Jun 20,2023 17:30

ప్రజాశక్తి-కాకినాడ : విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన రడీనెస్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ సిచ్యుయేషనల్‌ ఇంగ్లిష్‌ (రైజ్‌) కార్యక్రమాన్ని జగ్గంపేట నియోజకవర్గంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డా. కృతికా శుక్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ కోర్టుహాల్‌లో రైజ్‌ కార్యక్రమంపై కలెక్టర్‌ కృతికా శుక్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గతేడాది ఆగస్టు 1వ తేదీన తుని నియోజక వర్గంలోని పాఠశాలల్లో రైజ్‌ ప్రాజెక్టును ప్రారంభించామని తర్వాత దశల వారీగా కాకినాడ అర్బన్‌, కాకినాడ రూరల్‌, పిఠాపురం నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో అమలు చేసినట్లు తెలిపారు. సరళీకృత విధానాల ద్వారా ఇంగ్లిష్‌ స్పీకింగ్‌ నైపుణ్యాలను పెంపొందించే రైజ్‌ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్నందున త్వరలో జగ్గంపేట నియోజకవర్గంలోనూ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. విద్యార్థులకు అందించేందుకు ప్రత్యేకంగా నిపుణులు రూపొందించిన రైజ్‌ మాడ్యూల్‌ పుస్తకాలను సిద్ధం చేయాలన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లో కూడా రైజ్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఎస్‌ఎస్‌సీ ఫలితాల ఆధారంగా గుర్తించిన పాఠశాలల విద్యార్థుల్లో గణిత నైపుణ్యాలను కూడా పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈవో కేఎన్‌వీఎస్‌ అన్నపూర్ణ, రైజ్‌ కార్యక్రమ కోఆర్డినేటర్‌ జీవీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.