Oct 14,2022 21:06

- రాయితీలు ఇవ్వని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- ఆదుకోకుంటే రోడ్డు మీదకు 75 వేల మంది కార్మికులు
- సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నర్సింగరావు
ప్రజాశక్తి - చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) :
రాష్ట్రంలోని స్పిన్నింగ్‌, టెక్ట్స్‌టైల్స్‌ మిల్లులు నష్టాలు, తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. గుంటూరు జిల్లా కాటన్‌ హబ్‌ పేరుతో 2006లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు నేటికీ ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్ట్స్‌టైల్స్‌ పరిశ్రమల కోసం గతంలో ప్రకటించిన రూ.1400 కోట్ల రాయితీలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్‌ డ్యూటీ పేరుతో ఒక యూనిట్‌ విద్యుత్‌ ఛార్జీ ఆరు పైసల నుంచి రూపాయికి పెంచడం అన్యాయమన్నారు. ఇది పరిశ్రమలకు మోయలేని భారమని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు పంచదార ఫ్యాక్టరీలు, చిట్టివలసలోని జ్యూట్‌ మిల్లు, అనేక డెయిరీలు మూతబడ్డాయని తెలిపారు. ఇప్పుడు స్పిన్నింగ్‌, కాటన్‌ మిల్లులూ మూతబడే దశలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 110 టెక్ట్స్‌టైల్స్‌ మిల్లులుంటే వాటిల్లో దాదాపు 75 వేల మంది వరకు పని చేస్తున్నారని, చిలకలూరిపేట పరిసరాల్లోనే 34 మిల్లుల్లో 30 వేల మంది పని చేస్తున్నారని తెలిపారు. ఈ మిల్లులపై ఆధారపడే అనేక మంది రైతులు పత్తి సాగు చేస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులతోపాటు పరిశ్రమలూ దెబ్బతింటున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) ద్వారా పత్తి కొనడం లేదని తెలిపారు. గతేడాది రైతుల వద్ద పంట ఉన్న సందర్భంలో పత్తి బేలు రూ.45 వేలు ఉండగా, అది ట్రెడర్ల చేతుల్లోకి వెళ్లిన వెంటనే రూ.1.25 లక్షలు అయిందని తెలిపారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి స్పిన్నింగ్‌, టెక్ట్స్‌టైల్స్‌ మిల్లులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోకుంటే ఆందోళనకు దిగుతామని, జాతీయ రహదార్లనూ దిగ్బంధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌, ఉపాధ్యక్షులు గుంటూరు విజరుకుమార్‌, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయులు నాయక్‌, కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ పాల్గొన్నారు.