Jun 04,2023 07:50

మనిషి సంఘజీవి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు, వాటిని కథలుగా స్పృశిస్తూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన 12 కథలను సేకరించి 'కుచ్చుంటే కత, లేస్తే కత' పుస్తక రూపంలో సంకలనకర్త సాకం నాగరాజ మన ముందుంచారు. ఆయన పదేళ్ల క్రితమే ఈ టైటిల్‌తో పుస్తకం వేయాలనుకున్నారు. కానీ కథల వెతుకులాటలో ఇంత సమయం పట్టిందని 'నా పిచ్చి నాకానందం'లో చెప్పారు. ఈ కాన్సెప్ట్‌ను తన మిత్రులకు చెప్పినా- ఎవరూ దృష్టి పెట్టలేదు. చివరకు ఆయనే పూనుకుని కథలను సేకరించారు. వీటిలో మాండలికం, ప్రాంతం, భాష ప్రాముఖ్యం. అవి మొత్తం మనిషి జీవనానికి సంబంధించినవే. పల్లెటూళ్లు, పట్టణాల జీవన స్థితిగతులు చూసినవాళ్లకే కాకుండా కొత్తవాళ్లకు సైతం సులభంగా అర్థమయ్యేలా కూర్చారు రచయితలు.
పల్లెటూళ్లలో జీవించేవారు ఒకరిని మరొకరు ఏదో ఒక వరుసతో పిలుచుకుంటూ ఉంటారు. కాస్త సమయం ఉందంటే చెట్ల కింద, అరుగుల మీద చేరి ఒకరి బతుకులను మరొకరు ఎక్కిరించడం, విమర్శించడం చేస్తూ ఉంటారు. అయినా కలిసికట్టుగా జీవిస్తుంటారు. ఇటువంటి ఓ సంఘటననే చిత్తూరు యాసలో 'కుచ్చుంటే కత, లేస్తే కత'లో హాస్యంగా చెప్పారు. పేదవాళ్ల కాలనీ అనగానే ప్రతిఒక్కరికీ మురికి కాల్వలు, అపరిశుభ్రంగా ఉన్న ఇళ్లు, మాసిన బట్టలు వేసుకున్న పిల్లలు వంటి దృశ్యాలు కళ్ల ముందు కనిపిస్తాయి. అటువంటి కాలనీకి చెందిన ఓ పాపకు క్లాస్‌ టీచర్‌ శుభ్రంగా ఉండు అని చెబుతూ 'కొత్త నీలి గౌను' ఇస్తుంది. దాంతో ఆ పాప తల్లిదండ్రులు, కాలనీవాసులు శుభ్రంగా ఉండేందుకు ఓ ఉద్యమంలా ప్రయత్నిస్తారు. కొన్నాళ్లకు పేదల కాలనీ కాస్తా ఒక పరిశుభ్రమైన వీధిగా మారిపోతుంది. సమాజంలో మార్పు కోరుకున్నప్పుడు అది మన ఇంటి నుంచే మొదలవ్వాలని చెప్పడమే ఈ కథ సారాంశం.
మనిషి ఉన్నదానితో సంతృప్తి పడకుండా అత్యాశకు పోతే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని తెలియజేసిన కథ 'ఆరడుగుల నేల'. కుటుంబంతో హాయిగా ఉన్న రైతుకు ఓ బాటసారి చెప్పిన మాట విని, సుదూర ప్రయాణం చేసి కొత్త ప్రాంతానికి వెళతాడు. అక్కడ అధిక భూమి కోసం నడిచి నడిచి ప్రాణాలు కోల్పోతాడు. వేదాంతి అయినా సామాన్యుడైనా సౌర కుటుంబంలో ఓ అణువే అని 'సృష్టి' కథలో అద్భుతంగా చెప్పారు. స్వర్గం, నరకం అంటూ ఏమీ ఉండదని చెప్పిన తీరు ప్రతిఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ఇప్పటి మతోన్మాద కాలానికి విజ్ఞానంతో కూడిన ఈ కథ చాలా అవసరం.
'నిరపరాధులైనా... ఏ లాయర్‌కూ ఫీజు ఇవ్వందే కోర్టులో వాదించరు. న్యాయం జరగదు' అని 'మాయ' కథలో స్పష్టంగా తెలుస్తోంది. ఇటువంటి సమాజంలో కూడా మూర్తి అనే లాయర్‌ మూత్యాలమ్మ లాంటి పేదరాలు కేసును వాదిస్తాడు. అందుకు కారణం ఆమె జీవితంలో చూసిన అనుభవం. ఆమె మాటలు ప్రతిఒక్కరినీ కన్నీరు పెట్టిస్తాయి. మూర్తికి ఫీజు తీసుకోవాలని ఉన్నా ఆమె మాటల్లో స్వచ్ఛత, నమ్మకం చూసి డబ్బు తీసుకునేందుకు మనస్కరించదు.
'ఆనందాల యువరాజు' కథలో కులాసాల యువరాజుకు బతికి ఉన్నంత కాలం ప్రజల కష్టాలు కనిపించవు. చనిపోయాకా! ఆయన రూపంతో బంగారు విగ్రహంగా నాలుగు కూడలి మధ్య ఉంచుతారు. చుట్టూ జనం బాధలు చూడలేక కన్నీరు కారుస్తాడు. మైనా ద్వారా వారి సమస్య పరిష్కారం చూపుతాడు. రాజు విగ్రహం-మైనా మధ్య సంభాషణ, చివరకు మైనా చనిపోవడం ఎంతో హృద్యంగా రాశారు రచయిత.
రచయిత త్రిపురనేని గోపిచంద్‌ రాసిన 'అర్రు కడిగిన ఎద్దు' కథలో వృద్ధాప్యంలో జీవిస్తున్న మనిషి/ ఎద్దుల మానసిక సంఘర్షణ కళ్లకు కట్టినట్టు చూపించారు. యజమాని తన పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణి. పురుగు కన్నా హీనంగా చూస్తున్న కొడుకును చూసి తండ్రి పడుతున్న మానసిక రోదన. రెండింటినీ పోలుస్తూ రాసిన ప్రతి విషయం పాఠకుల మనసులను కలచివేస్తుంది.
చనిపోయిన కన్నతల్లిని, చిట్టి చెల్లిని తలచుకుంటూ రోదిస్తున్న ఓ పసిపాప అంతరంగమే 'ఆ గదిలోనే..' కథ. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలులోనూ సానుకూలత వెతుక్కోవాలి అని చివరిగా చెప్పిన ప్రముఖ రచయిత చెహోవ్‌ వాఖ్యలతో పుస్తకం ముగుస్తుంది. ప్రతి కథలోనూ గుండెను పిండివేసే మాటలు... అవి మన చెవిలో చేరినట్లు అనుభూతి కలిగిస్తుందనడంలో ఏ సందేహం లేదు.

- పద్మావతి

కుచ్చుంటే కత, లేస్తే కత
రచయిత : సాకం నాగరాజు
ప్రచురణ : అభినవ ప్రచురణలు
వెల : రూ.100
ప్రతులకు : విశాలాంధ్ర, ప్రజాశక్తి బుకహేౌస్‌లు
ఫోన్‌ : 94403 31016