Dec 18,2022 12:55

పనికిరాని తుప్పగానో, పిచ్చిమొక్కగానో కనిపిస్తాయి కొన్ని మొక్కలు. పూలు కంటపడగానే తెచ్చి ఇంటి ముంగిట పెట్టుకోవాలనిపిస్తాయి. ఖాళీ లేకపోయినా కుండీల్లోనైనా పెంచుకోవాలనిపించేవి మరికొన్ని మొక్కలు. ఈ పరిస్థితి మన ప్రాంతాలకే పరిమితంకాలేదు. ఇతర రాష్ట్రాలలోనూ, విదేశాలలోనూ ఇలాంటి కొన్ని మొక్కలు పర్యావరణ ప్రియులను ఆకర్షిస్తూ దేశవిదేశాలను సందర్శించి, మనమూ వాటిని దర్శించుకునేలా చేస్త్తున్నాయి. అలాంటి కొన్ని మొక్కల గురించి తెలుసుకుందాం..!

ఫ్లోక్స్‌ ప్యానిక్యులేటా..

                                                                       ఫ్లోక్స్‌ ప్యానిక్యులేటా..

ఇది ఫ్లోక్స్‌ కుటుంబానికి, పోలెమోనియేసి జాతికి చెందినది. పూలు గులాబీ రంగులో ఉండి, ఐదు రేకలతో అందంగా ఉంటాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన మొక్క. సెమీషేడ్‌ వాతావరణంలోనూ, తేలికపాటి నేలల్లోనూ చక్కగా పెరుగుతాయి. పూరేకల మధ్య భాగంలో తెలుపు రంగు షేడ్‌తో మనోహరంగా ఉంటాయి. వీటిలో తెలుపు, చింతపిక్క రంగుల్లో పూసే రకాలూ ఉన్నాయి. కుండీల్లోనూ పెంచుకునే సౌలభ్యమున్న మొక్క.

 పెట్రియా వోలుబిలిస్‌..

                                                                   పెట్రియా వోలుబిలిస్‌..

ఇది వెర్బెనేసి కుటుంబానికి చెందినది. మొక్క 12 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని పువ్వులు నిండు, లేత పర్పుల్‌ కలర్‌లో పుష్పగుచ్ఛంలా పూస్తాయి. పూరేకలు ఒకే మొక్కలో కొన్ని పూలు పొడవు రేకలతోనూ, మరికొన్ని పూల చివర్లు రౌండ్‌గానూ ఉండి, అవన్నీ సూదితో గుచ్చినట్లు అందంగా ఉంటాయి. దీనికి క్వీన్స్‌ పుష్పగుచ్ఛము, ఇసుక అట్ట తీగ, నీల్మణి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది ఉష్ణమండల అమెరికాలో సతత హరిత పుష్పించే జాతికి చెందిన మొక్క. నదులు, ప్రవాహాల ఒడ్డున బాగా పెరుగుతుంది. కుండీలోనూ, నేల మీదా అన్ని వాతావరణాలలో పెరుగుతుంది.

  గజేనియా లీనియారిస్‌..

                                                                         గజేనియా లీనియారిస్‌..

ఆస్టరేసియా కుటుంబానికి చెందినది గజేనియా లీనియారిస్‌. ఇది సన్నని, పొడవైన ఆకులతో గడ్డి మొక్కలా ఉంటుంది. పది అంగుళాల పొడవు మాత్రమే పెరుగుతుంది. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి నెల వరకు పూలు పూస్తుంది. పొద్దుతిరుగుడు పువ్వులా కనిపిస్తుంది. విభిన్న రంగులతో పూసే రకాల మొక్కలు కూడా ఉన్నాయి. ఇది దక్షిణాఫ్రికాకు చెందినది.

డాలియా మెరిసీ..

                                                                             డాలియా మెరిసీ..

మెక్సికో ప్రాంతానికి చెందిన మొక్క ఇది. పువ్వులు లేత పింక్‌ రంగు మీద తెలుపు రంగు చారలతో ఉంటాయి. పువ్వుల మధ్యలో ఉబ్బెత్తుగా ఉండి, పసుపు రంగు పుప్పొడి అందంగా కనిపిస్తుంది. మొక్క అడుగు ఎత్తు పెరుగుతుంది.

 ఫిటోనియా హైబ్రిడా..

                                                                            ఫిటోనియా హైబ్రిడా..

ఇది సొలనేసియా కుటుంబానికి చెందినది. పువ్వులు గంట ఆకారంలో ఉండి, సున్నితంగా ఉంటాయి. తెలుపు, ముదురు పింకు, నీలం, ఎరుపు, వయోలేట్‌, ఎల్లో, మల్టీ కలర్స్‌ వంటి రకాల మొక్కలు ఇందులో ఉన్నాయి. మొక్క 6 నుంచి 8 అంగుళాల ఎత్తు పెరుగుతుంది. కుండీల్లోనూ పెంచుకునే సౌలభ్యమున్న మొక్క. ఎక్కువగా అలంకరణ కోసం పెంచుకుంటుంటారు.

   స్ట్రెప్టోకార్పస్‌ సాక్సోరమ్‌..

                                                                           స్ట్రెప్టోకార్పస్‌ సాక్సోరమ్‌..

స్ట్రెప్టోకార్పస్‌ జాతికి చెందిన పుష్పించే సతత హరిత మొక్క ఇది. పువ్వులు లేత నీలిరంగులో 20 అంగుళాలు ఎత్తు వరకు పెరిగే ఈ మొక్క సెమీషేడ్‌లో పెరుగుతుంది. ఫాల్స్‌ ఆఫ్రికన్‌ వైలెట్‌ అని దీనిని పిలుస్తారు. ఇది కెన్యా, టాంజానియాకు చెందిన మొక్క. మన దేశంలో శీతాకాలంలోనే పూస్తుంది.

- చిలుకూరి శ్రీనివాసరావు, 8985945506