Mar 05,2023 08:19

మార్కులు రాలేదనో, ఆర్థిక ఇబ్బందులతోనో, తల్లిదండ్రులు పట్టించుకోవడంలేదనో చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యను పరిష్కారంగా ఎంచుకుంటున్నారు నేటి పిల్లలు. అసలు సమస్య పూర్తిగా అవగాహన చేసుకోకుండానే జీవితాలను అంతం చేసుకుంటున్నారు. 'సాధనమున పనులు సమకూరు ధరలోన' అన్న వేమన పద్యం రీతిలో.. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే విజయ తీరాలు సొంతమవుతాయనేది ఈ 'సాధన' కథల సారాంశం.
ప్రస్తుత సమాజంలో ఎదురవుతున్న సమస్యల్ని రచయిత డా.లక్ష్మీ రాఘవ కథా వస్తువులుగా ఎంచుకున్నారు. అనుబంధాలకు విలువనివ్వాలన్న సందేశాన్ని అంతర్లీనంగా చెబుతూ ప్రతి కథలోని పాత్రలను మలిచిన తీరు ఆకట్టుకుంది. ఈ పుస్తకంలో మొత్తం 27 కథలున్నాయి. ఏ ఒక్క కథా మరో కథతో పోలిక లేకుండా రాశారు. చిట్టచివరి కథ 'సాధన' పేరునే ఈ పుస్తకం శీర్షికగా పెట్టారు. మూస విధానాలకు స్వస్తి చెబుతూ ఆధునిక మార్పులను జోడిస్తూ సమస్యలను పరిష్కరించేలా కథల్ని తీర్చిదిద్దారు. రచయిత వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు కావడంతో సమాజంలో ప్రతి ఒక్కరూ ఉన్నత విలువలతో ఉండాలని, అభివృద్థికి వారధిగా నిలవాలని ఆకాంక్షించారు.
చిన్న విషయాలకే అర్థంలేని ఈగోలతో భార్యభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. ఎంతటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా భార్యాభర్తలు కూర్చుని చర్చించుకుంటే సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చని 'జీవితం' కథలో వివరించారు. ఈ కథలో విమలమ్మ పాత్రని మలిచిన తీరు బాగుంది. పెట్టుబడిదారీ విధానంతో చిన్న వ్యాపారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన విధానాన్ని 'దేవుడి న్యాయం' కథలో ఆచారి పాత్ర ద్వారా వివరించారు. కరోనా మహమ్మారి ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో పిల్లలకు భారం కాకూడదని ఆత్మహత్యకు సిద్ధపడిన తల్లిదండ్రుల బాధను 'సవరణ' కథలో వివరించారు. కానీ చివరకు మేము తోడుగా ఉన్నామంటూ కుమారుడికి భరోసా ఇవ్వడం, వారు ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకోవడం బాగుంది.
తలారీగా విధులు నిర్వహించినా ఓ ప్రాణాన్ని తీసేటపుడు వారు అనుభవించే వేదనను 'నిర్వచనం' కథలో వివరించారు. 'రాజారాణి' కథలో హాస్యాన్ని కూడా పండించారు. అవయవాలు మాట్లాడితే ఎలా ఉంటుందని 'కళ్ల కలవరం' కథలో చూపించారు. కళ్లకి బాధ కలిగితే అవి చూపును అందించలేక ఎంత ఇబ్బందిపడతాయో చెప్పిన తీరు ఆకట్టుకుంది.
ఇద్దరు ఆడపిల్లలని ఉన్నతంగా పెంచాలని తాపత్రయపడే తల్లి పార్వతి తన కుమార్తె నుండి వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితిని 'పొరపాటు' కథలో వివరించారు. అక్క మాలతో తనను పోల్చి తక్కువ చేస్తోందని, తనపై ప్రేమ లేదని చిన్న కూతురు లత భావించి, తల్లికి ఎదురుతిరగడంతో తన ప్రవర్తన కారణంగానే లత అలా మారిందని సైక్రియాటిస్ట్‌ సలహాతో పార్వతి తన తప్పు తెలుసుకోవడం కొసమెరుపు. చదువుకున్న వారు సైతం సంతానం కోసం స్వామీజీలకు దాసోహమవుతున్న తీరును 'నమ్మకం' కథలో వివరించారు.
పశువైనా ప్రాణంగా పెంచితే వదిలిపెట్టలేరని 'రామయ్య బంటు' కథలో వివరించారు. తాను పెంచుకున్న దున్నపోతు ముసలిది అయిందని కొడుకు బలిచ్చేందుకు సిద్ధపడినా.. వదలలేక దానితో పాటు తండ్రి కూడా చనిపోవడం మనసుని కదిలిస్తుంది. కులవృత్తిని వదులుకుని ఉపాధ్యాయుడిగా ఉన్నతస్థాయిలోకి వెళ్లిన ఓ తండ్రికి తిరిగి తన కొడుకు అదే వృత్తిని ఎంచుకోవడాన్ని 'హెడ్‌మాస్టర్‌ కొడుకు ' కథలో చూపించారు. అలాగే పెద్ద వయస్సు వచ్చిందని పట్టించుకోకుండా వదిలేయకూడదని 'వయసు' కథలో వివరించారు. పరోపకారమే జీవితంగా బతికే 'మస్తాన్‌'ను చిట్టచివరికి కొడుకులు ఆయన అవయవాలను అమ్ముకోవడంతో.. నలుగురి ప్రాణాలను కాపాడి, పరోపకారిగా నిలిచేలా రచయిత ఈ పాత్రను తీర్చిదిద్దారు. తల్లి గుర్తుగా దాచుకునేందుకు ఉంగరం కోసం ఓ కుమారుడు పడే ఆవేదనను 'ఉంగరం' కథలో వివరించారు.
ఇక 'సాధన' అట్టమీద కథ. తండ్రి చనిపోయిన తల్లి ఒంటరిగా తన కుమార్తె సాధనను ఉన్నతంగా పెంచాలని భావిస్తుంది. మొదటి ర్యాంకు వచ్చే కుమార్తెను ఆ స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ తన కుమార్తె కోసం స్కూలు నుండి వెళ్లగొట్టేందుకు యత్నిస్తాడు. సాధన బాధపడి ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తుంది. కానీ తల్లి ఆమెను ప్రభావితం చేయడంతో సాధన కలెక్టర్‌గా నిలుస్తుంది. అదే ఊరికి కలెక్టర్‌గా వెళ్లిన ఆమె తనను అణగదొక్కాలని చూసిన హెడ్‌మాస్టర్‌ దగ్గరకి వెళ్లి పరిచయం చేసుకుంటుంది. ఆయన పశ్చాత్తాపంతో కుమిలిపోయేలా చేసిన తీరు కొసమెరుపుగా నిలిచింది. ఇందులో కథలన్నింటినీ పాజిటివ్‌గా ముగించడం రచయితలోని పాజిటివ్‌ దృక్పథానికి నిదర్శనం. రచయిత ఆశించినట్లు సమాజంలో ప్రతివ్యక్తి ఉన్నతంగా నిలవాలని, బాంధవ్యాలకు విలువనివ్వాలని కోరుకుందాం.

ఫణిశ్రీ
88857 33554

 

రచన : సాధన
రచయిత : డాక్టర్‌ లక్ష్మీ రాఘవ
వెల : 150
ప్రతులకు : 3-99 అప్పగారి వీధి
కురుబాలకోట-517 350
చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఫోన్‌ : 94401 24700