Oct 20,2023 07:05

             విశ్వ మానవాళి దైనందిన జీవన విధా నంలో గణాంక శాస్త్రానికి ప్రాధాన్యం ఉన్నది. గణాంకాలు లేకుండా వ్యక్తిగత జీవితం, కుటుంబం, కార్యాలయం, పరిశ్రమలు, ప్రభుత్వ వ్యవస్థల్లో ఏ పనీ జరగదు. ఆరోగ్య పరిరక్షణ, న్యాయశాస్త్రం, ఆర్థికశాస్త్రం, వాణిజ్యశాస్త్రం, వైజ్ఞానిక శాస్త్రం, గణిత శాస్త్రం, సామాజిక శాస్త్రం, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, విద్య లాంటి అన్ని రంగాల్లో సంఖ్యలతో అధ్యయనం ద్వారా గణాంకశాస్త్రం ప్రధానమైందిగా గుర్తించబడింది. గణాంక శాస్త్రానికి ప్రాణాధారంగా డేటా ఉపయోగపడుతున్నది. వాస్తవాలు స్పష్టంగా, స్థిరంగా ఉంటాయి. గణాంకశాస్త్రం మాత్రం సులభంగా మారే స్వభావంతో ఉంటాయి. సాధారణంగా జనాభా సర్వే నుంచి లభించే గణాంకాలతో స్పష్టమైన, అవసరమైన పథకాల రచన జరుగుతుంది. గణాంకాల్లో లోపం ఉన్నప్పుడు ఫలితం కూడా తేడాగా వస్తుందని తెలుసుకోవాలి.
 

                                                                        ప్రపంచ గణాంకశాస్త్ర దినం

అక్టోబర్‌ 20న ''ప్రపంచ గణాంకశాస్త్ర లేదా సంఖ్యాశాస్త్ర దినోత్సవం జరుపు కుంటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా వున్న దేశాలు తమ తమ సుస్థిరాభివృద్ధి కోసం గణాంక శాస్త్రాన్ని విరివిగా వినియోగించుకుంటాయి. పథకాల రూపకల్పన, సర్వేల సమాచారం, పథకాల అమలు శాతం, భవిష్యత్తు నిర్ణయాలు లాంటి అంశాల్లో సంఖ్యాశాస్త్ర వివరాలు ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వాలు తీసుకునే అనేక నిర్ణయాలకు పునాదిగా గణాంక వివరాలు దోహదపడతాయి. పి.సి. మహల్‌ నోబిస్‌ జన్మదినం సందర్భంగా భారత దేశవ్యాప్తంగా ప్రతి ఏట జూన్‌ 29న ''జాతీయ గణాంకశాస్త్ర దినం'' జరుపుకుంటున్నది.
 

                                                                గణాంకాల అధ్యయనాలతో సుస్థిర ప్రగతి

గణాంక సమాచార సేకరణ, శాస్త్రీయ అధ్యయనం, ఫలితాల విశ్లేషణ, అంతిమంగా లభించిన ఫలితాలను బట్టి సఫల దిశగా అమలులోకి తేవడం లేదా అంచనా వేయడం లాంటివి సంఖ్యాశాస్త్రం ద్వారా జరుగుతుంది. ప్రగతి తీరునే కాకుండా, వైఫల్య అంచనాలను కూడా గణాంకశాస్త్రం వివరిస్తుంది. మానవ జీవన విధానాన్ని సరళతరం చేయడానికి, నూతన ఆవిష్కరణలకు, సృజనశీల ఆలో చనలకు గణాంకశాస్త్రం ఊతం ఇస్తున్నది. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పన, మన జీవన విధాన అంచనా, జనాభా లాభపడడం, లోటుపాట్లను గుర్తించి సరైన దిశలో కదలడం లాంటివి సంఖ్యాశాస్త్ర వినియోగంతో ఒనగూరుతాయి.
            అంతర్జాతీయ సంస్థలు, యూనివర్సిటీలు, పౌర సమాజం, ఉన్నత విద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు తమ తమ పరిధిలో ప్రపంచ గణాంకశాస్త్ర దినం నిర్వహించుకుంటారు. ఖచ్చితమైన గణాంకాల అధ్యయన విశ్లేషణలతో సరైన పథకాల రచనను చేయవచ్చు. చిట్టి కొట్టు నుంచి బహుళజాతి సంస్థల వరకు గణాంకాల వినియోగం తప్పనిసరిగా జరుగుతుంది. వైద్యరంగం రోగనిర్థారణ పరీక్షల్లో గణాంకాల ప్రాధాన్యం అధికంగా ఉంటున్నది. పరిశోధనలు చేసే సంస్థలకు గణాంకాలు ఉపయుక్తంగా ఉంటాయి. ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌, ఆడిటింగ్‌ రంగాలు సంఖ్యాశాస్త్రం మీద మాత్రమే ఆధారపడతాయి.
- మధుపాళీ
సెల్‌: 9949700037