
- ఫిబ్రవరి 17 సత్యాన్వేషణా దినోత్సవం
తమకు తెలియని కాలంలో మానవ సమాజం కొన్ని నమ్మకాలను, విశ్వాసాలను తయారు చేసుకుని ఉండవచ్చు. కాలక్రమంలో పరిశీలన వల్ల, ప్రయోగాల వల్ల ఆ నమ్మకాలు, విశ్వాసాలు తప్పని నిరూపించారు. రుజువైన సత్యాన్ని... విశ్వాసాలు, నమ్మకాల పేరుతో తిరస్కరించే శక్తులు అప్పుడు, ఇప్పుడు, భవిష్యత్తులోనూ ఉంటాయి. వాటిని ఎదుర్కొని సత్యాన్ని ముందుకు తీసుకుపోవాలి. 1600లో బ్రూనోని సజీవ దహనం చేసిన
ఇటలీ పాలకులు 1889లో తమ తప్పు తెలుసుకుని సత్యమే గెలుస్తుంది అని బ్రూనో స్థూపాన్ని నిర్మించారు.
సత్యం చెప్పడం అంత సులభం కాదు. ఉన్న విషయాన్నే చెబుతున్నాం కదా అనుకుంటాం. కానీ, ఆ సత్యం పాలకులకు నచ్చకపోతే, సత్యం పలికిన వారికి, సత్యం కోసం నిలబడిన వారికి కష్టాలు తప్పవు. అటువంటి ఉదంతాలు చరిత్రలో ఎన్నో నమోదయ్యాయి. ప్రాణం పోతున్నా సత్యం కోసం నిలబడి మృత్యువు ముఖంపై చిరునవ్వుతో సంతకం చేసిన వారెందరో ఉన్నారు. అటువంటి వారు చరిత్రలో చిరస్థాయిగా నిలబడ్డారు.
నిజం కోసం నిలబడ్డవారు...
నమ్మకాలు కాదు నిరూపణలు కావాలని, వాస్తవ విషయాలు ప్రచారం చేసి, నమ్మకాలను ప్రశ్నించినందుకు చార్వాకులను భౌతికంగా తుదముట్టించారు. ప్రాణాలు తీస్తున్నా...వారు సత్యం కోసం ప్రచారం చేయడం ఆపలేదు. ఈ సమస్త విశ్వం ప్రకృతి సూత్రాల మీదే ఆధారపడుతుందని వారు నిరూపించారు. రాక్షసులని ప్రచారం చేసినా ఎక్కడా రాజీ పడలేదు, భయపడలేదు. అందుకే చార్వాకులు భారతదేశ మొదటి భౌతికవాదులుగా చిరస్థాయిగా నిలిచిపోయారు. వారు చెప్పిన సత్యం నేటికీ వాస్తవంగానే ఉంది. ఎవరికో ఇచ్చ కలగటం...మానవుడు, భూమి, సమస్త ప్రపంచం ఏర్పడిందని, ఇప్పుడున్న ఈ రూపం లోనే మనిషి ఉద్భవించాడని, తన కష్టాలకు, సుఖాలకు, జ్ఞానం, చైతన్యం అంతా తన చేతుల్లో ఏమీ లేదని చెప్పే నమ్మకాలకు భిన్నంగా పరిసరానుగుణ్యతను, పరిణామవాదాన్ని డార్విన్ నిరూపణలతో సహా నిరూపించారు. పరిసరాలకు అనుగుణంగా తన శరీర నిర్మాణాన్ని, ఆహారపు అలవాట్లను, జీవన విధానాన్ని మార్చుకోగలిగిన జీవులు అభివృద్ధి చెందుతూ వస్తాయని, నిటారుగా నిలబడటానికి మనిషి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడని శాస్త్రీయంగా నిరూపించినా ఆ రోజు నమ్మకాల పేరుతో అంగీకరించలేదు. కానీ ఇదే సత్యమని నిరూపితమైంది. ఈ మాట చెప్పినందుకు డార్విన్‌ని హింసించారు. జైలు పాలు చేశారు. కోర్టుల చుట్టూ తిప్పారు. అవహేళనకు గురిచేశారు. అయినా డార్విన్ సత్యం కోసం నిలబడ్డాడు.
సత్యాన్వేషణ కోసం ఎన్ని కష్టాలో..!
సత్యాన్వేషణకు హేతువు, తర్కం ప్రధాన సూత్రాలని-నమ్మకం కాదని కోపర్నికస్, బ్రూనేలు ఎలుగెత్తి చాటారు. భూమి కేంద్రంగా సమస్త విశ్వం తిరుగుతుందని చెప్పే నమ్మకం తప్పని, సూర్యకేంద్ర సిద్ధాంతం వాస్తవమని, సూర్యుడు నక్షత్రం మాత్రమేనని, దీని చుట్టూ విశ్వం తిరుగుతుందని చెప్పినందుకు కోపర్నికస్ మత పెద్దల నుండి అనేక ఆంక్షలు ఎదుర్కొన్నాడు. సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నందుకు బ్రూనే కు మతపెద్దలే 8 సంవత్సరాలపాటు అత్యంత దారుణ పద్ధతిలో కఠిన కారాగార శిక్ష విధించారు. అప్పటికీ ఆయనలో మార్పు రాకపోవడంతో ఇటలీ వీధుల్లో సజీవ దహనం చేశారు. 1600 సంవత్సరం ఫిబ్రవరి 17 ఇటలీ వీధుల్లో ప్రజలందరి సమక్షంలో అత్యంత కిరాతకంగా బ్రూనేని సజీవ దహనం చేయటానికి ఒక క్షణం ముందు... ఇప్పటికైనా భూకేంద్ర సిద్ధాంతమే వాస్తవం అని చెప్పి నీ ప్రాణాల్ని దక్కించుకోమని చెప్పిన పాలకులకు... ''నన్ను భౌతికంగా దహనం చేసినా నిజం ఎప్పటికైనా నిజంగానే నిరూపితం అవుతుంది'' అని బదులిచ్చాడు. బ్రూనో మరణం జ్ఞాన సమపార్జనకు, సత్యాన్వేషణకు, హేతుబద్ధ ఆలోచనలకు గొప్ప పునాదిని వేసింది. ఆధునిక భౌతిక శాస్త్రం, సమాజం వేగంగా అభివృద్ధి చెందటానికి బాటలు వేసింది.
ప్రపంచ ఖగోళ వింతల్ని చూడటం కోసం తన జీవితాంతం కృషి చేసి, గెలీలియో టెలిస్కోప్‌ని కనుగొన్నాడు. సూర్యుడు చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతాయని చెప్పినందుకు పాలకవర్గం ఆయనకు యావజ్జీవ శిక్ష వేసింది. యావజ్జీవ శిక్ష కాలంలోనే గుడ్డివాడయ్యాడు. కారాగారంలోనే చనిపోయాడు. శాస్త్రీయ వాస్తవాలను తెలియజేసి, ఈ ప్రపంచమంతా వెలుగులు నింపాలని ప్రయత్నించిన ఒక మహా మనిషిని మూర్ఖత్వం బలిగొన్నది.
మనిషి ఈ రూపంలో రావటానికి, నిటారుగా నిలబడడం కోసం శ్రమ కీలమని చెప్పిన సామాజిక తత్వవేత్తలు కారల్ మార్క్స్, ఏంగెల్స్. వీరిని నాటి నుండి నేటి వరకు కొందరు తూలనాడుతూనే ఉన్నారు. వ్యంగ్య విమర్శలు చేస్తూనే ఉన్నారు. వారు చెప్పింది నిజమని నిరూపితమైన తర్వాత కూడా అంగీకరించడానికి నిరాకరించేవారు ఉన్నారు.
విప్లవ వీరులది సత్యం బాటే...
చేగువేరా, ఫైడల్ కాస్ట్రో, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో తాము నమ్మిన సిద్ధాంతం కోసం, సత్యాన్ని ప్రచారం చేయటం కోసం తమ ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించారు. ''ఏ క్షణాన మరణం సంభవించినా, నేను దాన్ని ఆహ్వానిస్తాను. కానీ ఒక్క మాట. ఈ యుద్ధభేరి మరో చెవికి వినిపించాలి. నా చేతి లోని ఆయుధం మరో చేతిని అందుకోవాలి. సామాజిక బాధ్యత బరువు అనుకుంటే, ఉద్యమాలు మనకెందుకులే అనుకుంటే బానిసగా బతికేందుకు సిద్ధపడాలి. నా ఒక్కడి వల్లే దేశం మారిపోతుందా... అనుకునే ఏ ఒక్కడి వల్లా ఈ దేశానికి ఉపయోగం లేదు'' అంటాడు చేగువేరా. ''మనుషులను చంపగలరేమోగానీ, వారి ఆశయాలను మాత్రం చంపలేరు. సత్యం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు'' అని భగత్ సింగ్ చెప్పాడు.
నాడే కాదు... నేడు కూడా..
నాడే కాదు నేడు కూడా నిజాలు చెప్పిన వారిని, సత్యం కోసం నిలబడిన వారిని భౌతికంగా హతమార్చిన లేదా మానసికంగా హింసిస్తున్న సందర్భాలు ఉన్నాయి. నిజ జీవితానికి అత్యంత దగ్గరగా పాలకవర్గాల నిజస్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు పాటల ద్వారా, చిన్న చిన్న వీధి నాటకాల ద్వారా ప్రజా కళ కోసం జీవితాన్ని అంకితం చేసిన హష్మీని ఢిల్లీ నడివీధిలో అత్యంత కిరాతకంగా హత్య చేశారు. సమాజాభివృద్ధికి శాస్త్రీయ విజ్ఞానం అవసరమని, మూఢ నమ్మకాలు లేని సమాజాన్ని ఆవిష్కరించటానికి రాష్ట్రమంతా తిరిగి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా సైన్స్ విషయాలను, శాస్త్రీయ అంశాలను సమాజానికి అర్ధమయ్యేటట్లు ధబోల్కర్ బోధించారు. మూఢ నమ్మకాల వ్యతిరేక చట్టాన్ని తీసుకురావాలని ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆయన్ను మతోన్మాదులు అత్యంత కిరాతకంగా చంపేశారు. చరిత్ర అంటే ఊహగానాలు కాదని, పరిశోధనల ద్వారా నిరూపితమైన వాస్తవమైన చరిత్రేనని, వక్రీకరించిన చరిత్రలను కాదని వాస్తవ చరిత్రను చెప్పటానికి ప్రయత్నం చేసిన కల్బుర్గిని ఇంట్లోనే తుపాకి గుళ్లకు బలిచేశారు. దేశంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతల వల్ల సమాజం అభివృద్ధి చెందడం లేదని, ఈ అసమానతలను రూపుమాపటానికి నిరంతరం గోవింద్ పన్సారే కృషి చేశారు. అసమానతలను రూపుమాపటానికి చేసిన కృషిని జీర్ణించుకోలేని వారు అత్యంత కిరాతకంగా గోవింద్ పన్సారేని చంపేసారు. ఈ దేశం అందరిది అని, సమాజంలోని సంపద అందరి సమిష్టి కృషి వల్ల ఉత్పత్తి అవుతుందని, భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశమని గౌరీ లంకేష్ ప్రచారం చేశారు. వివిధ రకాల మతాలు, కులాలు, సంస్కృతులు ఉన్న భారత దేశంలో మతతత్వ ఆలోచనలను ప్రచారం చేయటాన్ని వ్యతిరేకించారు. ఇలా మతతత్వాన్ని వ్యతిరేకించడంతో గౌరీ లంకేష్‌ని చంపేశారు.
సత్యమే గెలుస్తుంది
తమకు తెలియని కాలంలో మానవ సమాజం కొన్ని నమ్మకాలను విశ్వాసాలను తయారు చేసుకుని ఉండవచ్చు. కాలక్రమంలో పరిశీలన వల్ల, ప్రయోగాల వల్ల ఆ నమ్మకాలు, విశ్వాసాలు తప్పని నిరూపించారు. రుజువైన సత్యాన్ని... విశ్వాసాలు, నమ్మకాల పేరుతో తిరస్కరించే శక్తులు అప్పుడు, ఇప్పుడు, భవిష్యత్తులోనూ ఉంటాయి. వాటిని ఎదుర్కొని సత్యాన్ని ముందుకు తీసుకుపోవాలి. 1600లో బ్రూనోని సజీవ దహనం చేసిన ఇటలీ పాలకులు 1889లో తమ తప్పు తెలుసుకుని సత్యమే గెలుస్తుంది అని బ్రూనో స్థూపాన్ని నిర్మించారు. డార్విన్ పరిణామవాదం వాస్తవమని కరోనా సందర్భంలో కూడా నిరూపితమైంది. ఇమ్యూనిటీని పెంచుకోగలిగిన జీవులే బతికాయి. సైన్స్ ద్వారా తయారైన వ్యాక్సినే మానవ సమాజాన్ని రక్షించింది. అందుకే పాలకులు వారి పరిపాలన ఆధిక్యత కోసం సత్యం మాట్లాడిన వారిని, వాస్తవాలు చెప్పేవారిని ఇబ్బంది పెట్టినా అంతిమ విజయం సత్యందే. సైన్స్ ఫలాలను అనుభవిస్తూ సైన్స్‌ను కాకుండా మూఢ నమ్మకాలకు విలువ ఇచ్చేవారిని ఎలా అర్ధం చేసుకోవాలి? సత్యం కోసం ఏ కాలంలోనైనా కొద్దిమంది మాత్రమే నిలబడతారు. కాని అలా నిలబడ్డవారు తమ ఆచరణ ద్వారా మరికొద్దిమందిని నిలబడేటట్లు ప్రభావితం చేస్తారు. సత్యం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటారు. సత్యం నమ్మడం, నమ్మకపోవడంపై ఆధారపడి ఉండదు. ఏ కాలంలోనైనా పరిశోధనల ద్వారా నిరూపణకు నిలబడడం మీద ఆధారపడి ఉంటుంది. సత్యం ప్రశ్నించడాన్ని నేర్పుతుంది. చైతన్యపరుస్తుంది. చావో రేవో తేల్చుకునైనా సత్యం వైపే నిలబడమంటుంది. అందుకే పాలక వర్గాలకు సత్యం సరిపడదు. సత్యం గొంతుక నొక్కాలని చూస్తారు. సత్యాన్ని లోతుల్లోకి పూడ్చేశామని ఆనందపడతారు.
కాని సత్యం లోతులను సైతం పెకలించుకుని మొలకెత్తుతూనే వుంటుంది. సత్యం ఎప్పుడూ సత్యమే. సత్యమే జయిస్తుంది. సత్యం కోసం నిలబడితే, ఇంత చైతన్యం వస్తే, నిటారుగా నిలబడ్డ వారందరూ సత్యం కోసం నిలబడితే, సమాజ గమనం సమానత్వం వైపు దూసుకుపోతుంది.
(వ్యాసకర్త యుటియఫ్ రాష్ట్ర అధ్యక్షులు)
ఎన్. వెంకటేశ్వర్లు