Nov 07,2023 07:15

               ''రానున్న కాలంలో సోషలిజమా లేక క్రూరమైన అనాగరిక సమాజమా తేల్చుకోవాల్సిన పరిస్థితి మానవాళి ముందుకు వస్తుంది'' అని 150 సంవత్సరాల క్రితమే మార్క్స్‌ మహనీయుడు హెచ్చరించాడు. ఆ హెచ్చరిక నేటి ప్రపంచానికి, అందులో మన దేశానికి సరిగ్గా సరిపోతుంది. నేడు సాధారణ మనిషి తాను ఓ అల్లకల్లోల ప్రపంచంలో ఉన్నాననిపించడం సహజం. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే విరుద్ధ శక్తులను తన గర్భంలో ''ప్రపంచం పురిటి నొప్పులు పడుతున్నది.'' అన్న మార్క్స్‌ మాటలు ఈ రోజు పరిస్థితులకు సరిపోతాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఆరంభం అయిన తరువాత 1929-30 అతి పెద్ద ఆర్థిక సంక్షోభం (గ్రేట్‌ డిప్రెషన్‌) కన్నా ఉధృతమైన, సుదీర్ఘమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న కొద్దీ మన దేశంలో లాగానే అనేక దేశాలలో పచ్చి మితవాద ఫాసిస్టు తరహా ప్రభుత్వాలు ఏర్పడుతు న్నాయి. మానవాళి రూపొందించు కున్న ప్రగతిశీల, ప్రజాతంత్ర, లౌకిక విలువలన్నింటి మీద పైశాచిక దాడులు జరుగుతున్నాయి. మహిళల మీద అత్యాచారాలు, అల్ప జాతులు, కులాల మీద హింస పేట్రేగిపోతు న్నది. వెరసి క్రూరమైన మధ్య యుగాలకు మళ్ళించే ప్రక్రియను ఫాసిస్టు తరహా ప్రభుత్వాలు తీవ్రత రం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 20వ శతాబ్దం చివరి వరకూ కనపడ్డ ప్రపంచశాంతి అనే లక్ష్యం రష్యాలో కార్మికవర్గ ప్రభుత్వం పతనం కావడంతో క్రమంగా మసకబారి పోయింది. రెండవ ప్రపంచ యుద్ధంలో చావు దెబ్బలు తిని అమెరికా మిన హా మిగిలిన సామ్రాజ్యవాద దేశాలు చతికిలపడ్డాయి. ఇంగ్లాండ్‌ ప్రపంచ అధిపత్య స్థానాన్ని అమెరికా కైవసం చేసుకున్నది. ప్రపంచ యుద్ధం ముగిసిన మరుక్షణం నుండి సోవియట్‌ సోషలిస్ట్‌ రష్యాని బలహీన పరచడానికి అమెరికా పూనుకున్నది. ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రారంభించింది. 1990లలో రష్యా తదితర దేశాల్లో సోషలిస్టు వ్యవస్థలు కూలిపోయిన తర్వాత 30 సంవత్సరాల పాటు అమెరికా నాయకత్వాన సామ్రాజ్యవాద దేశాల ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. కానీ 2008లో అమెరికాలోనే ఆరంభమైన ఆర్థిక సంక్షోభం ప్రపంచం మొత్తాన్ని చుట్టుముట్టడంతో అమెరికాతో సహా సామ్రాజ్యవాద దేశాలు, మొత్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థే కోలుకోలేని ఇరుకున పడిపోయింది. పర్యవసానంగా యుద్ధాలు, ఘర్షణలు, మారణహోమాలు ప్రపంచమంతా నిత్యకృత్యమయ్యాయి. యుఎన్‌సిహెచ్‌ఆర్‌ 2023 జూన్‌ 30 నాటికి విడుదల చేసిన సమాచారం ప్రకారం 32 దేశాలు తీవ్రమైన యుద్ధాల్లో మునిగి ఉన్నాయి. 11 కోట్ల 72 లక్షల మంది తమ దేశాలను విడిచిపెట్టి అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో పెట్టుబడిదారీ ప్రపంచాన్ని కూడగట్టడానికి అమెరికన్‌ సామ్రాజ్యవాదం ''నూతన ప్రచ్ఛన్న యుద్ధానికి'' (న్యూ కోల్డ్‌ వార్‌-ఎన్‌సిడబ్ల్యు) తెరలేపింది. పచ్చి చైనా వ్యతిరేకత, పాశ్చాత్య దేశాలలో ఆసియా వ్యతిరేక జాతి ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం లక్ష్యంగా ఈ నూతన ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా. ఐక్యరాజ్యసమితి తో సహా అన్ని అంతర్జాతీయ వేదికల్ని అమెరికా నిర్వీర్యం చేస్తున్నది. అంతర్జాతీయ తీర్మానాలను మూర్ఖంగా ఉల్లంఘిస్తున్నది. కానీ మరోవైపు సామ్రాజ్య వాద దేశాలకు వ్యతిరేకంగా బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) వంటి వేదికలు పుట్టుకొ స్తున్నాయి. ఇప్పుడు నలభై దేశాలు ఇందులో తమకు సభ్యత్వం కావాలని దరఖాస్తులు పెట్టుకున్నాయి. యుద్ధం-శాంతి, పర్యావరణం, అసమానతలు లేని అభివృద్ధి శరణార్థుల వంటి అంశాలపై జరుగుతున్న చర్చలలో తీర్మానాలలో అంతర్జాతీయ వేదికల్లో అమెరికా ఒంటరిపాటు అవటం చూస్తున్నాం.
 

                                                                     చరిత్ర ఏం చెబుతోంది ?

పరిస్థితులు నిరంతరం మారుతూనే ఉంటాయి. కానీ చరిత్ర అనేక పాఠాలను నేటి తరాలకు నేర్పుతూనే ఉంటుంది. అందులో కొన్ని చారిత్రక ఘటనలూ, వాటి ప్రభావాలు, అవి నేర్పే గుణపాఠాలు చిరస్థాయిగా ఉంటా యి. అటువంటి ఓ మహత్తర చారిత్రక పాఠమే రష్యన్‌ కార్మికవర్గ మహా విప్లవం. 1917 నవంబర్‌ 7న జయప్రదమైన ఆ మహా విప్లవం మానవ సమాజ చరిత్రను దోపిడీ రహిత ప్రపంచం వైపు మళ్లించింది. నేడు రష్యాలో కార్మిక వర్గ రాజ్యం, సోషలిస్టు వ్యవస్థ లేనప్పటికీ ఆ విప్లవ ప్రకంపనలు ప్రపంచాన్ని కుదిపేస్తూనే ఉన్నాయి అనడం అతిశయోక్తి కాదు. యుద్ధ రహిత, శాంతియుత ప్రపంచాన్ని సృష్టించగల శక్తి ఆధునిక కార్మిక వర్గానికే ఉంటుందన్న చారిత్రక సత్యాన్ని ఆ కార్మిక వర్గ విప్లవం నిరూపించింది.
ఆ విప్లవం జయప్రదం అయింది భయానకమైన మొదటి ప్రపంచ యుద్ధం సాగుతున్న కాలంలో. రెండవ ఇంటర్నేషనల్‌ నాయకత్వం ఆ యుద్ధానికి కారణమైన తమ తమ దేశాల పాలకుల ముందు మోకరిల్లి యుద్ధాన్ని ఆపండని ప్రాధేయపడ్డారు. ఆ సందర్భంలో లెనిన్‌ ''పెట్టుబడి శక్తిని కూలదోయకుండా కార్మికవర్గం చేతిలోకి అధికారం మారకుండా శాంతిని సాధించలేం. సామ్రాజ్యవాద యుద్ధం నుంచి బయటపడలేం'' అన్నాడు. దీనికి ఆయన కారల్‌ మార్క్స్‌ బోధనలను ప్రామాణికంగా తీసుకున్నాడు. మార్క్స్‌ పెట్టుబడిదారీ వ్యవస్థను ఆసాంతం స్కాన్‌ చేసి మూడు ప్రధాన లక్షణాలను గుర్తించాడు. ఒకటి-ఆర్థిక సంక్షోభాలు, రెండు-అసమాన అభివృద్ధి, మూడు-పై రెండింటి పర్యవసానంగా నిరంతరం యుద్ధాలు. '....పెట్టుబడిదారీ రాజ్యాలు దాని సాంఘిక వ్యవస్థలోని నిత్యం పెరిగే ముడి సరుకుల అవసరం, మార్కెట్లు, చౌకగా దొరికే శ్రమశక్తి వంటి పరిణామాల పర్యవసానంగా నిరంతరం యుద్ధాలకు దిగుతాయి. యుద్ధాలను నివారించాలంటే వాటి ప్రధాన కారణాన్ని నిర్మూలించాలి. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానంలో సోషలిస్టు వ్యవస్థను నిలబెట్టాలి'' అని చెప్పాడు.
           ప్రపంచ శాంతి శాశ్వతంగా నిలబడాలంటే ప్రపంచంలో సోషలిజం ఒక బలమైన శక్తిగా నిర్మితం కావాలి. ఆ శక్తి ఆధునిక కార్మిక వర్గానికే ఉంటుందని మార్క్స్‌, ఏంగెల్స్‌లు పెట్టుబడిదారీ వ్యవస్థ ఊపందుకుంటున్న దశలోనే (19వ శతాబ్దం ఆరంభం నుండే) గ్రహించారు. 1864లో మొదట అంతర్జాతీయ కార్మిక సంస్థ (మొదటి ఇంటర్నేషనల్‌)ని ప్రారంభించారు. 1870ల నాటికి ఫ్రాన్స్‌, జర్మనీల మధ్య భీకరమైన యుద్ధం మొదలయ్యింది. ఇరు దేశాలలోనూ పెట్టుబడిదారీ పాలకులు జాతి ఉన్మాదాలను రెచ్చగొట్టి యుద్ధానికి తమ దేశ ప్రజల్లో మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తుంటే, ఇరు దేశాలలో కార్మిక వర్గం ఈ యుద్ధాల వలన శ్రామిక వర్గానికి కష్టాలే తప్ప లాభం ఉండదని, అందువలన ఇరు దేశాల కార్మికులనూ కార్మిక వర్గ అంతర్జాతీయతపై నిలబెడదామని, యుద్ధాన్ని వ్యతిరేకిద్దామని సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలను గొప్ప ఉదాహరణగా పేర్కొన్నారు. సకల దేశ కార్మికులారా ఏకం కండు...జయించడానికి ఓ ప్రపంచముంది'' అని ప్రపంచ కార్మికవర్గానికి పిలుపునిచ్చారు. యుద్ధం-శాంతి సమస్యకు శాశ్వత ముగింపుని వివరిస్తూ ''ఆర్థిక కష్టాలు, రాజకీయ చేతగానితనం సృష్టించే గత సమాజాలకు భిన్నంగా ఓ నూతన సమాజం మొగ్గ తొడుగుతున్నది. దాని అంతర్జాతీయ విధానం శాంతి. కారణం (ప్రతి దేశంలో) దాని జాతీయ పాలకులు ఒకరే. - వారే శ్రామికులు'' అని స్పష్టం చేశారు. కాగితంపై ఈ రాతల సిరా ఆరకముందే 1871లో పారిస్‌ కార్మికులు కార్మిక రాజ్య స్థాపన (పారిస్‌ కమ్యూన్‌) చేసి 72 రోజులపాటు పాలించారు. భరించలేని పెట్టుబడిదారీ వర్గం, తన ఆగర్భ శత్రువులైన ఫ్యూడల్‌ పాలకులతో కలిసి రక్తపుటేరుల్లో ముంచి సంబరాలు చేసుకున్నారు. కానీ వారి సంతోషం తెల్లారకుండానే రష్యాలో కార్మిక వర్గం విప్లవాలను ఆవిష్కరించింది. 1905 విప్లవాన్ని అణిచివేసినా మరల 12 సంవత్సరాలలోనే మహత్తర శ్రామిక విప్లవాన్ని జయప్రదం చేసి తొలి సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించింది రష్యన్‌ కార్మిక వర్గం. అధికారంలోకి రాగానే కార్మిక రాజ్యం ప్రపంచ యుద్ధం నుండి వైదొలుగుతూ ప్రకటన గావించింది. మొదటి ప్రపంచ యుద్ధాన్ని తొలి కార్మిక రాజ్యం అంతం చేసింది. 20 సంవత్సరాలు కూడా తిరగకుండా మరలా వచ్చిన రెండో ప్రపంచ యుద్ధంలో (1939-45) సగం కాలం సామ్రాజ్యవాదం తొలి సోషలిస్ట్‌ రాజ్యం సోవియట్‌ రష్యాను కూల్చడానికే వెచ్చించింది. వీరోచితమైన ఎర్రసైన్యం, అశేష ప్రజా బలంతో హిట్లర్‌ని మట్టి కరిపించింది. ఫాసిస్టు యుద్ధం నుండి ప్రపంచాన్ని విముక్తి చేసింది. ఆ విధంగా యుద్ధాలనే కాదు, ఫాసిజాన్ని కూడా ఓడించగలిగిన శక్తి కమ్యూనిజానికి, కార్మికవర్గ విప్లవాలకే వుంటుందని రష్యన్‌ కార్మికవర్గ మహావిప్లవం నిరూపించింది.
 

                                                                  సోషలిజం సాధనే లక్ష్యం కావాలి...

అందువలన రష్యన్‌ కార్మిక వర్గ మహా విప్లవ స్ఫూర్తితో కార్మిక వర్గాన్ని విప్లవోన్ముఖులను చేయడమే ప్రధాన కర్తవ్యంగా కృషి ద్విగుణీకృతం కావాలి. అమెరికా తో సహా అన్ని పారిశ్రామిక, అభివృద్ధి చెందిన దేశాలలో సైతం పెట్టుబడిదారీ వ్యవస్థ ఇంక ఫలితాలనివ్వ లేవన్నది జనానికి తేలిపోతున్నది. ప్రత్యామ్నాయం కోసం ముఖ్యంగా యువత వెతుకులాడుతున్న తరుణమిది. కార్మిక, ఉద్యోగ, శ్రామిక పోరాటాలు విస్తృతమవుతున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం చూపలేని స్థితికి మన దేశంలో లాగానే అనేక దేశాల్లో పాలకులు చేరుకున్నారు. రష్యాలో సోషలిస్టు వ్యవస్థ తొలి కార్మిక రాజ్యం కూలి ముప్పై సంవత్సరాలు గడిచిందో లేదో సోషలిజం తిరిగి ప్రపంచ ఎజెండాలోకి వచ్చేసింది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం, అవిద్య, ఆర్థిక అసమానతలు లేని, మనిషిని మనిషి దోపిడీ చేయని ఓ ఉన్నత ప్రగతిశీల మానవ సమాజం సోషలిజంలోనే సాధ్యమవుతుందన్న స్పృహ ప్రపంచానికి కలగడం మొదలైంది. ఈ స్థితిలో ఐక్య పోరాటాలు, విశాల ఉద్యమాలు పెంపొందించడమే మన కర్తవ్యం.
 

/ వ్యాసకర్త సిపియం కృష్ణా జిల్లా పూర్వ కార్యదర్శి,
సెల్‌: 9490098422 / ఆర్‌. రఘు

raghu