ఆ రోజు ఆదివారం. సులోచన భర్త తెచ్చిన కాయగూరల్లో వంటకు కావాల్సినవి తీసి 'సిరీ, సునీల్ రండి రండి' అంటూ పిల్లలను వంటగదిలోకి పిలిచింది. 'వీటిని శుభ్రంగా కడిగి తీసుకురా తల్లీ!' అని కూతురికి, ఆ తరువాత 'నువ్వు తరిగివ్వు నాన్నా!' అని కొడుక్కి పనులు పురమాయించి, మిగిలిన పనిలో పడింది సులోచన. సిరి కడిగి తెచ్చే లోపల సునీల్ చాకు, తరిగినవి వెయ్యడానికి గిన్నె రడీ చేసుకున్నాడు. 'సిరీ! కొట్టుకు వెళ్లి పచ్చిమిర్చి తీసుకురా' అని చెప్పింది. సునీల్ కాయగూరలు తరిగేలోగా సిరి పచ్చిమిర్చి తీసుకొచ్చింది. ఇదంతా గమనిస్తున్న సులోచన భర్త శంకరం 'వంటగదిలో పిల్లలకు ఏం పని? వాళ్లకి బోలెడు హోంవర్క్ ఉంటుంది! ఆపాటి పని నువ్వు చేసుకోలేవా? ఆదివారం వచ్చిందంటే చాలు, పిల్లలతో వంటపని, ఇంటిపని చేయిస్తుంటావు!' అని విసుక్కున్నాడు. 'అదేంటండీ అలా అంటారు? ఈ కాలంలో పిల్లలకు చదువెంత ముఖ్యమో పనీపాట్లు నేర్చుకోడం కూడా అంతే ముఖ్యం. రేపు చదువు, ఉద్యోగాల నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే హోటల్స్, జంక్ ఫుడ్స్ మీద ఆధారపడాలి. బయటి తిళ్లు ఏం ఆరోగ్యం చెప్పండి! అంతెందుకు నేను ఎక్కడికైనా వెళితే కాఫీ కాచుకోవడం రాక కాళ్లీడ్చుకుంటూ హోటల్‌కు పరుగెడతారు మీరు. నేను వచ్చే వరకు ఆ ఉడికీ ఉడకని హోటలు మెతుకులతోనే ఇబ్బంది పడతారు. వీళ్లకూ ఆ పరిస్థితి రావాలా ఏం?! స్విగ్గీ అనీ, జొమాటో అనీ ఎవరో తెచ్చే వాటి కోసం ఎదురుచూస్తూ వాళ్లు తెచ్చే చద్దివి తినడం మంచిదా?' అని ప్రశ్నించింది. అంతలో 'ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి..' అనే పాట వినిపిస్తుంది ఎక్కడినుండో. శంకరం అక్కడే ఉంటే ఇంకేం హితబోధ చేస్తుందోనని అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు.
పన్నెండేళ్ల తరువాత... ఆఫీసు నుండి బయటికి వస్తున్న శంకరం ఫోన్ మోగింది. కొడుకు సునీల్ చేశాడు. కుశల ప్రశ్నలైన తరువాత ఇంటికి వెళ్లిన తరువాత ఫోన్ చెయ్యమని, తల్లితో మాట్లాడతానని చెప్పాడు. శంకరానికి సిరితో కూడా మాట్లాడాలనిపించింది. ఇంటికెళ్లి భార్యని పిలిచి విషయం చెప్పి, పిల్లలిద్దరితో ఫోన్‌లో మాట్లాడారిద్దరూ. సులోచన ఆనందానికి హద్దుల్లేవు. సునీల్‌కి చెన్నరులో ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది. సిరికి పెళ్లయ్యింది, జాబ్ చేస్తుంది. అత్తగారింట్లో ఉద్యోగం చేస్తూనే అందరితో బాధ్యతగా వ్యవహరించి, తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. దానికి సులోచన పెంపకమే కారణం. శంకరానికి గతం గుర్తొచ్చింది. నేను పిల్లలకు పనులు చెప్పవద్దంటున్నప్పటికీ ఇంటా, బయటా పనులన్నీ వారే నిర్వహించేలా తర్ఫీదు ఇచ్చింది. అది ఇప్పుడు ఇద్దరికీ ఉపయోగపడింది. సునీల్ కూడా రూమ్ తీనుకుని తనే వంట చేసుకుంటున్నాడు. ఇద్దరూ హాయిగా ఉన్నారు. ఆలోచనలకు తెరవేస్తూ 'కాఫీ తీసుకోండి' అంది సులోచన సంతోషం తొణికిసలాడే మొహంతో సోఫాలో కూర్చుంటూ. శంకరం భార్య వైపు అభిమానంగా చూశాడు.
- బెలగాం భీమేశ్వరరావు
99895 37835