రమేష్, అరుణ్ మంచి స్నేహితులు. తొండమనాడు గ్రామం హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నారు. అరుణ్ క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్ళి బాగా చదివే వాడు. రమేష్ పాఠశాల ఎగ్గొడుతూ సరిగా చదవకుండా అశ్రద్ధ చేసేవాడు. అరుణ్ చాలాసార్లు రమేష్‌కి చెప్పేవాడు పాఠశాలకు రమ్మని, బాగా చదవమని. అరుణ్ మాటలు పెడచెవిన పెట్టేవాడు రమేష్. అరుణ్ ఎంత ప్రయత్నించినా బూడిదలో పోసిన పన్నీరు అయ్యేది. రమేష్ తోటల్లో తిరుగుతూ, ఆటలు ఆడుతూ సమయాన్ని వృధా చేసేవాడు. పదవ తరగతి సాంవత్సరిక పరీక్షలకు ఇంకా మూడు నెలల వ్యవధే ఉంది.
రమేష్‌ని ఎలాగైనా మార్చాలని అనుకున్నాడు అరుణ్. 'రమేష్ ఇప్పుడు మనం చదివే సమయాన్ని వృధా చేస్తే మరలా తిరిగి రాదు. మన తల్లి దండ్రులు మనం గొప్పగా ఉండాలని ఎన్నో ఆశలతో చదివిస్తున్నారు. కనుక వారి ఆశలను మనం నెరవేర్చి మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఇకనైనా నాతో మా ఇంటికి రా! ఇద్దరం కలిసి చదువుకుందాం' అని చెప్పాడు అరుణ్.
ఆ మాటలకి కోపం తెచ్చుకుని 'నువ్వు చదవాలనుకుంటే చదువుకో. నాకు చదవమని నీతులు చెప్పకు. నిన్ను చదవమని నేను బలవంతం చేస్తున్నానా? నాకు ఎలా చదవాలో బాగా తెలుసు. నీ పని నువ్వు చూసుకో. ఇంకెప్పుడూ చదువు, చదువు అని చెప్పకు' విసురుగా అని వెళ్ళి పోయాడు రమేష్. అరుణ్ చేసేదేమీలేక పరీక్షలు సమీపిస్తుండటంతో చదువులో నిమగమయ్యాడు.
సాంవత్సరిక పరీక్షలు రానే వచ్చాయి. పరీక్షల్లో రమేష్ పక్కనే అరుణ్ పడ్డాడు. అరుణ్ పరీక్షలు బాగా రాస్తున్నాడు. రమేష్ చదవకపోవడం వలన దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. అది గమనించిన అరుణ్, రమేష్ పరీక్షలో తప్పకూడదని, తన దాంట్లో చూసిరాసుకోమని సైగలు చేసాడు. తనకేమీ అవసరం లేదంటూ తల తిప్పుకున్నాడు రమేష్. చేసేదేమీ లేకపోయింది అరుణ్‌కి.
ఫలితాలు రానే వచ్చాయి. పాఠశాల ప్రధమ స్థానంలో అరుణ్ ఉత్తీర్ణత సాధించాడు. రమేష్ అన్ని పరీక్షల్లో తప్పాడు. అరుణ్ వాళ్ళ నాన్న ఉద్యోగ రీత్యా బదిలీ కావడంతో తొండమనాడు నుండి నెల్లూరికి వెళ్ళిపోయారు. పదిహేను సంవత్సరాలు గడిచిపోయింది. పై చదువుల్లోపడి రమేష్‌ని కలవలేకపోయాడు అరుణ్. చదువు పూర్తయి ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నికయ్యాడు అరుణ్. మొదటి ఉద్యోగ నియామకం తన సొంత గ్రామం తొండమనాడు ప్రాధమిక పాఠశాలలో వచ్చింది. ఎంతో ఆనందంగా ఉద్యోగంలో చేరాడు. మొదట ఆ గ్రామ సర్పంచ్‌ని కలిసాడు.
అటుగా వెళ్తున్న ఓ ఐదేళ్ల పిల్లాడిని పిలిచాడు అరుణ్. 'బాబూ! నీ పేరేంటి? ఎవరి కొడుకువి' అని అడిగాడు.
'నా పేరు అరుణ్. నేను రమేష్ కొడుకుని' అని ఆ పిల్లవాడు చెప్పాడు.
'రమేష్ వాళ్ళ అబ్బాయివా? అరే నా పేరే పెట్టారే? మీ నాన్న ఎలా ఉన్నాడు' ఆశ్చర్యంతో అడిగాడు.
'మా నాన్న లేడుగా. నా చిన్నప్పుడే చనిపోయాడు' అమాయకమైన కళ్ళతో చెప్పాడు ఆ పిల్లవాడు.
ఒక్కసారిగా పాదాల క్రింద భూమి కంపించినట్టు అనిపించింది అరుణ్‌కి.
'ఏమయ్యింది రమేష్‌కి' వణుకుతున్న స్వరంతో అడిగాడు సర్పంచ్‌ని.
'పదవ తరగతి తప్పడంతో వాళ్ళ నాన్న రమేష్‌ని పనిలో పెట్టేసాడు. చెడు సావాసాలు, అతిగా మద్యం తాగేవాడు. వాళ్ళ నాన్న ఎన్నిసార్లు మందలించినా వినలేదు.
రమేష్‌కి ఇరవై ఏళ్ళు వచ్చాయి. పెళ్ళి చేస్తే అవన్నీ మానతాడని పెళ్లి చేసేసాడు. రమేష్ వాళ్ళ నాన్న ఆర్థికంగా చితికి పోయి అప్పుల బాధ ఒక పక్క, కొడుకు చెడిపోతున్నాడన్న బాధ మరొక పక్క. అనారోగ్యంతో మంచం పట్టాడు. రమేష్‌కి కొడుకు పుట్టాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక అతిగా తాగడంతో ఆరోగ్యం క్షీణించింది రమేష్‌కి. కడపులో పేగులు బాగా దెబ్బ తినడంతో ఇంక ఎంతో కాలం రమేష్ బతకడని డాక్టర్లు చెప్పేయడంతో పశ్చాత్తాప పడ్డాడు.. చదువుకునే వయసులో చదవనందుకు, నువ్వు చెప్పినా విననందుకు.
ప్రాయశ్చిత్తంగా తన కొడుకుకు నీ పేరే పెట్టుకున్నాడు. కొడుకుకి మూడేళ్ళ వయసులో అనారోగ్యంతో రమేష్ చనిపోయాడు. కొడుకు చనిపోయాడన్న దిగులుతో, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ నాన్న కన్ను మూసాడు. రమేష్ భార్య కూలిపని చేసుకుంటూ పుట్టెడు దు:ఖంతో కొడుకుని చదివించుకుంటోంది. ప్రతి క్షణం నిన్ను, నీ స్నేహాన్ని గుర్తు తెచ్చుకుంటూ రమేష్ కుమిలి పోయేవాడు. చివరి క్షణంలో నిన్ను చూడాలని, నిన్ను క్షమాపణలు అడగాలని ఆశ పడ్డాడు. నువ్వు పై చదువులో ఉన్నావని తన పరిస్థితి తెలిస్తే నీ చదువు పాడవుతుందని కలవాలనే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు' నిట్టూరుస్తూ చెప్పాడు సర్పంచ్.
రమేష్ కథ విన్న అరుణ్ కళ్ళు చెమర్చాయి. రమేష్ కొడుకుని దత్తత తీసుకుని ప్రయోజకుడిని చేయాలని దృఢ నిశ్చయంతో భారమైన హృదయంతో ముందుకు నడిచాడు అరుణ్.
కయ్యూరు బాలసుబ్రమణ్యం
9441791239