Sep 24,2023 08:14

హితం అంటేనే స్నేహితం
హితం ఉంటేనే జీవితం
జీవి జీవుల జగతి సృష్టి
కలిసిమెలిసి ఉంచే
స్నేహామృత వృష్టి
హద్దులు ఎల్లలు చెరిపివేసి
సరిహద్దుగా తాను ఉంటుంది
ఉత్తర దక్షిణ ధృవాల ఉనికి వేరైనా
స్నేహంతో వియ్యమందుట లేదా?
జీవుల జీవితాలు వేరు వేరైనా
జీవన యానం ఒకటే గదా!
ప్రకృతి అంటే సగం సగం జంటంట
చీకటి వెలుగులు పగలు రేయిలు రోజంట
రెండింటి మధ్య దాగిన ఆ అనుబంధం
స్నేహ బంధం అని నేనంటా..
గ్రహాలు గతి తప్పకుండా చూసేది
పెనవేసుకున్న స్నేహ బంధమే !
పువ్వుల్లో దాగిన పరిమళం వలె
పరిచయంలోనైనా పరిణయంలోనైనా
ఏ సమూహంలోనైనా
దాగి ఉన్నది
స్నేహ సౌగంధ పరిమళ బంధమే!
చూడలేదా శ్రీకృష్ణ కుచేలుల చెలిమి
ఆస్తులు అంతస్తులు చూడనిది
యుగాలు గడిచినా ఇసుమంత తరగనిది
స్నేహమొక్కటే కలకాలం నిలుచునది
చెలిమి ఒక తరగని
మధురమైన తేనెలూరు చెలమ!

పి.బక్కారెడ్డి
97053 15250