Jun 25,2023 16:10

ఇప్పుడు ఇంట్లోని చిన్నా పెద్దా అందరూ స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ అంటేనే.. యూజర్‌ ఫ్రెండ్లీకి మారుపేరు. ఒక్కో అవసరానికి ఒక్కో యాప్‌ ఇప్పుడు అందుబాటులో వుంది. అవసరం వున్నా లేకపోయినా.. వివిధ రకాల యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నాం. రోజుల తరబడి వాడని యాప్స్‌ కూడా మన మొబైల్లో వుంటాయి. అవి మన స్టోరేజీని నింపేస్తున్నా.. వాటి గురించి పట్టించుకోము. కానీ, 'ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (సెర్ట్‌-ఇన్‌)' ఒక షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించింది. వినడానికి, చదవడానికి స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించే యాప్స్‌తో ఎంత ప్రమాదమో తెలియజెప్పింది. మనం వాడుతున్న ఆండ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్లలోకి 'స్పిన్‌ ఓకే' స్పైవేర్‌ చొచ్చుకొచ్చింది. ఇది మన వ్యక్తిగత సమాచారంతో పాటు ఈ-మెయిల్స్‌ డేటాను కూడా ఫోన్‌ కెమెరా సాయంతో రికార్డు చేసి, తమకు అవసరమైన వారికి చేరవేస్తుంది. మన రోజువారీ యాక్టివిటీ మొత్తాన్ని రికార్డు చేస్తుంది. అంతటి సామర్థ్యం గల ఈ స్పైవేర్‌ దేశంలోని 42 కోట్ల స్మార్ట్‌ఫోన్లలో చొరబడింది. సెర్ట్‌-ఇన్‌ నివేదిక ప్రకారం.. గూగుల్‌ ప్లే స్టోర్స్‌లోని 105 యాప్స్‌ ద్వారా సదరు స్పైవేర్‌ మన ఆండ్రాయిడ్‌ ఫోన్లలోకి చొరబడుతోంది.
ముఖ్యంగా ఆన్‌లైన్‌ క్యాష్‌ రివార్డ్స్‌, గేమ్స్‌, ఫిట్‌నెస్‌, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌, నాయిస్‌ వీడియో ఎడిటర్‌, జాప్యా, బైగో ఎంవీ బిట్‌, క్రేజీ డ్రాప్స్‌, టిక్‌, వురు ఫ్లై, క్యాష్‌ జాయిన్‌, క్యాష్‌ ఈఎం, ఫిజ్జో నావెల్‌ వంటి యాప్స్‌లో 'స్పిన్‌ ఓకే' స్పైవేర్‌ చొరబడినట్లు సెర్ట్‌-ఇన్‌ వెల్లడించింది.
దీన్ని నివారించడానికి యాండ్రాయిడ్‌ వినియోగదారులు యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించాలి. అంతేకాదు.. ఈ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే క్రమంలో అది సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. మీ ఫోన్‌ ఓఎస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి. ముఖ్యంగా అవసరానికి మించిన యాప్‌లు మీ మొబైల్‌లో లేకుండా చూసుకోవాలి. దీనివల్ల స్టోరేజీ సమస్యతో పాటు, వైరస్‌ సమస్య నుంచి కూడా దూరంగా వుండొచ్చు.