Apr 16,2023 08:02

కొన్ని కథలు ఒట్టి కథలుగానే ఉంటాయి. ఊహాలతలకు పూసిన పువ్వుల్లా తళతళ్లాడతాయి. చదివినంతసేపూ ఆహ్లాదంగా అనిపించి, ఆ తరువాత మరపు పొరల్లోకి అదృశ్యమైపోతాయి. కొన్ని కథలు వ్యథల్లా ఉంటాయి. నిజ జీవితాల నిండా పరుచుకున్న తుమ్మ ముల్లుల్లా ఉంటాయి. చదవడం ముగించాక మనసుకు గుచ్చుకొని సలపరిస్తూ ఉంటాయి. ఇంతటి నాగరిక, ఆధునిక సమాజంలోనూ మనల్ని వెన్నంటి ఎగబాకుతున్న చీడనీడలను కళ్లకు కట్టేలా చూపిస్తాయి. మనసును మెలి పెట్టి కదిలిస్తాయి. ఇదిగో .. ఈ 'ముళ్ళ చినుకులు' సంకలనం ఆ తరహా 23 కథల సమాహారం. తరతరాల దళిత జీవితాల వ్యథార్థ హృదయాల అవిరళ కథాగానం. ఈ సంకలనానికి అరుణ గోగులమండ, మానస ఎండ్లూరి సంపాదకత్వం వహించారు. మార్జిన్స్‌ పబ్లికేషన్స్‌్‌ (విజయవాడ) ద్వారా ఇటీవల వెలువరించారు.
సాధారణంగా ఏ కాలంలోనైనా నింగినుంచి రాసే చినుకులు నేలకు జీవం పోస్తాయి. మొక్కలకు ప్రాణం ఇస్తాయి. తడిచే దేహాలకు ఆహ్లాదాన్నీ, ఆనందాన్నీ ఇస్తాయి. మరి అలాంటి చినుకులు ములుకుల్లా మారితే ...? ముళ్ళులా పరిణమించి జీవిత పర్యంతం తరతరాలుగా గుచ్చుతూనే ఉంటే ...? ఎంతటి ఆవేదన కలుగుతుంది? ఎంతటి ఆవేశం రగులుతుంది? తాను తాకి తన్మయ గేయాలను పలికించాల్సిన చినుకు ... ముల్లులా పదే పదే మనసుకు, భవితకూ తగిలి, రగిలి గాయాలను చేస్తూ ఉండడం- ఎంతెంత అసమ న్యాయానికి, అన్యాయానికీ కారణమవుతుంది! అనేక చోట్ల, అనేకనేక సందర్భాల్లో, అనేక అనేక అనేక పరిస్థితుల్లో, అనేక అనేకుల జీవితాల్లో 'కులం' అనే వివక్ష ముల్లు చేసిన గాయాలను వివిధ రూపాల్లో వివరిస్తాయి ఈ సంకలనంలోని కథలు. అందుకనే ఈ సంపుటికి 'ముళ్ళ చినుకులు' అని పేరు పెట్టటం బాగా నప్పింది.
ఇందులో రెండు, మూడు తప్ప మిగతా అన్నీ చాలా చిన్న కథలు. విషయాన్ని చాలా సూటిగా, నేరుగా విప్పి చెప్పిన కథలు. నేడు రిజర్వేషన్ల మీద జరుగుతున్న చర్చ ఇంతా అంతా కాదు. దాని లోతుపాతుల మీద అవగాహన లేకున్నా - సమాజంలో కొంతమంది ప్రతిభావంతులు కాకున్నా గొప్ప అవకాశాలు పొందుతున్నారని; కొందరి ప్రతిభావంతుల అవకాశాలను తన్నుకుపోతున్నారనీ విష ప్రచారం జరుగుతోంది. అర్హతకు ఆమడదూరంలో ఉన్న వారు సైతం నెపాన్ని రిజర్వేషను మీద నెట్టేయడం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. దళిత విద్యావంతులు తమ ప్రతిభ చేత అవకాశాలు పొందిన సందర్భాల్లోనూ ... ఆ విషయాన్ని గుర్తించకుండా కొందరు కువ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ సంకలనంలోని 'ప్రతిభ' కథ అలాంటి ఉదంతాలను గుర్తు చేస్తుంది. గీతిక సహజంగానే ప్రతిభావంతురాలైనప్పటికీ - రిజర్వేషను కారణంగానే తాను అవకాశం పొందుతున్నట్టు అవహేళనలకు గురవుతుంది. గీతిక బాధపడుతుంటే- ''అలాంటి మాటలకు బాధ పడి ప్రయోజనం లేదు. చదువు ద్వారానే అలాంటివారికి సమాధానం చెప్పాలి'' అని హితవు చెబుతుంది తల్లి. టోక్యో ఒలింపిక్స్‌లో హాకీలో అద్భుతంగా ఆడి, చాలా ఏళ్ల తరువాత పతకంపై ఆశలు రేకెత్తించింది మన మహిళా జట్టు. హోరాహోరీగా పోరాడి, ఆఖర్లో ఓడిపోయిన అమ్మాయిలను దేశం మొత్తం కీర్తిస్తుంటే- కొందరు పెత్తందారీ కులవాదులు వందన అనే క్రీడాకారిణిపై కులపరమైన దూషణలకు దిగారు. వందన దళిత అమ్మాయి కావడం వల్లే జట్టు గెలవలేదని, అలాంటి వారికి ఆట ఎందుకని ఎగతాళి చేశారు. ఎన్ని ఆటంకాలూ అవరోధాలూ ఆవహేళనలూ ఎదురైనా మున్ముందుకే సాగిపోవాలన్న తండ్రి మాటలను గుర్తు చేసుకుంటుంది ఆ అమ్మాయి. కులోన్మాదులు ఏదొక పేరుతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలని చూస్తారు. దానిని అధిగమించి మరింత ధైర్యంతో ముందుకు సాగిపోవడమే అలాంటి అనేకమంది పొగరుబోతులకు ఇలాంటి సాధకులు ఇవ్వాల్సిన సమాధానం. ఈ కీలకాంశాన్ని ఆచరణాత్మకంగా చెప్పిన అనేక కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. ఇవన్నీ వివక్షను వివిధ కోణాల్లో అనుభవించి, ఆవిష్కరించిన కథలు. గాయపడిన గుండెల్లో మొలకెత్తిన యథార్థ వ్యథాక్షరాలు.
అహంకారాన్ని, ఆధిపత్యాన్నీ కేవలం పెత్తందారీ కులాలు మాత్రమే ప్రదర్శిస్తాయా? లేక అది దొంతర దొంతరలుగా ప్రవహిస్తుందా? అన్ని తరగతుల్లోనూ, సమూహాల్లోనూ మహిళల అణచివేత, వారి పట్ల వివక్షా ఒక పరంపరగా కొనసాగుతుందా? ఈ ప్రశ్నలకు సంకలనంలోని మాలపెళ్లాం, వివక్ష కథల్లో జవాబులు దొరుకుతాయి. నచ్చి మెచ్చి పెళ్లాడిన లాలన పట్ల తీవ్రమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు నవీన్‌. తనకు తెలిసిన పెత్తందారీ కులాల స్త్రీల ప్రతిభను, ప్రావీణ్యాలను పొగుడుతూ ... తన కులానికే చెందిన విద్యావంతురాలైన భార్యను కించపరుస్తూ ఉంటాడు. అణగిమణిగి ఉండటానికే ఆమెను పెళ్లాడినట్టు హూంకరిస్తాడు. 'అంటరాని ఆడది అదే అంటరాని మొగుడికి మరింత అంటరానిదిగా' చేసిన పురుషాధిపత్యాన్ని గుర్తించి, ఆఖరిలో గట్టిగా ప్రశ్నిస్తుంది లాలన. మోతుబరి కుటుంబం కాలక్రమేణా ఆర్థికంగా చితికిపోయినప్పుడు ఎలాంటి స్థితిని ఎదుర్కోవల్సి ఉంటుందో వివరించిన కథ 'వివక్ష'. ఆర్థిక స్థితి అనేది సమాజంలో మన స్థాయిని, చెల్లుబాటునీ నిర్ణయిస్తుంది. సామాజిక వివక్ష తీవ్ర మనోవేదనను కలిగిస్తుంది. ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తుంది. ఈ రెండు కోణాలను సమన్వయం చేస్తూ సాగిన సహానుభూతి కథ ఇది. వివక్షకు గురైన వారే వివక్షపై రాయాలన్న వాదనకు పరిమితం కాకుండా - వివక్షను వ్యతిరేకించే, అసమానతల నిర్మూలనను కోరుకునే రచయితల కథలకు కూడా ఈ సంకలనంలో చోటిచ్చారు. విశాలమైన ఈ భావన ఇప్పుడు చాలా అవసరం. మనువాద ఉన్మాదం బాహాటంగా ముందుకొచ్చి, సమానత్వ భావాలపై దాడి చేస్తున్న సందర్భంలో - సమాజంలో మార్పు కోరే అన్ని గొంతులూ ఒక్కటవ్వాలి. అది నేటి చారిత్రిక అవసరం. ఈ సంకలనం ద్వారా అలాంటి ప్రయత్నానికి ఒక అడుగు ముందుకు వేయడం అభినందనీయం.ఈ సంకలనం కథకుల్లో చాలామంది ఇప్పటికే చాలా కథలు రాసినవారు కాగా, కొంతమంది కొత్త వారు. కథల్లో కొన్ని నిర్మాణపరంగా చాలా సాదాగా ఉన్నాయి. ఇతివృత్తం బాగున్నా - అల్లికలో, నడకలో మరింత నైపుణ్యం పొందుపర్చాల్సి ఉంది. సంకలన కర్తల్లో ఒకరైన అరుణ చెప్పినట్టు- గొప్ప రచనా శైలిని పరిచయం చేయడం ఈ సంకలనం ఉద్దేశం కాదు.. తరతరాలుగా గాయపడిన గొంతులను వినిపించటం ఈ ప్రయత్నం ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యం నూటికి నూరుపాళ్లూ ఈ సంకలనంతో నెరవేరిందని చెప్పొచ్చు. ఇదొక మంచి ఆరంభంగా అనుకొని, మున్ముందు ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని చేయడం, మరింత మంది రచయితలను చేర్చుకొని, మరిన్ని సంకలనాలు తీసుకురావడం ... చాలా అవసరం. ఈ సంకలనం పేరుకు తగ్గట్టుగానే ముళ్ళ చెట్ల మథ్యలోంచి విరబూస్తున్న చిరు దరహాసాలను అందమైన ముఖచిత్రంగా అందించిన కీర్తన చంద్రగిరికి అభినందనలు. ఈ ముళ్ళ చినుకులను మీ హృదయాలపై వర్షింపదలిస్తే - 70754 14466 నెంబర్లో సంప్రదించొచ్చు.

- శాంతిమిత్ర

ముళ్ల చినుకులు(దళిత కథా సంకలనం)
రచయిత : అరుణ గోగులమండ, మానస ఎండ్లూరి
పేజీలు: 200
వెల: 150 ప్రతులకు: 70754 14466