Oct 27,2023 16:35

పనామా సిటీ  :   కాపర్‌ మైనింగ్‌ను దోచుకునేందుకు అవకాశం కల్పించిన పనామా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం ప్రజలు మరోసారి నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ నిరసన ప్రదర్శనల్లో సాధారణ ప్రజానీకంతో పాటు వివిధ సంఘాలు, యూనియన్లతో పాటు ఉపాధ్యాయులు కూడా భాగస్వామ్యమయ్యారు. కాపర్‌ దోపిడీకి వీలుకల్పించేలా మైనింగ్‌లో రాయితీ అందిస్తూ అధ్యక్షుడు లారెంటినో కార్టిజో తీసుకువచ్చిన వివాదాస్పద చట్టాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. అధ్యక్షుని భవనం వైపు ర్యాలీ చేపట్టగా, మరో బృందం రాజధాని ప్రాంతం వైపు భారీ ప్రదర్శనగా వెళ్లారు. ఈ వివాదాస్పద చట్టాన్ని రద్దు చేయాలంటూ పశ్చిమ పనామా ప్రజలు జాతీయ అసెంబ్లీ ఎదుట నిరసన చేపట్టారు. కోలన్‌ ప్రావిన్స్‌లోని కార్టిజో ఎస్టేట్‌ ముందు కూడా ప్రజలు నినాదాలు చేశారు. నిరసన ప్రదర్శనను అడ్డుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సైన్యం, పోలీసులను మోహరించింది. ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు సెక్యూరిటీ ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశారు.

కెనడా కంపెనీ ఎఫ్‌క్యూఎం అధీనంలోని మినెరా పనామాకు 20 ఏళ్ల పాటు రాయితీ అందించే విధంగా పనామా అధ్యక్షుడు లారెంటినో కార్టిజో సంతకం చేసిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఒప్పందం పనామా సిటీ నుండి 120 కి.మీ దూరంలో ఉన్న కోలన్‌ ప్రావిన్స్‌లోని అటవీ ప్రాంతంలో ఖనిజ నిల్వలను దోచుకునేందుకు కంపెనీకి అధికారం ఇస్తుంది. తమ దేశ ఖనిజ సంపదను విదేశీయులు దోచుకువెళ్లేందుకు ఈ కంపెనీ అవకాశం కల్పిస్తోందని పర్యావరణ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మైనింగ్‌ ప్రాంతం ప్రపంచంలోని జీవవైవిధ్య ప్రాంతాలలో ఒకటైన మెసో అమెరికన్‌ బయోలాజికల్‌ కారిడార్‌ ప్రాంతంలో ఉందని పేర్కొన్నారు. దేశ చట్టాల పరిధిలోకి రానంతవరకు కంపెనీ ఇష్టారీతిన వ్యవహరించవచ్చనే నిబంధన కాంట్రాక్టులో ఉందని, ఇది ప్రాంత వైవిధ్యాన్ని దెబ్బతీస్తుందని మండిపడుతున్నారు.