Aug 04,2023 08:35

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలను వెంటనే ఆపేయాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) తీర్పు వెలువరించింది. నాగేంద్రకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. రాష్ట్రంలోని 110 ఇసుక రీచ్‌లలో వెంటనే తవ్వకాలు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను తీర్పులో పేర్కొన్న ఎన్‌జిటి.. గత ఉత్తర్వులు అరణియార్‌ నదిలోని 18 రీచ్‌లకే పరిమితం కాదని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఎపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎన్‌జిటి వ్యాఖ్యానించింది. ట్రిబ్యునల్‌ తీర్పునకు ఎపి ప్రభుత్వం వక్రభాష్యం చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
            రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటీ (సియా) ఆదేశాల తర్వాత ఇసుక తవ్వకాలపై నివేదించాలని ఎపి ప్రభుత్వాన్ని ఎన్‌జిటి ఆదేశించింది. ఇసుక తవ్వకాలపై జెపి వెంచర్స్‌ కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటీ ఉత్తర్వులను అమలు చేయాలన్న ఎన్‌జిటి.. పర్యావరణ అనుమతులు తీసుకునే వరకు తవ్వకాలు చేపట్టరాదని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.