కాలం మారుతుంది. జిహ్వ కోరుతుంది. ఏం కావాలట.. అంటే.. స్నాక్స్.. అల్పాహారం.. చిరుతిండి అన్నీ ఒకటేగా. అవును. ఒకటే.. అయినా వీటి గురించి కొంచెం క్లుప్తంగా కథాకమామిషు. అసలు అల్పాహారం అంటే.. మనం మూడు పూటలూ తినే ఆహారానికి మధ్యలో స్వల్పంగా తీసుకునే పదార్థాలేవైనా అల్పాహారాలే. పూర్వం కొన్ని రకాల పప్పులు, చిరుధాన్యాలు వేయించి బెల్లంతో కలిపి తీసుకునేవారు ఎక్కువమంది. రానురాను టెక్నాలజీ పెరిగింది. రుచుల్లో ఆధునీకరణ జొప్పించి ఆహారం కూడా వ్యాపారం అయింది. దానిలో భాగంగా పేర్లుకూడా చిన్నవిగా, సన్నగా, నాజూగ్గా మారిపోయాయి. అలా వచ్చిందే స్నాక్స్. ఈ స్పీడ్ యుగంలో తిండికీ, చిరు తిండికీ కూడా బయటి దుకాణాలపైనే ఆధార పడుతున్నారు చాలామంది. కానీ వ్యాపార దృష్టితో చేసే వీటి వలన అనేక వ్యాధులు దరి చేరుతున్నాయి. అందుకే కాస్తంత ఓపిక, కూసంత సమయం కేటాయించి ఇంటి దగ్గరే చేసుకుని జిహ్వ చాపల్యాన్ని తీర్చుకుంటే రుచికి రుచి.. శుచికి శుచి. మరి వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం.
మటన్ కబాబ్..
కావలసినవి : మటన్ ఖీమా - 600 గ్రా., ఉప్పు - స్పూన్, కారం - స్పూన్, జీలకర్ర పొడి -స్పూన్, మ్యాంగో పౌడర్ -స్పూన్, మిరియాల పొడి -స్పూన్, గరం మసాలా - స్పూన్, ధనియాల పొడి - స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ -స్పూన్, బ్రౌన్ ఉల్లిపాయ చీలికలు - 2 స్పూన్లు, నూనె - వేయించడానికి తగినంత, కొత్తిమీర - స్పూను, పచ్చి మిర్చి తరుగు - 2 స్పూన్లు
తయారీ : పై పదార్ధాలన్నింటినీ బాగా కలపాలి. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వడలా చేసి రెండువైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించాలి. స్టౌ మీడియంలో పెట్టి, డీప్ ఫ్రై కాకుండా పేనంమీద వేయించుకుంటే నూనె వేస్ట్ అవకుండా ఉంటుంది. వీటిని టమాటా పచ్చడి, టమాటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి. మటన్ తినని వారు కూడా ఆస్వాదిస్తూ తినేస్తారు. వీటిని రోల్స్‌లా కూడా చేసుకోవచ్చు.
క్యాబేజీ పకోడీ..
కావలసినవి : క్యాబేజీ తురుము -300 గ్రా., సెనగ పిండి- 150 గ్రా., బియ్యం పిండి - 2 స్పూన్లు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి - 2, రెడ్ చిల్లీ పౌడర్- స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్- స్పూన్, జీలకర్ర - స్పూన్, గరం మసాలా - స్పూన్, ధనియాల పొడి - స్పూన్, ఉప్పు-రుచికి తగినంత, నీరు, కరివేపాకు-3 రెమ్మలు ,కొత్తిమీర- స్పూన్
తయారీ : క్యాబేజీ సన్నగా తురిమి, ఒక వెడల్పు పాత్రలోకి తీసుకోవాలి. దానిలో పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చి మిరపకాయల తరుగు, మిగిలిన పదార్థాలను వేసి నీరు లేకుండా బాగా కలపాలి. తర్వాత సెనగ పిండి, బియ్యం పిండి కూడా బాగా కలిసేలా కొద్దికొద్దిగా నీటిని చిలకరిస్తూ పిండిని ముద్దగా కలపాలి. బాండీలో నూనె వేడిచేసి పకోడీ వేయాలి. పకోడీ రంగు మారడం ప్రారంభించి గట్టిపడే వరకు మీడియం మంట మీద వేయించాలి. రంగు మారిన వెంటనే మంటను పెంచి మరో నిమిషం వేయించాలి. అంతే కరకరలాడే క్యాబేజీ పకోడీ రెడీ. చివర్లో, కరివేపాకును వేయించి, పకోడీలపై చల్లి సర్వ్ చేసుకోవడమే. పకోడీ అంటే ఆమడ దూరం పారిపోయే పిల్లలు, పెద్దలూ ఈ పకోడీని హాయిగా తింటారు. ఈ పకోడీ రెండు రోజుల వరకు తాజాగా ఉంటుంది.
సేమియా వెజ్ బుల్లెట్స్..
కావలసినవి : మందపాటి అటుకులు -కప్పు, ఉడికించిన బంగాళదుంపలు -2, సన్నగా తరిగిన పచ్చి మిర్చి - స్పూన్ , సన్నగా తరిగిన ఉల్లిపాయ -2 స్పూన్లు, మొక్కజొన్న విత్తనాలు -3 స్పూన్లు, క్యారెట్ తురుము - 3 టేబుల్ స్పూన్లు, క్యాప్సికమ్ తరుగు - 2 స్పూన్లు, చాట్ మసాలా -1/4 స్పూన్, మిరియాల పొడి -1/2 స్పూన్, ఉప్పు - రుచికి తగ్గట్టు, రెడ్ చిల్లీ పౌడర్ -1/2 స్పూన్, కొత్తిమీర -2 స్పూన్లు, నిమ్మరసం-స్పూన్, నూనె - వేయించడానికి సరిపోయినంత
పై పూత కోసం : మైదా-1/4 కప్పు, నీరు-1/3 కప్పు, శనగ పిండి -1/2 కప్, సన్నని సేమియా -150 గ్రా
తయారీ : అటుకులు 15 నిమిషాలు నీటిలో నానబెట్టి, వడకట్టాలి. తర్వాత వేళ్లతో ఎనిపి మెత్తగా చేయాలి. ఉడకబెట్టిన బంగాళాదుంప తురుము, అటుకులు కలపాలి. స్వీట్‌కార్న్, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కాప్సికమ్, కారెట్, కొత్తిమీర, జీలకర్ర పొడి, కారం, చాట్ మసాలా, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి గట్టిగా పిండినట్లు కలపాలి. అరచేతికి నూనె రాసుకొని కట్‌లెట్స్ చేసుకోవాలి. మరో గిన్నెలో మైదాలో కొంచెం ఉప్పు, నీరు పోసి పలుచగా తయారు చేసుకొని పక్కనుంచుకోవాలి. ఒక ప్లేట్‌లోకి శనగ పిండి, మరో ప్లేట్‌లో సేమియాను చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. అటుకుల మిశ్రమాన్ని కట్లెట్స్‌గా చేసి, ముందుగా మైదా మిశ్రమంలో ముంచి, శనగ పిండిలో ఆ తర్వాత సేమియాలో కొంచెం నొక్కినట్లు రోల్ చేయాలి. నూనె వేడిచేసి కట్లెట్స్‌ను రెండు నిమిషాలు కదిలించకుండా మీడియం మంట మీద వేయించాలి. కట్లెట్స్ కాస్త రంగు మారడం ప్రారంభమైనప్పుడు, మంటను పెంచి బాగా వేయించాలి. వర్షాకాలం ఈ కట్‌లెట్‌లను పుదీనా చట్నీ, టొమాటో సాస్‌తో వేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది. ఇవి గాలి చొరబడని బాక్స్‌ల్లో నిల్వ చేసుకుంటే కనీసం 15 రోజులు తాజాగా ఉంటాయి.