Sep 10,2023 11:52

'నాలుగు అడుగులు' ఓ చిన్న కథల పుస్తకమే అయినా జీవిత నిజాలు దాగి ఉన్నాయి. ప్రపంచీకరణ ప్రయాణంలో మనుషుల మధ్య సన్నగిల్లుతున్న అనుబంధాలను తన కథల ద్వారా చెప్పారు. మనిషి డబ్బు కోసం వెంపర్లాడుతూ ఏం కోల్పోతున్నాడో రచయిత కృష్ణమూర్తి వంజారి వివరించారు. మొత్తం పదమూడు కథలు ఉంటే.. ఒక్కో కథ ఒక్కో జీవితరసాన్ని అందిస్తుంది. ఎటువంటి ఊహలకు తావులేకుండా వాస్తవాలకు దగ్గరగా కథల్లోని ప్రాతలు, సన్నివేశాలు, పాత్రల సునితత్త్వం కళ్లకు కట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ పెట్టుబడిదారీ సమాజంలో కనుమరుగవుతున్న మానవత్వం, మానవ సంబంధాలు నిలబెట్టే కథలుగా ఉన్నాయి.

నాలుగు అడుగులు
రచయిత : కృష్ణమూర్తి వంజారి
పేజీలు : 96
వెల : అమూల్యం
ఫోన్‌ నెం : 73960 11666 రచయితకు ఇది మొదటి పుస్తకమే అయినా ప్రతి కథా ప్రతిఒక్కరి హృదయాలనూ తాకుతుంది అనడంలో సందేహంలేదు. కొన్ని కథల్లో మన పాత్ర ఒకటి చూసుకున్నట్లు, కొన్ని కథలు మన చుట్టూ జరిగినట్లు అనిపిస్తుంది. ఏ ఒక్క కథలోనూ ఎక్కడా అర్థం కాని పదాలు లేవు. సరళమైన భాషలో, సున్నితంగా చెప్పారు. కథలని నడిపించే విధానంలో కృష్ణమూర్తి ప్రతిభను ప్రశంసించకుండా ఉండలేం.
ఇందులో మొదటిది 'మనిషెక్కడో లేడు' కథలో శ్రీనివాసరావు జీవిత వ్యథ పాఠకులను కదిలిస్తుంది. బాగా బతికి, చితికిన అతనికి రైలు ప్రయాణంలో ఊహించని అనుభవం ఎదురవుతుంది. ఇటువంటి వ్యక్తికి సాయం చేయాలని చదవుతున్న పాఠకుడికీ అనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
వీటిలో ఐదో కథ 'ఒక్కసారి ఆలోచిద్దాం' లో భార్యాభర్తలు ఒకరిని మరొకరు ఎలా అర్థం చేసుకోవాలి, ఇంట్లో పెద్ద వయస్సు ఉన్న అత్తమామలను కోడలు ఎలా చూసుకోవాలి, కోడలిని అత్తమామలు ఎలా చూడాలో చాలా మహోన్నతంగా తెలియజేశారు. చాలామంది భర్తలు.. భార్య తల్లిదండ్రుల పట్ల విముఖత చూపిస్తారు. అది మంచి పద్ధతి కాదని రచయిత సమాజానికి తెలియజేశారు. భార్యను ప్రేమించడం అంటే ఆమె తల్లిదండ్రులనూ ప్రేమించడం.. ఈ కథలో రచయిత సమాజానికి అదే సందేశం ఇచ్చారు. వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రుల గురించి బాధపడుతున్న భార్య పరిస్థితిని అర్థం చేసుకొని, భర్త అత్తామామలను ఇంటికి తీసుకువచ్చి 'ఇక వీరు మనతో ఉంటారు' అని భార్యతో చెప్పడం.. స్వార్థంతో జీవిస్తున్న వారికి చెంపపెట్టులా అనిపిస్తుంది.
ఓ మనిషికి కర్మకాండలు జరిపించేందుకు రక్తసంబంధీకులు, బంధువులే కానక్కర్లేదు.. మంచి మనసు ఉంటే చాలు అని 'ఆ బాధ్యత నాది కాదా!' లో చెప్పారు. తన దగ్గర పని చేసే రాఘవయ్యను కూలివాడిలా చూడకుండా తండ్రిలా భావించి, గౌరవించడం మూర్తి గొప్పతనం. ఇంట్లో ఎన్నో పనులున్నా, సమస్యలున్నా పక్కనబెట్టి చనిపోయిన రాఘవయ్యను చూడటానికి వెళతాడు. కొడుకు ఉన్నా తాను దగ్గరుండి కార్యక్రమం జరిపించిన తీరు పాఠకుల హృదయాలను కదిలిస్తుంది.
పిల్లలకు చిన్నప్పుడు నీతి, నిజాయితీ కథలను చెబుతుంటాం. ఆ కథలోని కథానాయకుడు సన్మార్గంలో నడుస్తూ.. తన చుట్టూ కష్టాల్లో ఉన్న వాళ్లకు దానం చేస్తూ ఉండటం.. పిల్లలను ఆకట్టుకుంటుంది. ఇందులో మూడవ కథ 'అది చాలు మనకు' లో హరిప్రసాద్‌ పాత్ర అంత అద్భుతంగా ఉంటుంది. అన్యోన్యమైన దంపతుల మధ్య హాస్యంతో కూడిన సన్నివేశాలు చోటుచేసుకుంటే ఎలా ఉంటుందో 'తాకిడి తట్టుకోలేక' కథ ద్వారా నవ్వించారు. చదువుతున్నంతసేపూ నవ్వు పెదవులపై ఉంటుంది. పెద్ద రచయిత కావాలన్న భార్య కలను నిజం చేసేందుకు ఓ భర్త పడే కష్టం వినోదభరితంగా చెప్పారు.
పోలీసు డిపార్టుమెంట్‌లోనూ మంచివాళ్లు ఉంటారు. 'నీలా బతకాలి' కథలో సమాజం పట్ల బాధ్యతగా పనిచేసే పోలీసు ఆఫీసర్‌గా సుదర్శన్‌ పాత్ర ద్వారా చెప్పారు. మారిన ఖైదీలకు బయటకు వచ్చాక జీవనోపాధి కల్పించి, సహాయం చేయడం అతని మంచితనాన్ని తెలియజేస్తుంది.
ఓ యాచకురాలిని చూసీ మంచి విషయాలను నేర్చుకోవచ్చనే సత్యాన్ని 'నేనేం చేసుకుంటాను' కథలో చెప్పారు. ఆమెను చూసి కనువిప్పు కలిగేలా చేసే సంఘటన, జీవితం తాలుకూ నిబద్ధతను నేర్చుకున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా 'నా నమ్మకం', 'తరాలు మారినా', 'సుమంగళి' వంటి ఇంకొన్ని మంచి కథలు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకం చదివిన వారికి ఒక మంచి కథల పుస్తకం చదివానన్న అనుభూతి తప్పకుండా కలుగుతుంది.
 

- పద్మావతి
94905 59477