
ఆధునిక కవిత్వంలో అనేక ప్రక్రియలు నవ్య కవితా రూపం తీసుకుంటూ, హృదయ కవాటాలను సృజిస్తూ వుంటాయి. ఆ కోవలో హృదయాలను రంజింపజేసిన ప్రక్రియల్లో 'నానీ'లు ఒకటి. ప్రముఖ కవి, ఆచార్య ఎన్.గోపి గారి కవితామధువని ఈ నానీలు. వారు నిర్మించిన నానీలు, బహుళ ఆదరణ పొంది, ఇంతింతై వటుడింతై అన్నట్లుగా.. ప్రధాన కవితా స్రవంతిలో ఒకటిగా రూపాంతరం చెంది, శిఖరస్థాయికి ఎదిగింది. దీనికి ఎవరెన్ని కారణాలు చెప్పినా... ప్రధానంగా డాక్టర్ గోపి గారు నిర్మించిన అక్షర నియతి, నిర్మాణ వైచిత్రిని ముందుగా పేర్కొనాల్సి వుంటుంది. దానికి వస్తు వైవిధ్యము, పదాల పోహళింపు తోడైతే పూవుకు తావి తోడైనట్లే. ఇక ఆ కవితాధారలు జుంటితేనెల మధురిమలే.
అలాంటి వినూత్న వస్తు వైవిధ్యంతో సోమేపల్లి వెంకటసుబ్బయ్య నిర్మించిన నానీలు 'నాగలికి నా నమస్కారం'. ఇప్పటికే సోమేపల్లి వారు తొలకరి చినుకులు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నెల, చేను చెక్కిన శిల్పాలు... పేర్లతో నానీల సంపుటాలను ఆవిష్కరించారు. నానీల నిర్మాణంలో చెయ్యితిరిగిన సోమేపల్లి వారు ఈ 5వ సంపుటిలో కూడా అద్భుతమైన పద విన్యాసాలతో 47 పేజీల్లో అలవోకగా 105 నానీలను రసగుళికలుగా మలచి, పఠితులకు అందించారు.
ఈ నానీల్లో చాలా వరకు పల్లెజీవనం, పైరగాలి, రాలిన పూలు, తుమ్మెద పాటలతో ఆకాశానికి వెలుతురు మెట్లు నిర్మించారు. 'బిడ్డకు పాలిచ్చే/ చోటు చూపరు/ గడ్డను/ పాలిస్తామంటారు' అంటూ సున్నితమైన విమర్శను సంధించారు. అడవులు ఊళ్లుగా మారుతూ, ఊళ్లు పట్టణాలుగా మారుతూ... కాంక్రీట్ జంగిల్స్‌గా రూపాంతరం చెందుతున్న తరుణంలో 'స్వచ్ఛమైన/ గాలి కావాలా/ అచ్చమైన అడవే/ ఆక్సిజన్ బాటిల్' అంటూ మనిషి మనుగడకు, ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛమైన గాలి కావాలి, దానికి అడవులు వుండాలని స్పష్టం చేస్తారు ఈ నానీలో. అలాగే... 'పదిమంది ఒక ఇంట్లో/ అప్పుడు/ పది గూళ్లలో ఒక్కొక్కరు/ ఇప్పుడు...' అంటూ... ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై, పదిగదులున్న ఇంట్లోనూ బిక్కుబిక్కుమంటూ ఒకరిద్దరే వుంటున్న ఒక సంస్కృతి నేడు నెలకొంది. దేశాల మధ్య హద్దులు చెరిపేసిన ప్రపంచీకరణ.. ఉమ్మడి కుటుంబాలను విచ్ఛిన్నం చేసి, ప్రపంచ వ్యాపితం చేసింది. ఇలాంటిదే మరో నానీ.. 'గూగుల్/ అతని దగ్గరి చుట్టం/ బంధుగణమంతా/ దూరం దూరం'. అద్భుతాలను సృష్టిస్తోన్న సాంకేతికత.. ఎదురెదురుగా వున్నవాళ్లను కూడా కలపలేనంత దూరం నెట్టేస్తోంది. మన ఎదుటనే వున్నా ఒక్క మాట మాట్లాడరు. ఎక్కడో కనబడనివారితో గంటలు గంటలు మాట్లాడుతుంటారు. విచిత్రమైన ఈ పరిస్థితిని అలతి అలతి పదాలతో... లోతైన భావనతో అద్భుతంగా చెప్పారు కవి సోమేపల్లి.
చక్కని శీర్షికతో వెలువడిన ఈ నానీల సంపుటికి... ఇందులోని 'చెమట చుక్కకు/ చేతులు జోడించాలి/ మట్టి/ మరింత పరిమళం', 'పైరగాలి/ పరవశం/ తుమ్మెదల పాట/ కంకుల సయ్యాట', 'నల్లని నేలపై/ రంగుల చీర/ రాలిన పూలే/ కొత్త డిజైన్లు', 'చీకటిని/ చీదరించుకోకు/ శశి అందానికి/ ఆలంబన అదేగా', 'మర్రిచెట్టు ఊడలే/ మాకు స్ఫూర్తి/ ఊరు ఇప్పటికీ/ ఉమ్మడి కుటుంబమే'.. వంటి నానీలు శ్రమైక జీవన సౌందర్యాన్ని, మట్టివాసనను అద్దారు. 24 అక్షర సమూహంలో నిక్షిప్తంచేసి, పరిమళభరితం చేశారు. కవిత్వ పిపాసులకు ఈ నానీలు చక్కని ఆస్వాదనను కలిగిస్తాయని కచ్చితంగా చెప్పొచ్చు. మరొక్కమాట... గిరిధర్ కవర్ డిజైన్, పాణి ఇలస్ట్రేషన్లు ఈ పుస్తకానికి, ఇందులోని నానీలకు మరింత నిండుదనాన్ని తెచ్చాయి.
రాజాబాబు కంచర్ల
94900 99231
రచన : నాగలికి నా నమస్కారం
రచయిత : సోమేపల్లి వెంకట సుబ్బయ్య
వెల : 60
ప్రతులకు : సోమేపల్లి కవిత్వం
16-8-451,
విజయపురి కాలనీ,
జీరో లేన్,
జెకెసి కాలేజీ రోడ్డు,
గుంటూరు -522006