Nov 06,2023 08:37
  • సంక్షోభంలో టెక్స్‌టైల్‌ పరిశ్రమ
  • రాయితీ బకాయిలు ఇవ్వని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. మొత్తం వంద స్పిన్నింగ్‌ మిల్లులు ఉండగా, గత ఏడాది కాలంలో ఏడు మిల్లులు మూతపడ్డాయి. దీనివల్ల వేలాది మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడింది. మొత్తం మిల్లుల్లో దాదాపు లక్ష మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి తదితర జిల్లాల్లోని మిల్లులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం పరిధిలో 85 మిల్లుల వరకు ఉన్నాయి. వాటిలో 50 శాతం మాత్రమే నిర్వహించగలుగుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాయితీలు సకాలంలో రాకపోవడంతో మిల్లులను నడపలేకపోతున్నామని వాటి యజమానులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి టెక్స్‌టైల్‌ అప్‌డేషన్‌ ఫండ్‌ (టఫ్‌) రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం 2012 నుంచి బకాయిలను పెండింగ్‌ పెట్టింది. ఏటా ఈ మిల్లులకు కేంద్రం నుంచి రూ.250 కోట్లు ఈ నిధి నుంచి రావాల్సి ఉంది. ఇవి రావడం లేదు. మరోవైపు రాష్ట్రంలోని మిల్లులకు విద్యుత్‌ రాయితీల సొమ్ము రూ.1,500 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. 2017 నుంచి రాయితీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి విడతగా రూ.250 కోట్ల విద్యుత్‌ బకాయిలు విడుదల చేసింది. ఏటా ఇదే రీతిలో బకాయిలు విడుదల చేస్తామని సిఎం జగన్‌ ప్రకటించినా, గత రెండేళ్లుగా రాయితీ సొమ్ము విడుదల కాలేదు. విద్యుత్‌ ఛార్జీల పెరుగుదల వల్ల ఏటా భారం పెరుగుతోంది. మిల్లుల నుంచి ప్రస్తుతం యూనిట్‌కు రూ.9.50 నుంచి రూ.10.50 వరకు వసూలు చేస్తున్నారు. ట్రూఅప్‌ ఛార్జీలు, ఇతర అనపు ఛార్జీల వసూళ్లతో విద్యుత్‌ బిల్లుల భారం పెరిగిందని రాష్ట్ర టెక్స్‌టైల్‌ మిల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పి.కోటిరావు తెలిపారు. గతేడాది కన్నా ఈ ఏడాది యూనిట్‌కు రూ.2 నుంచి రూ.3 వరకు ఛార్జీలు పెరిగాయి. కేజీ యారన్‌ (నూలు) ఉత్పత్తి చేయాలంటే మూడు యూనిట్ల విద్యుత్‌ అవసరం. సగటున కేజీకి రూ.9 అదనంగా ఖర్చు అవుతోంది. ఇది మిల్లులకు భారంగా మారింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా పత్తి ఉత్పత్తి తగ్గడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి పత్తిని దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి.
          రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల కూడా ఎగుమతులు తగ్గి సంక్షోభం మరింత పెరిగింది. ముడిసరుకు ధర పెరగడం, ప్రాసెసింగ్‌ ఖర్చులు పెరగడం వల్ల నిర్వహణ కష్టతరంగా మారిందని కోటిరావు తెలిపారు. విద్యుత్‌ ఛార్జీల భారం నుంచి బయటపడడానికి సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలని ఆయన కోరారు.