Oct 18,2022 10:11

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించరాదని సిపిఐ జాతీయ మహాసభ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేసింది. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన 600 రోజులుగా జరుగుతున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతును ప్రకటించింది.ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు సోమవారం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో జరిగిన అద్వితీయ పోరాటం కారణంగా ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైందని తీర్మానంలో పేర్కొన్నారు. ఉక్కు ఉత్పత్తుల్లో గణనీయమైన మెరుగుదలను చూపిన ఈ సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణమని తెలిపారు. కోటి మందికిపైగా ప్రజానీకానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ విశాఖ ఉక్కు జీవనోపాధి కల్పిస్తోందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం భవిష్యత్తులో జరిగే పోరాటానికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని తీర్మానంలో ప్రతిపాదించారు. తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా సిఎం జగన్‌తోపాటు వైసిపి ఎంపీలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 600 రోజులుగా ఉద్యమం జరుగుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో సీనియర్‌ మంత్రులుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మూడు రాజధానులంటూ నాటకాలాడుతున్నారని విమర్శించారు.
        విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందా ? అని ప్రశ్నించారు. విశాఖకు రైల్వేజోన్‌ ఇవ్వకుండా కేంద్రం నెట్టుకు వస్తోందన్నారు. విశాఖకు రైల్వేజోన్‌ లేకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందా?, గంగవరం పోర్టును ఆదానికి అప్పగిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందా ? అని ప్రశ్నించారు.