Aug 13,2023 15:49

ఒక కథను చదివినప్పుడు టైమ్‌ 'పాస్‌' కాకూడదు. మనమేం కోల్పోయామో తెలియజేయాలి. ఏం చేయాలో, ఏం నేర్చుకోవాలో గుర్తెరగాలి. అలాంటి కథ చదివినప్పుడే సంతృప్తి కలుగుతుంది. అలాంటి కథకే బ్రహ్మరథం పడతాం. కథను మూడు పేజీల్లో చెప్తామా లేక పది పేజీల్లో చెప్తామా అన్నది ముఖ్యం కాదు. ఎంత హృద్యంగా చెప్తామనేదే ప్రధానం. కథకు కొలమానాలు లేవు. ఉంటే అది ఎంత శాతం పాఠకులని కదిలించిందనేది లెక్కలోకొస్తుంది. అప్పుడే ఆ కథకు సార్థకత చేకూరుతుంది. అటువంటి కథల్ని రాసిన కృపాకర్‌ పోతుల అభినందనీయులు.
విజన్‌ ఉన్న రచయితల కథలు ఒకలా ఉంటే, విజ్ఞానం సమృద్ధిగా ఉన్న కృపాకర్‌ లాంటి వారి కథలు జ్ఞానాన్ని పంచేలాగా ఉంటాయి. అందుకు తార్కాణమే కథా కృపాకరం కథల సంపుటి. రచయిత ఎంత జ్ఞానవంతుడో 'ఆ మూడు రోజులు' కథ చదివితే తెలుస్తుంది. తమ ఇబ్బందుల్ని తాము చెప్పుకోవడానికే ఇబ్బంది / సిగ్గు పడే ఆడవారు, ఆ వేదనను అక్షరీకరించడం జరగని పని. అలాంటిది ఒక మగవాడై ఉండి, ఆడవారి 'మూడు రోజుల' ఇబ్బంది గురించి వేదనాభరితంగా చెప్పడం అంటే మామూలు మాటలా! గట్స్‌ ఉన్న కృపాకర్‌, ఆడవారి మనసులోకి పరకాయ ప్రవేశం చేశారు.
'తండ్రీి కొడుకుల మధ్య సామాన్యంగా ఉండే బంధానికి అతీతమైన, అపురూపమైన అనుబంధం, ఆత్మీయతా మామధ్య చోటు చేసుకోవడానికి నాన్నతో ప్రతిరోజూ కలిసి నడిచిన ఆ 'లాంగ్‌ వాక్స్‌' తప్ప వేరే ఇంకే కారణం లేదనేది నా ప్రగాఢ విశ్వాసం' అని నాన్న ఊరెళ్ళిపోయారు కథలో ప్రధానపాత్ర చెప్తుంది. ఈ ఒక్క వాక్యంలోనే తండ్రీ కొడుకుల మధ్య ఉండాల్సిన అనుబంధం గురించి చెప్పేశారు. పిల్లలకు ర్యాంకుల ఆలోచన లేకపోయినా ఆ దిశగా అడుగులు వేయిస్తున్న ఈ రోజుల్లో ఓ తండ్రి తన కొడుక్కి పాఠ్యపుస్తకాలతో పాటు బయట పుస్తకాలు చదవమని చెప్పగలడా?. కానీ ఈ కథలో చెప్పారు.
'భగ్గున మండుతున్న కళ్లు మూసుకుంటే, వాటి రెప్పల మాటున భయానకంగా మెదులుతున్న మండ్రగబ్బల్లాంటి జ్ఞాపకాలు..' అనే వాక్యంలోనే వలస జీవుల వ్యథను చెప్పారు. నరసమ్మ తన ఎనిమిదేళ్ళ బిడ్డ చిట్టిబాబుతో కలిసి కరోనా కాలంలో ఊరికి తిరుగు ప్రవాసం సాగించింది. నాలుగు వారాలు మైళ్ళకొద్దీ నడిచి, నరకం అనుభవించారు. ఊరు వెళ్ళగానే పప్పుచారులో ఎండిచేప నంచుకుని బువ్వ తినాలన్న చిట్టిబాబు కోరిక తీరదు. ఊరి పొలిమేర చేరుకున్నా గ్రామస్థులు గ్రామంలోనికి రానివ్వరు. అప్పుడు నరసమ్మ ఏం చేసింది? చిట్టిబాబు తాను కోరుకున్న బువ్వ తిన్నాడా? అనేది తెలియాలంటే 'ఊరు పొమ్మంది' కథను చదవాల్సిందే!
ఎప్పుడూ వర్షం కురిసే చిరపుంజి ప్రాంత వాసులకు వర్షం విలువ అంతగా తెలీకపోవచ్చు. అనంతపురం లాంటి జిల్లా వాసులకు అది ప్రాణంతో సమానం. ఆ నేపథ్యంలోనే నడుస్తుంది తిరుపతి నాయుడు కథ. వర్షం రాకకోసం, వస్తే పొందే సంతోషం కోసం తిరుపతి నాయుడు చకోరపక్షిలా ఎదురు చూస్తుంటాడు. ఎన్నిసార్లు పంట దెబ్బతిన్నా లోను తీసుకుని, ప్రతి యేడూ పంట వేస్తూనే ఉంటాడు. ఇలా అతను ఎంతకాలం ఎదురు చూశాడు? అసలు అతను కోరుకునేది ఏమిటి? తెలుసుకోవాలంటే కథ మాత్రం కచ్చితంగా చదవాల్సిందే!
ఇవే కాదు, ఈ సంపుటిలోని ఏ కథా పాఠకుల్ని నిరాశకు గురి చేయదు. రిటైరయ్యాక తన బాల్యాన్ని పునఃసృష్టించుకున్న రాంబాబు కథే 'ఆలస్యంగానైనా... ఆమని'. ప్రతిభను ప్రోత్సహించకపోగా, నాయకుల రూపంలో ప్రభుత్వం చేసే అక్రమాలను ఎండగట్టే కథ 'బంగారు పతకం'. పర్యావరణ దృక్పథాన్ని చెప్పే 'ఒంటరి పిచ్చుక', మనసుల్ని కలిపి ఉంచే మమకారం గల 'ఉత్తరం' కథలు మనోనేత్రంపై కదలాడుతుంటాయి.
కృపాకర్‌ కథల్లో ఆంగ్లం బలంగా ఉంది. అదే ఆయన బలం, బలహీనత కూడా. తెలుగు కథల్లో ఆంగ్లాన్ని విరివిగా వాడటం తగ్గించాలి. లేకపోతే సామాన్య పాఠకులకు దూరమయ్యే ప్రమాదముంది. పుస్తకాలను చదివే అలవాటున్న కృపాకర్‌ పోతుల, తన పుస్తకాన్ని నలుగురూ చదవాలని ఇలా సంపుటంగా మనముందుకొచ్చారు. అభినందనీయం.

- దొండపాటి కృష్ణ
90523 26864


కథాసంపుటి : కథా కృపాకరం
రచన : కృపాకర్‌ పోతుల
పేజీలు : 172
వెల : రూ.175/-లు
ప్రతులకు : రచయిత ఫోన్‌
91 80084 16660