్ మిస్సింగ్‌లపై మోడీ, షా తప్పించుకోజాలరు. వారి వైపే అందరి వేళ్లూ చూపిస్తున్నాయి.
మితవాదులు, ఫాసిస్టులు ఒక ఎజెండాతో ఉన్మాదాన్ని ప్రజలకు నూరిపోస్తారు. ప్రజల మెదళ్లల్లోకి విద్వేష విషం ఎక్కిస్తారు. సైద్ధాంతికంగానే ఆ పని చేస్తారు. చరిత్రలో ఇటలీ, జర్మనీ దేశాల్లో ఫాసిస్టులు ఆ విధంగానే అధికారంలోకి వచ్చాయి. బిజెపి, మతోన్మాద శక్తులు మన దేశంలో ఆ పంథానే అమలు చేస్తున్నారు. కేరళ ప్రజలు హిందూ మతోన్మాద శక్తులను తమ రాష్ట్రంలోకి రానివ్వలేదు. బిజెపి నుంచి ఒక్క ఎంపి కూడా గెలుపొందలేదు. అక్కడి వామపక్ష ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలతో అభివృద్ధి దిశగా పయనిస్తోంది. హిందుత్వ ముఠాల చర్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది. కార్పొరేట్, సమాఖ్య, లౌకిక విధానాలపై జాతీయ ఐక్యత సాధనకు వామపక్షాలు ముందంజలో ఉన్నాయి. ఆ కక్షతోనే ఆ ఆ రాష్ట్రంపై 'కేరళ స్టోరీ' సహా అంది వచ్చిన దేన్నీ వదిలిపెట్టకుండా ఉద్దేశపూర్వకంగా దాడి చేసి క్రైస్తవులు, ముస్లింలు, హిందువుల మధ్య ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. కేరళ ఉగ్రవాదానికి కేంద్రంగా మారినట్లు నానా యాగీ చేస్తున్నాయి. బిజెపి, హిందూత్వశక్తుల కుయుక్తులను ఎదుర్కొన్న చరిత్ర మళయాళీలది. ఇప్పుడూ ఎప్పుడూ వారు ఆ ఒరవడి ప్రదర్శిస్తారు. కోర్టులు, ప్రభుత్వాలు ఏం చెప్పినా బిజెపి, మితవాద శక్తుల అభూతకల్పనలను తిప్పికొట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదే దేశానికి రక్ష.