Oct 30,2022 08:35

భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలు, భాషలతో మమేకమైనది మన భారతదేశం. కాస్త పరిశీలనగా చూస్తే.. ఎవరికైనా భాషాపరమైన భౌగోళిక వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల ఆహారపు అలవాట్లు, పండుగలు, మనుషుల రంగులు, సంస్కృతులు, ఆచార వ్యవహారాల్లో బాహ్యంగా కనిపించే వ్యత్యాసాలు చాలానే ఉంటాయి. ఎన్ని వ్యత్యాసాలున్నా.. ఈ దేశంలోని జీవన విలువలు, ఈ నేల పట్ల గౌరవం, ఈ మట్టితో గల అనుబంధం.. 'నేను భారతీయుణ్ణి' అనే ఒక ఐక్యతా భావం.. పూలదండలో దారంలా గట్టిగా పెనవేసుకొని ఉంటుంది. 'సంఘీభవించి యెంతటి కార్యమయిన సాధింపవచ్చును. గడ్డిపరకలు సహితము వెంటిగా నేర్పడి మదపుటేనుగును బంధించుచున్నవి' అంటాడు చిన్నయసూరి. కుల మతాల కన్నా, జాతీయత కన్నా... దేశంలోని మనిషి మనిషినీ కలిపి వుంచే బంధం.. సామాజిక పురోభివృద్ధికి పునాదులు వేసే బలం.. ఐకమత్యం. సామాజిక జీవనం సజావుగా సాగేందుకు మానవత్వం ఒక్కటే సరిపోదు. దానికి ఐకమత్యం అనే చోదకశక్తి వుండాలి. ఎన్ని ఆధునిక హంగులు సమకూర్చుకున్నా, ఎన్నెన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా.. సమాజంలో ఐక్యత లేకపోతే.. ఆ సమాజం ముందుకు నడవదు. 'ఒరులేవియు ఒనరించిన, నరవర! మన మనంబునకు అప్రియమగు' అన్నట్లుగా.. ఎదుటివారు ఏం చేస్తే మనం నొచ్చుకుంటామో, ఆ పనులు మనం చేయకుండా ఉండడమే మనలోని ఐక్యతా గుణాన్ని సూచిస్తుంది. ఏ దేశానికైనా బలం.. ఆ దేశ ఐక్యతలోనే ఉంటుంది. ఏ దేశాభివృద్ధి అయినా.. అక్కడి ప్రజల ఐక్యతతోనే సాధ్యమవుతుంది. జాతీయ సమైక్యత గల బలమైన దేశం ఏర్పడటానికి సహాయపడుతుంది. అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. అందుకే, భారతీయుల్లో ఆ ఐక్యతా భావం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెబుతుంది.

01

 

భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. దేశ సమైక్యతకు సంస్కరణోద్యమాలు ఊపిరిలూదాయి. ఇక్కడి విస్తారమైన జనాభాలో అనేక మతాలు, విశ్వాసాలు పాదుకొని వుంటాయి. వందలాది మాండలికాలు, డజన్ల కొద్దీ భాషలు దేశవ్యాప్తంగా వాడుకలో ఉన్నాయి. వివిధ ప్రాంతాల ప్రజలు విభిన్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వివిధ నమ్మకాలతో కలగలిసిపోయే జీవనశైలి మనది. ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి మరొక రాష్ట్రానికి వెళ్లినప్పటికీ మన నాగరికత, సంస్కృతి.. మనలో పెనవేసుకుపోయిన భారతీయత అనే భావం.. సడలని ఐక్యతకు వారిధిగా నిలుస్తుంది. ప్రజల మధ్య చీలిక తెచ్చేందుకు బ్రిటిష్‌ పాలకులు అవలంభించని ఎత్తుగడ లేదు. కులం, మతం, ప్రాంతం, భాష పేరుతో అనైక్యతను సృష్టించేందుకు వారు ఎంతో ప్రయత్నించారు. అంతే చిత్తశుద్ధితో, పోరాటపటిమతో.. భారతీయులంతా ఒక్కటే అనే ఐక్యతాసూత్రంతో వారిని ఈ దేశం నుంచి పారద్రోలగలిగాం. అదే సమయంలో.. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో పురోగతి సాధించడానికి మనకు ఐక్యత అవసరం. ఒక దేశ పౌరుల మధ్య ఐక్యత లోపించడం వల్ల మరో దేశానికి బానిసగా మారాల్సి రావడం ప్రపంచ చరిత్రలో చాలాసార్లు జరిగింది. ఐక్యంగా ఉండటం ద్వారా.. ఒక చిన్న దేశం కూడా శక్తివంతంగా, స్వయం సమృద్ధిగా మారుతుంది. దానికి క్యూబా అతి పెద్ద ఉదాహరణ. జాతీయ ఐక్యత దేశ భావజాలంతో లోతైన సంబంధం కలిగి ఉంటుంది. ప్రజల మధ్య ఐక్యత లేని ఎంత పెద్ద దేశమైనా.. చిన్నాభిన్నమై బలహీనపడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఏకాకిగా మారుతుంది. దేశ మనుగడకు ఐక్యత చాలా అవసరం. ఒక దేశం వివిధ రంగాలలో పురోగతి సాధించాలంటే.. ఆ దేశ ప్రజల మధ్య ఐక్యత ఉండాలి.

22

                                                                         ఫెడరలిజానికి మార్గం..

ఉత్పత్తి విధానం అభివృద్ధి చెందే క్రమంలో అనేక తెగలు కలిసి ఒక జాతిగా రూపాంతరం చెందాయి. యూరప్‌ ఖండంలో ఒక్కొక్క జాతి ఒక్కొక్క దేశంగా ఏర్పడ్డాయి. కానీ, భారతదేశంలో స్వాతంత్య్రోద్యమ కాలంలో విశాలాంధ్రలో ప్రజారాజ్యం కావాలని, ఐక్య కేరళ, కన్నడ, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలలో సంయుక్త రాష్ట్రాల నినాదాలు జాతీయోద్యమంలో భాగమయ్యాయి. ఏకకాలంలో ''మనమంతా భారతీయులం'' అనే జాతీయ చైతన్యం ఒకవైపున, మరోవైపున జాతుల చైతన్యం కలిసి సంయుక్త పోరాటాలు చేశారు. ఈ పోరాటాల ఐక్యతా రూపమే ఫెడరలిజం. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ రాజ్యాంగం రూపొందించబడింది. ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే భాష పేరుతో కొన్ని జాతులపై, కొన్ని మతాలపై దాడి చేస్తున్నారు. భారతదేశంలో కాశ్మీర్‌ను విలీనం చేసి, దానికి రక్షణగా వున్న 370 ఆర్టికల్‌ను రద్దు చేశారు. మత ఘర్షణలు, మహిళలు, దళితులపై దాడులు పెద్దఎత్తున పెరిగాయి. నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, ఆహార కొరత రోజురోజుకూ పెరుగుతోంది. అదే సమయంలో అదాని, అంబానీల ఆస్తులు రెట్టింపు వేగంతో పెరిగిపోతున్నాయి. దీనివల్ల దేశంలో అసమతుల్యత ఏర్పడుతున్నది. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే.. దేశంలో ఇప్పటివరకూ వున్న మతసామర్యం, సుహృద్భావం, ఐక్యత దెబ్బతింటుంది. భారతదేశంలో కూడా ఒక్కొక్క జాతి ఒక్కొక్క దేశం కావాలనే డిమాండ్‌ ముందుకొచ్చే ప్రమాదకర భావన ప్రజలలో ఏర్పడుతుంది. 'భారతదేశము నా మాతభూమి/ భారతీయులందరు నా సహోదరులు, సోదరీమణులు/ నేను నా దేశమును ప్రేమించుచున్నాను/ సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము' అన్న భారత జాతీయ ప్రతిజ్ఞకు అర్థం మారిపోతుంది. ఈ 'జాతీయ ఐక్యతా దినోత్సవం' సందర్భంగా ఐక్య పోరాటాల ద్వారా రాజ్యాంగాన్ని, మనందరం భారతీయులమనే ఐక్యతా సూత్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వుంది.

33


                                                                  లౌకికతత్వం.. మన రాజ్యాంగం..

ఈ దేశంలోని ప్రతి వ్యక్తికీ మతపరమైన స్వేచ్ఛ వుంది. మతపరమైన విషయాలలో ప్రభుత్వాలు దూరంగా వుండాలనేది లౌకిక విధానం. ఇక్కడ ఏ మత సూత్రాలను, భావాలను ప్రచారం చేయడానికి గానీ, ప్రబోధించడానికి గానీ రాజ్యాంగం అంగీకరించదు. అంతేకాదు.. ఏ మతాన్నీ అధికార మతంగా గుర్తించదు. కానీ, దీనికి విరుద్ధంగా ఒక మతం వైపునకు ఒరిగిపోవడం, లౌకిక వ్యవస్థను భ్రష్టు పట్టించడం.. దేశ ఐక్యతకు, సమగ్రతకు విఘాతం కలిగించడం, మతం పేరుతో రావణ కాష్టం రగిలించడం వంటి మనం చూస్తున్నాం. ప్రజల్లో పెల్లుబుకుతున్న అసంతప్తిని మత రాజకీయాల వైపు మళ్లించగలిగారు. మతాన్ని రాజకీయ సాధనంగా వాడుకొంటున్న బిజెపి.. దేశంలో విద్వేషాలు, వైషమ్యాలు పెంచి పోషిస్తోంది. దేశ వ్యాప్తంగా మత ఘర్షణలకు కారణమౌతోంది. భిన్నత్వంలో ఏకత్వం, భిన్న సంస్కతుల నిలయం, లౌకికతత్వం అని గొప్పగా చెప్పుకునే దేశంలో కుల, మతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తూ.. దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేస్తోంది. 'దేశమంతా నెత్తురు వాసన/ ఆ మూల, ఈ మూల/ దేశం నలుమూలల/ ఏ మూల చూసిన/ రక్తపు మరకలే/ నెత్తురు వాసనే..' అంటాడో కవి. ఈ రక్త చారికల నుంచి, ఈ నెత్తుటి వాసన నుంచి, ఈ విధ్వంసాల నుంచి ఎంతో విశిష్టత కలిగిన భారతదేశ రాజ్యాంగాన్ని, లౌకిక స్ఫూర్తిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన వుంది. ఐక్యతతో విచ్ఛిన్నకారులు వేసే పాచికలలో పావులుగా మారకుండా, స్వాతంత్య ఉద్యమ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం వుంది. మన రాజ్యాంగంలోని మౌలిక లక్షణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుంది.

04


                                                                            ఎలా వచ్చింది..?

సర్దార్‌ వల్లభారు పటేల్‌ జయంతిని పురస్కరించుకుని దేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్‌, లేదా జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటారు. బ్రిటీష్‌ ఆధిపత్యం నుండి విడుదలైన 565 స్వయం పాలక సంస్థానాలలో దాదాపు ప్రతి ఒక్కటి భారత యూనియన్‌లో చేరడానికి ఒప్పించగలిగారు. కొత్తగా ఏర్పడిన స్వతంత్ర దేశం యొక్క జాతీయ సమైక్యత కోసం, నిబద్ధత కోసం, సర్దార్‌ పటేల్‌ నిర్వహించిన కృషికి గాను ''భారతదేశ ఉక్కు మనిషి'' అనే బిరుదును కూడా ఆయన పొందారు. ఇదే ఐక్యత, సమగ్రత దేశం నలుమూలల ప్రతిబింబించాలని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు. కానీ, హిందూ, ముస్లిం పేరుతో దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నుతూ, విద్వేష ప్రసంగాలు చేస్తూ.. దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు సంఘపరివార్‌ శతవిధాలా ప్రయత్నిస్తోంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఐక్యత కంటే కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ... దేశ విచ్ఛిన్నానికి కారణమౌతున్నాడు.

44


                                                                          ఇదేనా ఐక్యతంటే..?

సర్దార్‌ వల్లబారు పటేల్‌ 143వ జయంతి సందర్భంగా 2018లో పటేల్‌ భారీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్‌లోని కేవడియాలో జాతికి అంకితం చేశారు. 182 మీటర్ల ఎత్తుగల ఈ విగ్రహం ప్రపంచంలో అతి ఎత్తయిన విగ్రహంగా రికార్డు నెలకొల్పింది. అయితే విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో తెలుగు భాషకు చోటు దక్కలేదు. 'దేశ భాషలందు తెలుగు లెస్స' అన్నారు. కానీ, 'స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ' పేరుతో ఏర్పాటు చేసిన ఐక్యతా చిహ్నంలో తెలుగు పేరు మాత్రం లేదు. ఈ శిలా ఫలకంపై పది భాషలకు చోటు కల్పించిన కేంద్ర ప్రభుత్వం.. దక్షిణాది నుంచి కేవలం తమిళ భాషను మాత్రమే ముద్రించింది. అయితే తమిళంలో తప్పుగా రాశారని దాన్ని కూడా చెరిపేయడం గమనార్హం. దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉంది. అయినా కావాలనే తెలుగు భాషను పట్టించుకోని కేంద్రప్రభుత్వం.. ప్రపంచంలోనే ఎత్తయిన ఐక్యతా విగ్రహం అని గొప్పలు చెబుతోంది. దీన్ని ఐక్యత అంటారా? అని పలువురు మేధావులు, చరిత్రకారులు ప్రశ్నిస్తున్నారు. దేశ ఐక్యత కోరుకున్న వ్యక్తి యొక్క ''ఐక్యతా విగ్రహం'' నిర్మించి, మత ప్రాతిపదికన దేశంలో అనైక్యత సృష్టించటానికి పునాదులు వేశారు.

55

                                                                         సమైక్యతతోనే సురక్షితం..

సంఘపరివార్‌ శక్తులు సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి. ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నాయి. సామరస్యత, ఐక్యతతోనే ఈ శక్తులను ఎదుర్కోవాలి. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను రాజకీయంగానే కాకుండా సైద్ధాంతికంగా కూడా ఓడించాలి.

77

సమాజంలో వేళ్లూనుకున్న కుల, మత, పురుషాధిక్య అణచివేతలను ఓడించాలి. 'జాతీయ ఐక్యతా దినోత్సవం' యొక్క ప్రాముఖ్యతను కాపాడుకుంటూ, కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరూ ఏకమై, ఐక్యతతో ఒక్కతాటిపై నిలిచిననాడు దేశం సురక్షితంగా వుంటుంది. అంతిమంగా దేశ ఐక్యత, సమైక్యత, సమగ్రత కోసం భారతీయులందరూ ఐక్యంగా నిలవాలి. 'బానిసత్వపు చీకటిని రాత్రి కూడా భరించలేదు/ అందుకే స్వేచ్ఛా కిరాణాలు ఉషోదయం కోసం కాంతిరేఖ/ ఏదో కాలానికి కలం ఎదురెడుతుంది/ ఆధిపత్య చీకట్లే నినాదాలై నిద్రలేపుతాయి' అంటాడు మఖ్దూం మొహియుద్దీన్‌. ఉషోదయం కోసం స్వేచ్ఛకిరణాలు ప్రభవించినట్లుగానే.. ఐక్యత కోసం, అభ్యుదయం కోసం మరో స్వతంత్ర పోరాటానికి ఐక్యం కావాల్సిన అవసరం నేడెంతో వుంది. ఈ సమైక్యతను కాపాడుకోగలిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది.

6688

                                                                           వివిధ దేశాలలో...

ఐక్యతా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు సమయాల్లో, విభిన్న ప్రయోజనాల కోసం జరుపుకుంటూ వుంటారు. యునైటెడ్‌ స్టేట్స్‌లో ఇది అక్టోబరు 21న జరుపుకుంటారు. బెదిరింపు గురించిన అవగాహన కల్పించడానికిగాను 2011 నుండి దీనిని పాటిస్తున్నారు. జర్మనీలో అక్టోబరు 3వ తేదీన జరుపుకుంటారు. 1990లో జర్మన్‌ ఏకీకరణ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకుంటూ ఈ దినోత్సవం జరుపుకుంటారు. రష్యన్లు నవంబర్‌ 4వ తేదీన నిర్వహించుకుంటారు. 1612లో పోలిష్‌ ఆక్రమణ దళాల నుండి మాస్కోను విముక్తి చేసిన నేపథ్యంలో స్మారక దినంగా జరుపుకుంటారు.
ఎ యుఎస్‌లో ప్రజలు ఈ ఐక్యతా దినోత్సవానికి మద్దతు తెలిపేందుకు నారింజ రంగు చొక్కాలు లేదా టైలు ధరించడం, నారింజ రంగు బ్యానర్‌లు ధరించడం లేదా నారింజ రంగు రిబ్బన్‌లను ధరించడం ఆచారం. అదనంగా, బెదిరింపు సమస్య గురించి అవగాహన పెంచడానికి ఈ రోజున సాధారణంగా అనేక కార్యక్రమాలు జరుపుకుంటారు.

99

 

  • జర్మనీలో ఈ రోజును ''బర్గర్‌ఫెస్ట్‌'' అని పిలిచే పౌరుల పండుగ. అలాగే అనేక రాష్ట్ర ప్రాయోజిత కార్యకలాపాలతో జరుపుకుంటారు. ఈ కార్యకలాపాలలో కొన్ని అక్టోబర్‌ఫెస్ట్‌ బీర్‌ ఫెస్టివల్‌తో సమానంగా ఉంటాయి, ఇది అక్టోబర్‌ 3 వరకు కూడా జరుగుతుంది.
  • రష్యన్‌ ఫెడరేషన్‌లో ఈ రోజును వేర్వేరు వ్యక్తులు వివిధ మార్గాల్లో పాటిస్తారు. కొంతమందికి ఇది కేవలం పనికి సెలవు. ఇతరులకు ఇది అవర్‌ లేడీ ఆఫ్‌ కజన్‌ను గౌరవించే మతపరమైన విందు రోజు. ఇతరులకు ఇప్పటికీ, జాతీయ నాయకుల విజయాలను గుర్తించే రోజు.
  • ఈ ఐక్యతా దినాన్ని వేర్వేరు దేశాలు వేర్వేరు కారణాల కోసం జరుపుకున్నప్పటికీ, ఈ సంబంధం లేని సెలవులన్నింటినీ కలిపే ఏకీకత థీమ్‌ ఉంది. అదే.. ఐక్యత. యువత తమ తోటివారి విలువను గుర్తించడం కోసం, జాతి సమూహాలు మనందరినీ ఒకదానితో ఒకటి బంధించే బంధాలను గుర్తించడం కోసం, ఒక దేశం యొక్క ప్రజలు ఒక సమూహంగా కలిసి పనిచేయడం కోసం ఆపాదించబడిన ఐక్యత ఇది నిజం.

రాజాబాబు కంచర్ల

9490099231