- 23వ ఐఎంసిడబ్ల్యూపి తీర్మానం
- భారత్ నుండి హాజరైన ఎంఎ బేబీ, కె బాలచంద్ర
ఇజ్మీర్ (టర్కీ) : ఇజ్రాయిల్ దాడులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాలస్తీనా ప్రజలకు ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన కమ్యూనిస్ట్, వర్కర్స్ పార్టీలు తమ పూర్తి సంఘీభావాన్ని తెలియజేశాయి. టర్కీలోని ఇజ్మీర్‌లో శుక్రవారం ప్రారంభమైన అంతర్జాతీయ కమ్యూనిస్టు వర్కర్స్ పార్టీల (ఐఎంసిడబ్ల్యూపి) 23వ అంతర్జాతీయ సమావేశం ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గాజా, వెస్ట్‌బ్యాంక్‌లో రక్తపాతం, ఊచకోతలను తక్షణమే ఆపాలని, ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం 1967కి ముందున్న సరిహద్దులతో సార్వభౌమత్వం కలిగిన పాలస్తీనా దేశం ఏర్పాటుకు చర్చలు ప్రారంభించాలని ఐఎంసిడబ్ల్యుపి ఆ తీర్మానంలో డిమాండ్ చేసింది. ఈ సమావేశానికి ఆతిధ్యం ఇస్తున్న టర్కీష్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెమల్ ఓకుయాన్ ప్రారంభోపన్యాసం చేశారు. గత అక్టోబర్‌లో జరిగిన ఐఎంసిడబ్ల్యూపికి ఆతిధ్యం ఇచ్చిన క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎమిలియో లోజాడా గార్సియా ఆ తరువాత ప్రసంగిచారు. భారత్ నుంచి సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, పార్టీ అంతర్జాతీయ విభాగం అధ్యక్షులు ఎంఎ బేబీ, సిపిఐ నాయకులు కంగో బాలచంద్ర ఈ ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ, పాలస్తీనాపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి మొత్తం 68 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.