Jan 11,2023 07:18

          అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డ, రైస్‌ మిల్‌ కార్మికుల ఉద్యమాలకు కేంద్రమైన భీమవరంలో జనవరి 2 నుంచి 4 వరకు సిఐటియు రాష్ట్ర 16వ మహాసభ దిగ్విజయంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి కాకలు తీరిన కార్మిక యోధులు కార్మిక సమస్యలపై, భవిష్యత్‌ ఉద్యమాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాశి లోనూ వాసిలోనూ సిఐటియు ఈ కాలంలో పెరిగింది. కోవిడ్‌ తరువాత జరిగిన మహాసభ ఇది. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల చరిత్రలో కోవిడ్‌ను అడ్డం పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై తీవ్రమైన దాడిని కొనసాగిస్తున్నాయి. కార్మిక చట్టాలను మార్చి లేబర్‌ కోడ్స్‌ తెచ్చాయి. ఈ సవాల్‌ను సిఐటియు నాయకత్వం తిప్పికొట్టింది. గత మూడేళ్ళల్లో 3 జాతీయ సమ్మెలు జరిగాయి. దేశంలో విద్యుత్‌ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. దేశంలో మోడీ నియోజకవర్గం వారణాసితో సహా జమ్ము, కాశ్మీర్‌, పంజాబ్‌, చండీగఢ్‌, పాండిచ్చేరి, మహారాష్ట్రలలో విద్యుత్‌ను ప్రైవేట్‌కు అప్పగించాలనే ప్రతి చోట కార్మికులు, ఇంజనీర్లు, కాంట్రాక్టు కార్మికులు కలసి సమ్మెలు చేసి ప్రైవేటీకరణను అడ్డుకున్నారు. కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో 5 సంవత్సరాల వేతన ఒప్పందం ఇటీవలే కుదిరింది. కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చెయ్యడానికి యాజమాన్యం అంగీకరించింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో సుమారు 2 సంవత్సరాల పోరాటాల ద్వారా ఒక్క శాతం వాటా కూడా ప్రైవేట్‌ పరం కాకుండా విశాఖ స్టీల్‌ను కాపాడుకుంటున్నారు. పోరాటాల వల్లనే ఇది సాధ్యమయ్యింది. జనవరి 2 సాయంత్రం జరిగిన భారీ ప్రదర్శన, బహిరంగ సభ కార్మిక వర్గాన్ని ఉత్తేజపరిచాయి.
           ప్రారంభ సభలో కా|| తపన్‌సేన్‌ జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను వివరించారు. రెండవ తేదీన ప్రతినిధుల సభ జరిగింది. రాష్ట్రంలోని 26 జిల్లాలతో పాటు రంపచోడవరం ప్రత్యేక జిల్లాతో సహా 27 జిల్లాలు, రంగాల ప్రతినిధులు స్పష్టంగా, సూటిగా మాట్లాడారు. రాష్ట్రంలో నలుమూలల నుంచి పాల్గొన్న ప్రతినిధులు తమ ప్రాంతాలు, రంగాల్లో నిరంతర సమరశీల పోరాటాలు సాగాయని చర్చల్లో స్పష్టం చేశారు. కార్మిక వర్గ పోరాటాల ఫలితంగానే కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రజలకు ఉచితంగా ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. ఢిల్లీ చుట్టూ రైతుల పోరాటానికి సిఐటియు సంఘీభావం ప్రకటించింది. కోవిడ్‌ను అడ్డుపెట్టుకొని 58 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను కార్మిక వర్గం తమ పోరాటాలతో తిప్పికొట్టింది.
              కేంద్ర ప్రభుత్వ, కార్మిక వ్యతిరేక మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా 2023 ఏప్రిల్‌ 5వ తేదీన ఢిల్లీలో జరగబోయే కార్మిక, కర్షక మహా ప్రదర్శనను జయప్రదం చెయ్యాలన్న తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 2023 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సమరభేరి మోగించాలని మహాసభ పిలుపునిచ్చింది. షెడ్యూల్డ్‌ పరిశ్రమల్లో కనీస వేతనాల సవరణ, అంగన్‌వాడీ, ఆశా తదితర స్కీం వర్కర్ల వేతనాల పెంపు, రిటైర్మెంట్‌ బెనిఫిట్లు, సంక్షేమ పథకాల అమలు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, పెన్షన్‌, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను పునరుద్ధ్దరించడం, బిల్డింగ్‌, ట్రాన్స్‌పోర్టు రంగాల సమస్యలను తక్షణం పరిష్కరించడం, అసంఘటిత రంగానికి సమగ్ర చట్టం లాంటి డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయి. నివాస ప్రాంతాల్లో పని ద్వారానే పరిశ్రమల్లోని కార్మికులను సంఘటితం చెయ్యడం సాధ్యమవుతుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో విస్తరించడం అత్యంత కీలక కర్తవ్యం. నివాస ప్రాంతాల పని ద్వారానే ఆర్‌.ఎస్‌.ఎస్‌ ను ఎదుర్కోవడం సాధ్యమని మహాసభ వక్కాణించింది. రాష్ట్రంలోని 679 మండలాల్లోనూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ 476 మండల కేంద్రాల్లోనే కమిటీలు ఏర్పాటు చెయ్యగలిగాం. వచ్చే మహాసభ నాటికి అన్ని కమిటీలు ఏర్పాటు చెయ్యాలని మహాసభ నిర్దేశించింది. రాష్ట్రంలో వివిధ పరిశ్రమల్లో మహిళలపై లైంగిక వేధింపులు పెరిగాయి. రాష్ట్రంలో మున్సిపల్‌ కార్మిక మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన అధికారులపై గుంటూరు, సాలూరులో ఫిర్యాదు చేసి సిఐటియు నాయకత్వం సస్పెండ్‌ చేయించింది. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రమాదాలు తీవ్రంగా పెరిగాయి. ప్రతి సందర్భంలోనూ సిఐటియు నాయకత్వం జోక్యం చేసుకొని ఎక్కువ నష్టపరిహారం ఇప్పించగలిగింది. విశాఖ ఎల్‌.జి పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. సిఐటియు పోరాట ఫలితంగా...బహుళజాతి సంస్థ ఎల్‌.జి డైరెక్టర్లు నెల రోజులకు పైగా విశాఖ సెంట్రల్‌ జైల్‌లో వున్నారు.
             పారిశ్రామిక ప్రాంతాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. వీటికనుగుణంగా మన పని విధానంలో నూతన ఒరవడి ఉండాలని తపన్‌సేన్‌ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కోవడం మన ఒక్కరి ద్వారానే సాధ్యం కాదు. ఇతర సంఘాలను కలుపుకునేందుకు ఐక్య కార్యాచరణకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. నివాస ప్రాంతాల్లో పని, పారిశ్రామిక ప్రాంతాల్లో విస్తరణతో పాటు...విశాల ఐక్య పోరాటాలు సాగించాలన్న బృహత్‌ కర్తవ్యంతో ప్రతినిధులు పయనమయ్యారు.

(వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
సిహెచ్‌. నరసింగరావు

సిహెచ్‌. నరసింగరావు