Dec 13,2022 07:39

    తీర ప్రాంత ప్రజానీకానికి తుపాన్లు, వాటి వల్ల వచ్చే కష్టాలు కొత్త కాదు. కానీ, ఆ కష్టాలను పూర్తి స్థాయిలో నివారించలేకపోవడమే బాధాకరం. తాజాగా విరుచుకుపడిన మాండూస్‌ తుపాన్‌ కూడా తీర ప్రాంత ప్రజానీకానికి తరగని కష్టాలను మిగిల్చింది. తుపాన్‌ ప్రాంతానికి పలు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా నష్టతీవ్రతను ఇంకా ప్రకటించలేదు. ఎన్యూమరేషన్‌ ఇంకా ప్రారంభమే కాకపోవడంతో ఈ ప్రక్రియ పూర్తయి, బాధితులకు నష్టపరిహారం అందడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఆలోగా అరకొర సాయంతోనే బాధితులు నెట్టుకురావాల్సి ఉంటుంది. తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నప్పుడు గతంలో మరణాల సంఖ్య భారీగా ఉండేది. పెరిగిన సాంకేతికతతో పాటు అధికార యంత్రాంగం అప్రమత్తత కారణంగా ఇటీవల కాలంలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. మాండూస్‌ తుపాన్‌ సమయంలోనూ ఈ విషయాన్ని గమనించవచ్చు. మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసినప్పటికీ, దక్షిణ కోస్తా జిల్లాలో నదులు, వాగులు పొంగి ప్రవహించినప్పటికీ మన రాష్ట్రంలో ఒక్కరే మరణించారు. అది కూడా వర్షాలకు నానిన గోడ కూలడం కారణంగా సంభవించింది. సకాలంలో సహాయ చర్యలు చేపట్టినందున మరణాల సంఖ్యను నలుగురికి పరిమితం చేయగలిగామని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడులోనూ సంభవించిన ఆస్తి, పంట నష్టం మాత్రం అపారం.
         రాష్ట్రాలు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే! తక్షణ సాయం ప్రకటించడంతో పాటు, పూర్తిస్థాయి నష్టం అంచనా వేయడానికి బృందాన్ని పంపడం, ఆ బృందం ఇచ్చే నివేదికను, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని మరిన్ని నిధులను మంజూరు చేయడం వంటి పనులు కేంద్ర ప్రభుత్వం సాధారణంగా చేస్తుంది. ఈ తరహా స్పందన ఎంత త్వరగా వ్యక్తమైతే బాధిత ప్రజానీకానికి అంత త్వరగా ఊరడింపు లభిస్తుంది. అయితే, తాజా తుపాన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఇటువంటి స్పందన నామమాత్రంగా కూడా వ్యక్తం కాలేదు. సాయం సంగతి అలా ఉంచి, కనీసం బాధిత ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వ పెద్దల నుండి ఊరడింపు మాటలు కూడా వ్యక్తం కాకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. తమ సొంత ప్రభుత్వాలు ఉన్నచోటో, ఎన్నికలు వచ్చినప్పుడో దీనికి భిన్నంగా ఉరుకులు, పరుగుల మీద సాయం అందడం ప్రజానీకం గమనిస్తున్న విషయమే. ఈ తరహా వివక్షా పూరిత వైఖరిని కేంద్ర ప్రభుత్వం తక్షణం మానుకోవాలి.
           మాండూస్‌ తుపాన్‌ కారణంగా చిత్తూరు, తిరుపతి, కర్నూలు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంట దెబ్బతింది. రేపో, మాపో మార్కెట్‌కు చేరాల్సిన ధాన్యపు కళ్ళాల్లోకి వర్షపు నీరు చేరింది. పండ్ల తోటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వరద నీరు చేరడంతో కొన్ని చోట్ల ఇళ్లకు దెబ్బతిన్నాయి. వీరందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే ! అది జరగాలంటే ముందుగా ఎన్యూమరేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో నష్టం అంచనాల ప్రక్రియను వెంటనే ప్రారంభించి, వారం రోజుల్లోపు సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఉదారంగా నిర్వహించాలి. రంగుమారినా, తడిసినా ముందుగా ప్రకటించిన రేటుకే కొనుగోలు చేయాలి. ముఖ్యమంత్రి కూడా ఇదే విధమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావాలి. దీంతో పాటు అన్ని విధాల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడే రైతులకు కొంతమేరకైనా ఊరట లభిస్తుంది. అదే సమయంలో రాష్ట్రంలోని అధికార పక్షంతో పాటు, ప్రధాన ప్రతిపక్షం కూడా సాయం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అవసరమైతే ఇతర ప్రతిపక్షాలను, శక్తులను కూడా కలుపుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి.