Nov 19,2022 07:34

సోషల్‌ మీడియా, ఇ-కామర్స్‌, ఇ-ఎడ్‌ తదితర ఇంటర్నెట్‌ ఆధారిత సంస్థల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు సాఫ్ట్‌వేర్‌ రంగంలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. వేలాది కొలువులు ఊడుతున్నాయి. పని గంటలు పెరిగిపోతున్నాయి. అదనపు పని గంటలు పని చేస్తారా? ఇంటికి వెళ్లిపోతారా? అంటూ టెక్‌ కంపెనీల అధినేతలు ఉద్యోగులకు హుంకుం జారీ చేసే స్థాయికి పరిస్థితులు దిగజారిపోయాయి. అందాల ఐటి కలలు ఛిద్రమై బతుకులు కన్నీటి తెరలుగా మిగిలిపోతున్నాయి. ఐటి అనుబంధ రంగాలు, విమానయానం, ఆతిథ్య రంగం, స్థిరాస్తి తదితర రంగాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితులను సాకుగా చేసుకొని టెక్‌ కంపెనీలన్నీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పాలకులు చేష్టలుడిగి వాటికే సాగిలపడుతుండటం దారుణం.
         కోవిడ్‌ మహా విపత్తు కంటే ముందు నుంచే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుస్త్తీ చేసిన సంగతి విదితమే. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చి ప్రజల కొనుగోలు శక్తి పెంచే ప్రణాళికలు రచించకుండా వేతనాలు తగ్గించడం, సిబ్బందిని కుదించుకోవడం వంటి 'పొదుపు చర్యల'కు పెట్టుబడిదారి వ్యవస్థ పరిమితం కావడంతో ఆర్థిక సంక్షోభం మరింతగా కోరలు చాచింది. కోవిడ్‌ తర్వాత పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైంది. విపత్తును ఎదుర్కొనే పేరిట ప్రభుత్వాలు ప్రకటించిన 'ఉద్దీపన' ప్యాకేజీల్లో కార్పొరేట్‌లకే అత్యధిక లబ్ధి చేకూరిన మాట వాస్తవం. కోట్లాది ప్రజల సంపదను అప్పనంగా కాజేసిన ఆ సంస్థలకు ప్రజల సంపద దోపిడిపై దాహం ఇప్పటికీ తీరడం లేదు. లాక్‌డౌన్‌ సమయంలో 'వర్క్‌ ఫ్రం హోం' వంటి శ్రమ దోపిడి ఎత్తుగడలు పన్నిన కంపెనీలు.. ఇప్పుడు పని గంటలు పెంచుతూ ఆ మేరకు సిబ్బందిని కుదించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ మొదలుపెట్టిన ఈ దురాగతాన్ని మెటా (ఫేస్‌బుక్‌, వాట్స్‌యాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ గ్రూపు సంస్థ), గూగుల్‌, అమెజాన్‌, స్విగ్గీ, ఇతర సంస్థలు కొనసాగిస్తున్నాయి. ఆన్‌లైన్‌ స్టార్టప్‌గా పెను సంచలనం సృష్టించిన బైజూస్‌ సంస్థ ఇప్పుడు మసకబారుతోంది. వేలాది మంది ఉన్నత ఉద్యోగులను ఇంటికి పంపేసింది. బైజూస్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, నోయిడా కేంద్రాలుగా నడుస్తున్న ఓలా, బ్లింక్‌ఇట్‌, అన్‌అకాడమీ, వైట్‌హ్యాట్‌ జూనియర్‌ సైబర్‌ టెక్‌, ఎడ్యూటెక్‌, గిగ్‌ సంస్థలూ ఈ ఒక్క ఏడాదిలోనే 16000 మందిని తొలగించాయి. అక్టోబరు నెలలోనే 5000 మంది ఉద్యోగులను సాగనంపారు. తాజాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ 60 శాతం మంది ఉద్యోగులను బలవంతపు వేతన రహిత సెలవులకు పంపుతోంది. అంటే ఉద్యోగం పోదు కాని జీతం ఇవ్వరు.
       అమెరికా, బ్రిటన్‌ వంటి పెట్టుబడిదారీ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభ సుడిగుండంలో చిక్కుకోవడంతో త్రైమాసిక ఫలితాల్లో వృద్ధి గ్రాఫులన్నీ తిరోగమనం పడుతుండటంతోనే ఐటి కంపెనీలు 'పొదుపు చర్యల'కు తెగిస్తున్నాయన్నది ఓ విశ్లేషణ. ఇది ప్రారంభం మాత్రమేనని అసలైన ముసళ్ల పండుగ ముందున్నదని హెచ్చరిస్తున్నారు. జారిపోతున్న ఆర్థిక వృద్ధి రేటు అంచనాలు ఆ హెచ్చరికలకు బలం చేకూరుస్తున్నాయి. సెప్టెంబరు త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 6.3 శాతానికి మించలేదని రిజర్వుబ్యాంకు పేర్కొంది. ఒకేసారి వేలాది మంది కొలువులు కోల్పోతే ఆ ప్రభావం మిగిలిన రంగాలకూ శరవేగంగా విస్తరిస్తుంది. నిరుద్యోగుల మార్కెట్‌ అమాంతం పెరిగిపోయి శ్రమదోపిడికి మార్గం సుగమం అవుతుంది. ఎక్కువ గంటలు పని చేస్తారా? నిష్క్రమిస్తారా? అంటూ టెస్లా, ట్విట్టర్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ చేసిన బరితెగింపు హెచ్చరికలే దీనికి నిదర్శనం. ఐటి రంగ కొలువుల పరిస్థితి అసంఘటిత రంగ కార్మికులను తలపిస్తుండటం దయనీయం. ఖర్చులు తగ్గించుకోవాలంటే వ్యాపార విస్తరణను తగ్గించుకోవచ్చు. కానీ ఉద్యోగులను ఉన్నఫలంగా ఇంటికి పంపేయడం కార్పొరేట్‌ కంపెనీల దారుణాలకు నిదర్శనం.
మెటా అధినేత జుకెర్‌ బర్గ్‌ వంటి గుత్తాధిపత్య దిగ్గజాలతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంటి పాలకులకు ఆ సంస్థ వేటుకు బలైపోతున్న సిబ్బందిని పట్టించుకునే తీరిక ఎక్కడిది? ఉపాధి భద్రతను నీరుగార్చి కార్మిక చట్టాలన్నిటినీ మూడే మూడు కోడ్‌లుగా కుదించిన పాలకుల కళ్లకు ఐటి కంపెనీల దారుణాలు కానరావు. ఈ ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ఉపాధి భద్రత కోసం ఐటి నిపుణులు పిడికిలి బిగించాల్సిన తరుణం ఇది.