చలికాలంలో సూప్ అనగానే.. ఎవరికైనా నోరూరుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం కూడా. సూప్స్ అంటే ఫైవ్‌స్టార్ హోటల్స్‌లోనో, బాగా ధనిక కుటుంబీకులు తీసుకునే ఆహారంగానో అపోహ ఉండేది ఒకప్పుడు. కానీ పాకశాస్త్రం ప్రారంభ కాలంలోనే కుండలలో అన్నిరకాల కూరగాయలు, దుంపకూరలు, మాంసం ఎక్కువ నీటిలో వాటి సారం దిగేవరకూ ఉడకబెట్టి ఆ రసాన్ని తాగేవారు. జర్మన్ లాంగ్వేజ్‌లో 'సుప్పా' అనే పదం అసలు సూప్‌కి మూల పదం అని, కాలక్రమేణా ఫ్రెంచ్ పదమైన 'సూప్' ప్రాముఖ్యతను సంతరించుకున్నట్టు పురావస్తు శాస్త్రవేత్తల ఉవాచ. ఆరోగ్యకరమైన ఆ సూప్‌లను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
మటన్‌తో..
కావలసినవి : మటన్ ఎముకలు - 1/2 కిలో, నీరు - 750 మి.లీ., ఉప్పు - 2 స్పూన్లు, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు- 10, పచ్చిమిర్చి - 3, ధనియాలు - స్పూను, యాలుకలు - 2, లవంగములు - 2, మిరియాలు - 1/2 స్పూను, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, బిర్యాని ఆకు, కొత్తిమీర కాడలు - 5, పసుపు - 1/2 స్పూను, ఉల్లిపాయ - ఒకటి
తయారీ : అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కచాపచాగా దంచి పక్కనుంచుకోవాలి.
ఒక గిన్నెలో మటన్ ఎముకలు, నీరు చేర్చి హై ఫ్లేం మీద ఉడికించాలి. పైకి తేలిన నురగను తీసివేసి, ధనియాలు, యాలకులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొత్తిమీర కాడలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కచాపచాగా దంచిన ముద్ద, పసుపు, ఉల్లి చీలికలు, లీటరు నీరు పో యాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్‌లో ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించి, ఆవిరి పోయిన తరువాత కుక్కర్ ఓపెన్‌చేసి మరో లీటరు నీరు చేర్చాలి. ఇప్పుడు దీన్ని నలభై నిమిషాల పాటు మీడియం ఫ్లేం మీద ఉడికించాలి.
బాండీలో నాలుగు స్పూన్ల నూనె వేడి చేయాలి. దీనిలో ఒక్కొక్క స్పూను చొప్పున అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగులు వేసి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత దానిలో స్పూను కారం, మూడు స్పూన్ల గోధుమపిండి వేయాలి. దీన్ని ముఫ్పై సెకన్లు వేయించి, దానిలో పైన తయారైన సూప్‌ను వడగట్టి ఉండలు లేకుండా కలుపుకుని, ఉడికించాలి. రెండు పొంగులు వచ్చిన తరువాత కొత్తిమీర తరుగు చల్లి, రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి సర్వ్ చేసుకోవడమే.
కారట్ -జింజర్..
కావలసినవి : కారట్ - 300 గ్రా, అల్లం - 1/2 అంగుళం, నూనె - స్పూను, వెల్లుల్లి రెబ్బలు - 5, బిర్యానీ ఆకు - ఒకటి, మిరియాలు - 1/2 స్పూను, నీరుల్లి - ఒకటి, నీరు - 1/2 లీ.
తయారీ : బాండీలో నూనె వేడిచేసి దానిలో బిర్యానీ ఆకు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం తరుగు, మిరియాలు ముప్పై సెకన్ల పాటు వేయించి, ఉల్లి తరుగు, కారట్ ముక్కలు యాడ్ చేసి ఐదు నిమిషాలు తిప్పుతూ ఉడికించాలి. స్టౌ మీడియం ఫ్లేంమీద ఉంచి, నీరు పోసి కారట్ ముక్కలు మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. చల్లారిన తరువాత ఆ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుని, 300 ఎమ్‌ఎల్ నీటిని కలిపి వడగట్టుకోగా సూప్ తయారవుతుంది. ఈ సూప్‌కు తగినంత ఉప్పును చేర్చి, స్టౌపై ఒక పొంగు వచ్చే వరకూ కాచి, పైన తేలిన నురగను తీసివేయాలి. అంతే కారట్, జింజర్ సూప్ రెడీ.
మిక్స్ వెజ్ - బాదం..
కావలసినవి : బాదం - 20, కారట్ - ఒకటి, పంచదార - స్పూను, ఫ్రెంచి బీన్స్ -4, స్వీట్‌కార్న్ - 2 స్పూన్లు, పచ్చి బఠాణీ - 2 స్పూన్లు, వెన్న - 2 స్పూన్లు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తురుములు - ఒక్కొక్క స్పూను చొప్పున, మిరియాల పొడి - స్పూను, నీరు - అరలీటరు, ఉప్పు - తగినంత
తయారీ : ముందుగా నానబెట్టి, పొట్టు వలిచిన బాదం పప్పులను మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకోవాలి. గిన్నెలో నీరు మరిగించి దానిలో పంచదార, కారెట్ ముక్కలు, అంగుళం సైజు ఫ్రెంచి బీన్స్, స్వీట్‌కార్న్, పచ్చి బఠాణీ వేసి మెత్తగా ఉడికించాలి. నీటి నుంచి ముక్కలను వేరుచేసి, వాటిని మాత్రమే బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
బాండీలో వెన్న వేడిచేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తురుములను పచ్చి వాసన పోయేవరకూ తిప్పుతూ వేయించాలి. గ్రైండ్ చేసిన వెజ్ మిశ్రమాన్ని యాడ్ చేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. దానిలో వెజ్ ముక్కలను ఉండికించిన నీటిని, ఉప్పు, మిరియాల పొడి కలిపి హై ఫ్లేం మీద ఉడికించాలి. పైన వచ్చిన నురగను తీసివేసి, ముందుగా గ్రైండ్ చేసి పక్కనుంచుకున్న బాదం పాలను ఉండలు కట్టకుండా తిప్పుతూ కలపాలి. స్టౌ మీడియం ఫ్లేం మీద ఉంచి, మిశ్రమాన్ని చిక్కబడేలా ఉడికించాలి. ఈ సూప్‌పైన కొత్తిమీర, బాదం పలుకులను చల్లి, సర్వ్ చేసుకోవడమే.