
మానవుడు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడానికి మొదట ఎడ్లబండిని ఉపయోగించాడు. పరిణామక్రమంలో అనేకరకాల యంత్రాలతో తన ప్రయాణ వేగాన్ని పెంచుకున్నాడు. అంతటితో ఆగక ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి ప్రయాణించే దశకు చేరుకున్నాడు. దీన్నే అంతరిక్షయానంగా చెప్పుకుంటున్నాం. అంతకుముందు అంతరిక్షానికి చేరుకోడానికి చాలా ఏళ్లే పట్టింది. అందుకు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఎన్నో చిక్కుముడులను విప్పుకుంటూ ఎట్టకేలకు లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే అంతరిక్షంలోకి వెళ్లడం, చంద్రునిపై కాలుమోపడం లాంటి అనేక అద్భుతాలు చేశాడు. అయితే ఈ అద్భుతాన్ని సామాన్యులకూ చేరువ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దీనిపైనే ఈ ప్రత్యేక కథనం..
ఈ అనంత విశ్వానికి చివరి సరిహద్దు అంతరిక్షమే. అయితే పరిణామ క్రమంలో మానవుని ప్రయాణం సరిహద్దులు దాటిపోయింది. మొదట జంతువుల సాయంతో ప్రయాణించిన మానవుడు క్రమేణా యంత్రాలతో వేగంగా ప్రయాణించాడు. అలాంటి ప్రయాణాలన్నీ సాహసాలే. మానవ సాహసానికి నిదర్శనంగా తన ప్రయాణంతో భూమిపై ప్రతి చదరపు అంగుళాన్నీ అన్వేషించాడు. కాలక్రమంలో ఆ అన్వేషణ గ్రహాలకు చేరింది. దీంతో భూమిని దాటి, అన్వేషణ ప్రారంభించాడు. అలా అంతరిక్షయానం ఆరంభించాడు. ఈ క్రమంలో అంతరిక్షంలో అనేక లక్ష్యాలను ఛేదించి, గ్రహాలపై జీవాల ఉనికిని కనుగొనే స్థితికి చేరాడు. అయితే ఇదంతా సామాన్యులకు అంతగా పరిచయం లేని పరిస్థితులు. ఆ పరిస్థితుల్ని సైతం అధిగమించాలనే లక్ష్యంతో అంతరిక్ష ప్రయాణాన్ని సామాన్యులకూ అందుబాటులోకి తేవాలనే సత్సంకల్పంతో ముందుకు కదులుతున్నాడు. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. 2030 నాటికి సామాన్యుల్ని అంతరిక్షానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సైతం అడుగులు వేస్తోంది.
- సామాన్యుల కలకు చేరువలో..

అంతరిక్షయానం (స్పేస్ టూర్) ఇంకెంతో దూరంలో లేదని నిపుణులు చెబుతున్నారు. గతేడాది 2022లో రెండు బృందాలు అంతరిక్షయానం చేసొచ్చాయి. అయితే ఈ ప్రయాణం చూసినంత సులభమూ కాదు, డబ్బులు వెచ్చించేంత చౌకా కాదు. అసలు అంతరిక్షయానం కోసం స్పేస్‌క్రాఫ్ట్ ఎక్కాలంటే ఎంత ఖర్చవుతుంది? అందరూ భరించేంత మాత్రం కాదని చెప్పొచ్చు. న్యూ స్పేస్ ఏజ్ పేరుతో ఇటీవల అంతరిక్ష ప్రయాణానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అలా వర్జిన్ గెలాటిక్, స్పేస్ ఎక్స్, వర్జిన్ అట్లాంటిక్, ఎక్స్‌కార్ ఎయిరోస్పేస్, బ్లూ ఆరిజన్, అర్మాడిల్లో ఎయిర్‌స్పేస్ లాంటి సంస్థలు స్పేస్ టూరిజం ఏర్పాట్లలో ఉన్నాయి. ఇక ధరల విషయానికొస్తే.. ఒక్కరికీ కనీసం 4,50,000 డాలర్ల (సుమారు మూడు కోట్లు) వరకూ ఖర్చవుతుందట. అయితే ఇటీవల జెఫ్ బెజోస్ ఇటీవల అంతరిక్ష ప్రయాణం చేసిన న్యూ షెపర్డ్ టికెట్ బిడ్డింగ్ కంటే తక్కువేనంటున్నారు.
- అసలు ఉద్దేశం..
స్పేస్ టూరిజం... బిజినెస్ పర్సన్స్‌కు రిక్రియేషన్ లాంటిది. వ్యోమగాములు కానివారు కూడా అంతరిక్షయానం చేయడం ఈ ప్రాజెక్టుల ఉద్దేశం. ఇదంతా నాన్ సైంటిఫిక్‌గా సాగుతుంది. స్పేస్‌షిప్ 2లో ఎనిమిది మంది ప్రయాణించొచ్చు. అందులో ఇద్దరు పైలెట్లు ఉంటారు. దీనికి సంబంధించి టికెట్ల అమ్మకాలను ప్రారంభించారు. గతంలో ప్రకటించిన ధరకు ఇది డబుల్ కావడం గమనార్హం. ఇక టికెట్‌ల విధానం చూస్తే 1000 డాలర్లు ఫుల్లీ రిఫండబుల్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. టికెట్‌లు అందుబాటులోకి వచ్చినప్పుడు ముందుగా రిజిస్టర్ చేసుకున్నవాళ్లకు సమాచారం అందిస్తారు. టికెట్ ధర ఇప్పటివరకూ నిర్ణయించలేదు. అయితే గతంలో చెప్పిన 2,50,000 డాలర్ల కంటే ఎక్కువే ఉంటుందని మాత్రం తెలుస్తోంది. ఇప్పటివరకూ 600 మందికిపైగా డబ్బులు చెల్లించినట్లు సమాచారం. అందులో సింగర్ జస్టిస్ బీబర్, లియోనార్డో డికాప్రియోలాంటి ప్రముఖులు ఉన్నారు.

- బిడ్డింగ్‌లో 159 దేశాలు..
స్పేస్ ఫ్లయిట్స్ ఆదరణ వస్తుండటం చూసి సంస్థ ఏటా వందలాది ఫ్లైట్స్ నిర్వహించాలని అనుకుంటోంది. అమెరికాలోని న్యూ మెక్సికోలో ఉన్న స్పేస్ పోర్టు నుంచి ఈ ఫ్లైట్స్ నిర్వహించనున్నారు. ఈ స్పేస్ ఫ్లయిట్‌లో విహరించాలనుకుంటే.. మూడు రోజుల శిక్షణ ఉంటుంది. అలా అంతరిక్షంలోకి వెళ్లాక, కొన్ని నిమిషాలు అక్కడ విహరించే అనుభూతిని ఆస్వాదించొచ్చు. ఆ తర్వాత తిరిగి భూమికి చేరుకోవచ్చు. ఈ బిడ్డింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా 159 దేశాల నుంచి 7,600 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఆ బిడ్డింగ్‌లో గరిష్టంగా 28 మిలియన్ డాలర్లు పలికింది. అంతేకాదు 50 వేల మంది అయితే ఏకంగా జెఫ్ బెజోస్ అంతరిక్షంలోకి వెళ్లాక తిరిగి భూమి మీదకు రావొద్దని ఆన్‌లైన్‌లో కోరారు.

- ఆర్బిటల్, సబ్ ఆర్బిటల్‌కి తేడా..
ఆర్బిటల్ స్పేస్‌క్రాఫ్ట్ అనేది కక్ష్య వేగంతో ప్రయాణిస్తుంది. సబ్ ఆర్బిటల్ రాకెట్ దాని కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. సబ్ ఆర్బిటల్ ట్రిప్ అయితే స్పేస్‌క్రాఫ్ట్‌లో తిరిగి భూమ్మీదకు వచ్చేప్పుడు అంతరిక్షం అంచుల్లో కొద్ది నిమిషాలు తక్కువ గ్రావిటీ వాతావరణంలో ఉన్న అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇటీవల బ్లూ ఆరిజిన్ కంపెనీ సబ్ ఆర్బిటల్ రాకెట్ టూర్‌ను విజయవంతంగా చేపట్టింది. 2021లో బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ మరో ముగ్గురితో కలిసి అంతరిక్షంలో పర్యటించి వచ్చారు. సబ్ ఆర్బిటల్ రాకెట్లు ఆర్థికంగా అందుబాటులో ఉండటంతో, వాటిని రెండోసారీ వినియోగించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అంతరిక్ష పర్యటనకు ఎంతో క్రేజ్ ఉంది. అందుకే అంతర్జాతీయంగా వర్జిన్ గెలాక్టిక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, ఆరిజిన్ స్పాన్, బోయింగ్, స్పేస్ అడ్వెంచర్స్, జీరో టు ఇన్‌ఫినిటీ వంటి ప్రయివేట్ స్పేస్ టూరిజం కంపెనీలు వాణిజ్యపరంగా స్పేస్ ఫ్లైట్స్‌ను నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి.

- స్పేస్ ఎక్స్ సాధించిన ఘనత..
అంతరిక్ష ప్రయాణం అంటే అది సాధ్యమయ్యేది కాదన్న భావన అందరిలోనూ ఉండేది. దానికోసం ప్రత్యేక శిక్షణ, ప్రభుత్వ సహాయం అవసరం అని చెప్పుకునేవారు. కానీ అదంతా చరిత్రే అని, అంతరిక్ష ప్రయాణం ఇక అందరి సొంతం కాబోతుందని, అంతరిక్షంలో సామాన్యులు సైతం ప్రయాణించవచ్చని అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ నిరూపించింది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్‌కి చెందిన ఈ కంపెనీ అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములను పంపింది. దీంతో అంతరిక్ష ప్రయాణంలో కొత్త శకానికి నాంది పలికింది. ఈ నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలో మూడు రోజులు ప్రయాణం చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను దాటి, ఈ ప్రయాణం సాగింది. భూమి ఉపరితలం నుండి 357 మైళ్ల దూరంలో అంటే సుమారు 575 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు.

- తొట్టతొలి ఉపగ్రహం...
సోవియట్ యూనియన్ 1957 అక్టోబర్ 4న మానవాళి చరిత్రలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ ప్రయోగం జరిపింది. దీంతో ప్రపంచాన్ని ఆశ్చర్యంలోనూ, తన ప్రత్యర్థి అమెరికాని షాక్‌లోనూ ముంచెత్తింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు అగ్రరాజ్యాలైన అమెరికా, సోవియట్ యూనియన్ ఆధ్వర్యంలోని రెండు కూటములలో చేరిపోయాయి. ఆ రెండు కూటముల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రంగా నడుస్తున్న రోజులవి. ఇరు దేశాలు తమ బలం కన్నా ప్రత్యర్థి బలాబలాల మీద విస్తృతమైన గూఢచారి వ్యవస్థతో నిఘా పెట్టి ఉండగా.. బయటి ప్రపంచానికి ఏమాత్రం తెలియకుండా రష్యా మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహ ప్రయోగం చేయడంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రష్యన్ భాషలో స్పుత్నిక్ అంటే ఉపగ్రహం. 22 అంగుళాల చుట్టుకొలతతో, సుమారు 48 కేజీల బరువున్న ఈ ఉపగ్రహం గంటా 36 నిముషాలకోసారి భూమి చుట్టూ ప్రదక్షిణం చేసింది. ఇది అమెరికా భూభాగం మీదకు పోయినప్పుడల్లా చిన్న రేడియో ట్రాన్స్‌మీటర్ ఉన్న వాళ్ళు కూడా దాని నుంచి వచ్చిన శబ్దాన్ని విన్నారు. అప్పటికే తమ స్వంత ఉపగ్రహం తయారీ మొదలుపెట్టిన అమెరికన్లు ఈ విషయం తెలియగానే వేగం పెంచారు. 'ఎక్స్ ప్లోరర్' అని పేరు పెట్టిన ఉపగ్రహాన్ని 1958, ఫిబ్రవరి 1న ప్రయోగించేలోపే.. రష్యన్లు 1957 నవంబర్ 3న లైకా అనే కుక్కపిల్లని స్పుత్నిక్-2 అనే రాకెట్లో అంతరిక్షంలోకి పంపించారు.

- అక్కడా.. పరుగు పందెం..
అంతరిక్షంలోకి అగ్రరాజ్యాల మధ్య పరుగుపందెం మొదలైందని గ్రహించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ దీనికోసం నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఏఎస్‌ఏ) పేరిట ఒక సంస్థను 1958, జులై 29న ప్రారంభించారు. దీనికి విరివిగా నిధులు మంజూరు చేశారు. అయితే అంతరిక్షంలోని పరుగుపందెంలో ముఖ్యమైన మైలురాళ్లు అన్నింటినీ సోవియట్ యూనియనే ముందుగా చేరుకుంది. 1961 ఏప్రిల్ 12న అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి యూరీ గగారిన్, తొలి మహిళ వాలెంటినా తెరిస్కోవా. 1963 జూన్ 16న, మొదటిసారి అంతరిక్షంలో నడిచిన ప్రథమ వ్యక్తిగా 1965 మార్చి 18న అలెక్సీ లియోనోవ్, చంద్రుడి ఉపరితలం మీద పరిశోధనలు చేయడానికి తొలిసారిగా చంద్రుడిని ఢకొీట్టిన లూనా-2 రాకెట్ 1959 సెప్టెంబర్ 13న, అలాగే శుక్రగ్రహం ఉపరితలాన్ని ఢకొీట్టిన వెనెరా-4 రాకెట్ 1967 జూన్ 12న, చంద్రుడి ఉపరితలం మీద దిగిన లూనా-9 రాకెట్ 1966 ఫిబ్రవరి 3న రష్యన్ల ప్రగతికి ఉదాహరణలుగా నిలిచాయి. అయితే.. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై అందులో రష్యా పెద్ద దేశంగా అవతరించాక, అంతరిక్ష పరిశోధనలు వెనకపట్టు పట్టాయి. అయితే 1992లో ఏర్పడ్డ రాస్ కాస్మోస్ సంస్థ ఆధ్వర్యంలో తిరిగి పుంజుకున్నాయి. త్వరలోనే తాము అమెరికాని అందుకోవడమే కాక, వారిని మించిపోవాలని శాస్త్రవేత్తలను అధ్యక్షుడు పుతిన్ కోరుతున్నారు. రానున్న ఐదేళ్లలో చంద్రుడిపై ఒక ల్యాండర్, శుక్రుడిపై ఒక ల్యాండర్ పంపడం లక్ష్యంగా రష్యా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు.

- ఏడేళ్లలో లక్ష్యాన్ని చేరిన అమెరికా..
అంతరిక్ష పరిశోధనలో రష్యన్ల కన్నా వెనకపడిపోతున్నామని గుర్తించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నడీ ఒక బహిరంగ సభలో, 1962 సెప్టెంబర్ 12న రానున్న పదేళ్లలో వ్యోమగాములని చంద్రుని మీదకు పంపించి, క్షేమంగా వెనక్కి తీసుకొస్తామని కెనడీ ప్రకటించారు. అందుకు తన దేశ సైంటిస్టులకు ఒక లక్ష్యం నిర్దేశించాడు. ఆ మరుసటి ఏడాదే ఆయన హత్యకు గురయ్యాడు. అయినా ఆయన లక్షాన్ని ఏడేళ్లలోనే చేరుకున్నారు నాసా శాస్త్రవేత్తలు. అపోలో-11 రాకెట్లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలీన్స్ అనే ముగ్గురు వ్యోమగాములు 1969, జులై 20న చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి, మొదటి ఇద్దరూ చంద్రుడు మీద దిగి.. కొన్ని పరిశోధనలు చేసి, క్షేమంగా తిరిగొచ్చారు. అన్ని విధాల నాసా వారికి ఏమాత్రమూ తీసిపోని రష్యన్లు మాత్రం వివిధ కారణాల వల్ల చంద్రుడి మీదకు తమ వ్యోమగాముల్ని పంపలేకపోయారు.
ప్రస్తుతం నాసా ఆర్టెమిస్ 1 ప్రయోగంపై దృష్టి సారించింది. చంద్రుడి అన్వేషణ కోసం ఈ ప్రయోగాలు చేపట్టింది. మానవసహిత యాత్రను చేపట్టేందుకు సిద్ధమైన నాసా.. చంద్రుడి దక్షిణ ధ్రువాన్నీ పరిశీలించాలని భావిస్తోంది. అంగారక గ్రహం సహా అంతరిక్షంలో సుదూర ప్రయాణాలు చేసేందుకు వీలుగా చంద్రుడిపై దీర్ఘకాలం మానవులు ఉండేందుకు ప్రయోగాలు చేస్తోంది. మానవులను 2024లో ఆర్టెమిస్ 2 ద్వారా చంద్రుడి కక్ష్యలోకి పంపాలని యోచిస్తోంది. చంద్రుడి ఉపరితలంపై 2025కు ముందే మనుషులను దించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కాగా ఈ రేస్‌లో అమెరికా, రష్యా మొదటి రెండుస్థానాల్లో ఉండగా, చైనా మూడో స్థానంలో ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు, ఇటలీ, భారత్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇరాన్, ఇస్రాయేల్, కెన్యా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, ఉక్రేయిన్ దేశాలు ఉన్నాయి.
- మానవుల కంటే ముందుగా..

అంతరిక్షంలోకి మానవుల కంటే ముందుగా జంతువులను పంపించారు. యుఎస్‌ఎస్‌ఆర్ (రష్యా) 1957, నవంబర్ 3న ప్రయోగించిన 'స్ఫుత్నిక్ 2' అనే ఉపగ్రహంలో 'లైకా' అనే కుక్క అంతరిక్షంలో అడుగు పెట్టింది. అంతరిక్షంలోకి తొలిగా వెళ్లిన జంతువు ఇదే. దానిని వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో అది పదిరోజుల పాటు అంతరిక్షంలో గడిపిన తర్వాత అక్కడే చనిపోయింది. అమెరికా ఏబుల్, బేకర్ అనే ఆడ కోతులను 1959, మే 28న అంతరిక్షంలోకి పంపింది. కక్ష్యలోకి ప్రవేశపెట్టడం కుదరక భూమికి తిరిగి వచ్చేశాయి. మానవ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఉపయోగపడే పరిశోధనల కోసం చాలా కుక్కల్ని ప్రయోగాత్మకంగా పంపించారు.
బెల్కా, స్ట్రెల్కా అనే రెండు ఆడకుక్కల్ని 1960, ఆగస్టు 19న పంపించారు. ఆ తర్వాత స్ట్రెల్కా ఆరు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. దానిలో ఒక దానిని అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీకి ఇచ్చారు. 1963 అక్టోబర్ 18న ఫ్రెంచ్ వారు ఫెలిక్స్ అనే పిల్లిని పంపించారు. ఆ తర్వాత అది భూమిపైకి క్షేమంగా తిరిగి వచ్చింది.
- 2030 నాటికి ఇస్రో ప్రణాళికలు..

సామాన్యులు సైతం అంతరిక్షంలోకి వెళ్లేందుకు వివిధ దేశాల్లో సన్నాహాలు చేస్తున్న క్రమంలో మనదేశంలోనూ అంతరిక్షంలో ప్రయాణించాలనుకునే వారికి మన ఇస్రో శుభవార్త తెలిపింది. 2030 నాటికి అంతరిక్ష ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని గతేడాది వెల్లడించింది. అయితే ఈ స్పేస్ టూర్ ఆర్బిటల్‌గానా లేదా సబ్ ఆర్బిటాల్‌గానా అనేది స్పష్టత లేదు. కానీ టికెట్ ధర మాత్రం రూ.6 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ప్రభుత్వం తరఫున అంతరిక్ష ప్రయాణం ఏర్పాటు చేసే దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. ప్రపంచ మార్కెట్‌లో ఉన్న ధరలతో పోలిస్తే అతి తక్కువగా ఉండేలా చూస్తున్నట్లు తెలిపారు. 'భారత్‌కు సంబంధించిన స్పేస్ టూరిజం మాడ్యూల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది సురక్షితమైనది. దీన్ని మళ్లీ వినియోగించవచ్చు. అంతరిక్షానికి వెళ్లిన ప్రజలు తమకు తాము వ్యోమగాములుగా పిలుచుకోవచ్చు' అని సోమనాథ్ అన్నారు. అయితే, ఈ యాత్ర ఎంత దూరం వరకూ ఉంటుందనే విషయం చెప్పలేదు. స్పేస్‌లో దాదాపు పావుగంటసేపు ఉండొచ్చు. కొద్ది నిమిషాల పాటు తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉన్న ప్రదేశంలో తిరగొచ్చు. పునర్వినియోగించే రాకెట్లను ప్రయాణానికి వాడనున్నట్లు సమాచారం.

- మొదటి ఆరింటిలో ఇస్రో..
మనదేశంలో అంతరిక్ష ప్రయోగాలకు నిలయమైనది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ఇస్రో. విద్య, వ్యవసాయ, కమ్యూనికేషన్, రక్షణ రంగ ప్రాజెక్టుల ద్వారా ఇస్రో దేశాభివృద్ధిలో అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది. 1969లో స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోని ఆరు అతిపెద్ద అంతరిక్ష సంస్థల్లో ఒకటిగా నిలిచింది.
- కీలక మైలురాళ్లు
- మనదేశం తయారుచేసిన తొలి సౌండింగ్ రాకెట్ ఆర్‌హెచ్-75 (రోహిణి-75). దీనిని 1967లో టిఇఆర్‌ఎల్‌ఎస్ నుండి ప్రారంభించారు. దీని బరువు కేవలం 32 కిలోలు. రోహిణి సౌండింగ్ రాకెట్ల శ్రేణిని ఇస్రో వాతావరణ అధ్యయనాల కోసం అభివృద్ధి చేసింది.
- ఇస్రో తన మొదటి ఉపగ్రహాన్ని 1975లో నిర్మించి, దానికి ఆర్యభట్ట అని పేరు పెట్టింది. దీనిని సోవియట్ యూనియన్ లాంచర్ ద్వారా ప్రయోగించారు.
- మనదేశం నిర్మించిన తొలి ప్రయోగ వాహనం ఎస్‌ఎల్‌వి-3. దీనిని 1980లో రోహిణి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఉపయోగించారు.
- స్రో తొలి ఇన్సాట్ ఉపగ్రహాన్ని 1982లో ప్రయోగించింది. ఇది కమ్యూనికేషన్ ఉపగ్రహం. కక్ష్యలో విఫలమైన దీనికి ఇన్సాట్-1ఏ అని పేరు పెట్టారు. తదుపరి కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్‌శాట్-1బి 1983లో ప్రయోగించారు.
- ఇస్రో 1988లో మొదటి ఐఆర్‌ఎస్ (రిమోట్ సెన్సింగ్ శాటిలైట్)ను కూడా ప్రయోగించింది.
- స్రో మూడు రకాల ప్రయోగ వాహనాలను (లేదా రాకెట్లు) అభివృద్ధి చేసింది. అవి పిఎస్‌ఎల్‌వి (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్), జిఎస్‌ఎల్‌వి (జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్), జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ -3.
- ఇస్రో 2008లో తన చంద్రుడికి సంబంధించిన మిషన్ చంద్రయాన్ -1ని మొదట ప్రయోగించింది.
- 2014లో మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంఓఎం) లేదా మంగళయాన్ ప్రయోగాన్నీ ఇస్రో నిర్వహించింది. ఈ ప్రయోగంతో మనదేశం తన తొలి ప్రయత్నంలో మార్స్ కక్ష్యలో ఉపగ్రహాన్ని ఉంచడంలో విజయం సాధించిన మొదటి దేశంగా, నాల్గో అంతరిక్ష సంస్థగా, తొలి అంతరిక్ష ఆసియా ఏజెన్సీగా అవతరించింది.
- 2017లో ఒకే రాకెట్‌లో 104 ఉపగ్రహాలను ప్రయోగించి, ఇస్రో మరో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇది ఇంకా దాని అత్యంత బరువైన రాకెట్, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్-మార్క్ -3, జి శాట్ 19ని కక్ష్యలో ఉంచింది.
- మనదేశం మానవసహిత ''మిషన్ టు స్పేస్‌ని గగన్‌యాన్'' అని కూడా పిలుస్తారు. ఈ ప్రాజెక్ట్ మనదేశాన్ని అంతరిక్షంలో తక్కువ ధర సేవలను అందించే గ్లోబల్ ప్రొవైడర్‌గా మార్చాలనే ప్రభుత్వ ఆశయంలో భాగం. ఈ మిషన్ కోసం ప్రయోగ వాహనం భారీ పేలోడ్‌లను అంతరిక్షంలోకి తీసికెళుతుంది. ఇందుకోసం క్రయోజెనిక్ ఇంజన్‌తో జీఎస్‌ఎల్‌వీ ఎంకె-3ని అభివృద్ధి చేస్తున్నారు. ఇస్రో ఇప్పటికే ప్రయోగాత్మక క్రూ మాడ్యూల్ (రీ-ఎంట్రీ అండ్ రికవరీ టెక్నాలజీ) మరియు క్రూ ఎస్కేప్ సిస్టమ్ (సిఇఎస్)తో సిఎస్‌ఎల్‌వి ఎంకె-3 ని పరీక్షించింది.
ఉదయ్ శంకర్ ఆకుల
7989726815