Nov 02,2023 07:14

బీహార్‌ సర్వే అక్కడి ప్రభుత్వం కొన్ని పాలనాపరమైన చర్యలకు ఉపక్రమించేలా చేయడమే కాక జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. అధిక ఒబిసి జనాభా ఉన్న యు.పి, మహారాష్ట్ర, హర్యానాలో ఇలాంటి సర్వేల కోసం ఆందోళనలు రేగవచ్చు. వాస్తవానికి ఆ రాష్ట్రాల్లో అటువంటి సర్వేలు ఇబిసిల కదలికల్ని వేగవంతం చేసి ఆ రాష్ట్రాల శాసనసభల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచాలని పెట్టుబడిదారీ వ్యవస్థలో వారి వాటా కోసం డిమాండు ముందుకు రావచ్చు. ప్రస్తుతం నిద్రాణంగా ఉన్న సామాజిక న్యాయం డిమాండును ప్రతిపక్ష పార్టీలు ముందుకు తెచ్చి బిజెపి 'హిందూత్వ' పాలనకు సవాలు విసరొచ్చు.

           గత నాలుగు దశాబ్దాల సరళీకరణ విధానాలు కొత్త కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించాయి. పట్టణ మధ్య తరగతిని పెంచాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సాంకేతిక నిపుణులుగా అనేక మంది ప్రవాస భారతీయులు కొలువు తీరారు. అయితే ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని ఇవి కనపడనీయకుండా చేస్తున్నాయి. దేశంలోని పెద్ద జనాభా అత్యంత వెనుకబడ్డ కులాలకు (ఇబిసి) సంబంధించిన వారుగా ఉన్నారు. దేశ అభివృద్ధి ఫలాలు వీరికి అందటం లేదు. ఇబిసి లలో అత్యధికులు గ్రామాల్లో నివసిస్తున్నారు. చివరికి ఎన్నికల విధానాల అంచున నివసిస్తున్నారు. తక్కువ ఆదాయాల్లో నివసిస్తుంటారు. వర్గ అసమానతలు, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని అంచనా వేసేందుకు, జనాభా గణాంక వివరాల ప్రాతిపదికన వివిధ కులాలు, మతాల లెక్కలు అధ్యయనం చేయడానికి 1955లో కాకా వేల్కర్‌, 1980లో మండల్‌, 2006లో సచార్‌ కమిషన్‌లను ఆనాటి ప్రభుత్వాలు నిమమించాయి. వాటి అధ్యయనంపై ఆధారపడే చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో సామాజికంగా వెనుకబడ్డవారికి ఏ విధంగా రక్షణ కల్పించాలో తేలుతుంది.
           ఇటీవల బీహార్‌ ప్రభుత్వం విడుదల చేసిన కుల గణాంక నివేదిక (2023) జనాభాలో వెనుకబాటుకు గురైన ప్రజలు ఎవరు? దానికి కారణాలేంటి? బిసి లలో వెనుకబాటుకు కారణాలేంటి? వాటికి పాలనా పరంగా ఎటువంటి చర్యలు చేపట్టాలి వంటి వాటిని ఆ నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం ఒబిసి లు 27.12 శాతం ఉండగా, అత్యంత వెనకబడిన కులాలు (ఇబిసి లు) 36.01 శాతం. మొత్తంగా వెనకబడ్డ కులాలు బీహార్‌ జనాభాలో 63.13 శాతం. దళితులు, ఒబిసి, ఇబిసి లు తక్కువ ఆదాయాలొచ్చే వ్యవసాయ కార్మికులుగాను, పట్టణ కార్మికులుగాను బతుకులీడుస్తున్నారు.
          అంతకుముందు భూ యజమాన్యాల గురించి చేసిన అధ్యయనంలోనూ సామాజికంగా ధనిక కులాలైన బ్రాహ్మణులు, భూమిహార్‌, రాజ్‌పుత్‌లు బీహార్‌ లోని అతి పెద్ద భూ యజమానులుగా ఉండగా, సంఖ్యారీత్యా బలంగా వున్న ఒబిసి, ఇబిసి లు భూ యాజమాన్యంలోనూ, ఇతర ఆర్థిక సౌకర్యాలలోనూ చాలా బలహీనంగా ఉన్నారని తేలింది.
           బీహార్‌ సర్వే అక్కడి ప్రభుత్వం కొన్ని పాలనాపరమైన చర్యలకు ఉపక్రమించేలా చేయడమే కాక జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. అధిక ఒబిసి జనాభా ఉన్న యు.పి, మహారాష్ట్ర, హర్యానాలో ఇలాంటి సర్వేల కోసం ఆందోళనలు రేగవచ్చు. వాస్తవానికి ఆ రాష్ట్రాల్లో అటువంటి సర్వేలు ఇబిసిల కదలికల్ని వేగవంతం చేసి ఆ రాష్ట్రాల శాసనసభల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచాలని పెట్టుబడిదారీ వ్యవస్థలో వారి వాటా కోసం డిమాండు ముందుకు రావచ్చు. ప్రస్తుతం నిద్రాణంగా ఉన్న సామాజిక న్యాయం డిమాండును ప్రతిపక్ష పార్టీలు ముందుకు తెచ్చి బిజెపి 'హిందూత్వ' పాలనకు సవాలు విసరొచ్చు. ప్రస్తుతం సామాజిక న్యాయం పేరున జరుగుతున్న రాజకీయాలకు అట్టడుగునున్న ఇబిసి లు నిజమైన వారసులుగా ఉద్యమంతో ముందుకొస్తారు.
             సాంస్కృతిక ఎత్తుగడల ద్వారా, శక్తివంతమైన సోషల్‌ ఇంజనీరింగ్‌ చర్యల ద్వారా మితవాద బిజెపి గత రెండు దశాబ్దాల్లో ఇబిసి లను బాగా కదిలించగలిగింది. ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి రావడం వెనుక ఈ ఇబిసి లు వున్నారు. దాంతో బిజెపి అగ్రకులాల రాజకీయ పార్టీ అనే విమర్శను అది వదిలించుకుంది. వివిధ సాంస్కృతిక చర్యలు, సామాజిక ఆచారాలు, ఆయా కులాల్లోని అగ్ర నాయకులను ముందుకు నెట్టి సమగ్ర హిందూత్వ (ఇంక్లూజివ్‌ హిందూత్వ) ను అది సాధించగలిగింది.
            ముఖ్యంగా యాదవులు మిగిలిన వారి పదవులను కూడా దోచుకుని, రాజ్యాన్ని కైవసం చేసుకున్నారన్న బిజెపి విమర్శకు ఇబిసి లు బాగా ఆకర్షితులైనారు. కులాలకతీతంగా బిజెపి గ్రామీణ పేదలకు, పట్టణ కార్మిక వర్గానికి సాయపడిందనే వాదనకు ఆధారాలు లేవని వివిధ ఇబిసి లకు అదిచ్చిన హామీలు అమలుకు నోచుకోక పోవడాన్ని బట్టి చూడవచ్చు. ఇబిసి లు ఒక బలమైన సామాజిక, రాజకీయ శక్తిగా ఆవిర్భవించి సాంప్రదాయక సంస్థలను ప్రజాతంత్రీ కరిస్తుందనేది నిజం కాదని బిజెపి పాలన రుజువు చేసింది.
            ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యంత వెనుకబడ్డ కులాల సరైన ప్రాతినిధ్యం బిజెపి పాలనలో రాలేదు. ఒక విషయం మాత్రం స్పష్టం. ఇబిసి ల వంటి వెనకబడ్డ కులాలకు కొద్దిగా నైవేద్యం పెడుతున్న కీలకమైన సంస్థలన్నీ ఆధిపత్య కులాల చేతిలోనే ఉన్నాయి.
ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పైపైన సర్వే చేసినా మనకి కనపడే వాస్తవమేమంటే జ్యుడీషియరీ, దేశంలోని అత్యున్నత స్థాయి అధికార యంత్రాంగం, మీడియా, సాంస్కృతిక రంగాలన్నీ ఆధిపత్య కులాల చేతిలోనే ఉన్నాయి. పేదలు, అత్యంత బలహీన కులాలకు సంబంధించిన బాధలను పట్టించుకోవడంలో ప్రభుత్వ సంస్థలు వైఫల్యం చెందాయి.
         బీహార్‌ కులసర్వే నివేదిక మితవాద శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. దానికి ప్రధాన కారణం అత్యంత వెనుకబడ్డ కులాల్లో ఇది చైతన్యాన్ని రగిలిస్తుంది. రాజ్యం తమకు రక్షణగా నిలవాలని వారు డిమాండు తెచ్చేలా చేస్తోంది. ఇబిసి లకు సమాన ప్రాతినిధ్యం, వారి దారుణ వర్గ పరిస్థితులు, రాజకీయంగా నాయకత్వ స్థానాల్లో లేకపోవడం, వంటి వాటిని ప్రతిపక్ష పార్టీలు ముందుకు తేవడం ద్వారా బిజెపి ఇంతకాలం చెప్పుకుంటున్న 'సమ్మిళిత అభివృద్ధి' డొల్లతనం బయటపడుతుంది.
        నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ సంస్థలన్నీ పట్టణ ధనిక సామాజిక గ్రూపుల ఆధ్వర్యంలో ఉండటం వల్ల దళిత, బహుజన ప్రజలు అట్టడుగుకు నెట్టివేయబడ్డామనే భావనలో ఉన్నారు. బీహార్‌ సర్వే విడుదలతో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల అధికార నిర్మాణాల్లో తమకు మరింత సమానమైన వాటా దక్కాలనే డిమాండు ముందుకొస్తుంది. సామాజికంగా పైనుండే వారు అతి పెద్ద భూ యజమానులుగా ఉండటంతో పాటు సాంప్రదాయకంగా ఉండే ఫ్యూడల్‌ అధికారాలు, మధ్య తరగతి వారికుండే విశేషాధికారాలు తరతరాలుగా సంక్రమించిన శక్తివంతమైన సామాజిక సంబంధాలు వారికి ఉపయోగ పడుతున్నాయి. గతం నుండి ఉంటున్న పద్ధతిలోనే వీరు విధానాలను రూపొందించే అధికార వర్గాన్ని, సిఈఓలను, వ్యాపారవేత్తలను, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలను వేసేవారిని ఈ నయా ఉదారవాద విధానాలు సృష్టిస్తున్నాయి. అట్టడుగునున్న ఈ ప్రజా సమూహాలకు ఉపయోగపడే రీతిలో ఉదారవాద విధానాలు నిర్మించిన నిర్మాణాలను ప్రజాస్వామికీకరణ చేసే ప్రయత్నాలు చాలా తక్కువగా జరిగాయి.
          ఆందోళనకరమైన అంశం ఏమంటే సామాజిక న్యాయం కోసం పోరాడే శక్తులుగా చెప్పుకునే ఆర్‌జెడి యునైటెడ్‌ బీహార్‌లోనూ, సమాజ్‌వాది పార్టీ యు.పి లోనూ పగ్గాలు చేపట్టిన సందర్భాల్లో కూడా బాగా వెనుకబడ్డ ప్రజలకు విధానాల రూపకల్పనలో గాని, ఆర్థికాభివృద్ధిలో గాని, పెద్ద ఉపయోగం కలుగలేదు. సైద్ధాంతికమైన అంశాలపై తప్ప ఈ అట్టడుగు ప్రజలకు సంబంధించిన కీలకాంశాలను ఈ పార్టీలు పట్టించుకున్నది లేదు. నిరంతర ఆధిపత్యంలో ఉన్న సామాజిక వర్గాలను వ్యతిరేకించేందుకు ప్రజలను తయారు చేసుకున్నదీ లేదు.
          సాధారణంగా రాజకీయ చర్చలో ఇబిసి లను పేద, కష్టజీవులతో కలిపి ప్రభుత్వాలు అందించే సంక్షేమ ఫలాలు అందుకునే వారిగా భావిస్తున్నారు. ఇబిసి లు రాజ్యానికి, అంటే ఆధిపత్య కులాల దాతృత్వంపై ఆధారపడే వారిగా మిగలడం ప్రజాస్వామ్య నిర్మాణానికే నష్టం చేస్తుంది. ప్రస్తుతం బీహార్‌, యు.పి లలో ఇబిసి ల గొంతులు విడివిడిగా చిన్న కుల సంస్థలుగా చీలి ఉన్నాయి. అణగారిన కులాల సమస్యలు పరిష్కారం చేసే దిశలో అవి లేవు. ఈ దశలో సర్వే నివేదిక ఈ కులాలను స్వతంత్ర రాజకీయ వేదికలుగా మారేలా ఒత్తిడి చేస్తుంది. ఇది హిందూత్వ పునాదులను కదిలిస్తుంది. అంతేకాదు, ఇంతకాలం సామాజిక న్యాయం కోసం పోరాడేవారిగా ఫోజులు పెడ్తున్న వారి అసలు రూపాన్ని బహిర్గతం చేస్తుంది. ఇబిసి ల నిజమైన ఆవేదనను అర్థం చేసుకుని వారి సమస్యలకు న్యాయబద్ధమైన పరిష్కారం చూపేలా ఆ సామాజిక న్యాయం కోసం నిలబడ్డామని చెప్పుకునే వారిపై ఒత్తిడి చేస్తుంది. సామాజికంగా ఆధిపత్యంలో ఉన్న వారిపై ఒక ప్రజాస్వామ్యయుతమైన ఉప్పెనను లేవదీస్తుంది. ఆర్‌జెడి, ఎస్‌.పి, బిఎస్‌పి, డిఎంకె వంటి పార్టీలు తాము సామాజిక న్యాయం కోసం నిలబడ్డామని చెప్పుకుంటూ ఉంటాయి. అవి తమ విశ్వాసాన్ని మరోసారి పునరుద్ఘాటించి వారి మేనిఫెస్టోలో రాజకీయ కార్యకలాపాల్లో ఇబిసి లకు తగు స్థానాన్ని కల్పిస్తాయని ఆశిద్దాం. ఇబిసి ల కోసం నిలబడుతున్న శక్తులతో ఐక్య కార్యాచరణకు పైపార్టీలు తగు చొరవ చూపాలి.
        ప్రతిపక్ష పార్టీల వేదిక 'ఇండియా' ఈ విషయ ప్రాధాన్యతను వెంటనే అర్థం చేసుకుని జాతీయ స్థాయిలో తాము కుల సర్వే చేపడతామని ప్రకటించింది. 'ఇండియా' వేదిక...ఇబిసి నాయకులకు సరైన స్థానాలు కల్పించి కొత్త రాజకీయ నిర్ణయాల్లో వారికి సముచిత స్థానం కల్పిస్తే...ఆర్థిక సాధికారత, సామాజిక న్యాయం అందుకోగల్గుతారు. అటువంటి విశ్వాసపాత్రమైన చర్యలు హిందూత్వ రాజకీయాలను, పెట్టుబడిదారీ అనుకూల ఎజెండాను ధ్వంసం చేయగలుగుతాయి.

(వ్యాసకర్త అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ)
( 'ఫ్రంట్‌లైన్‌' సౌజన్యంతో)
హరీష్‌ ఎస్‌. వాంఖేడ్‌

image