
ఎ.పి లోని నాలుగు స్మార్ట్ సిటీల కార్పొరేషన్లు సుమారు రూ.5670 కోట్ల విలువగల ప్రాజెక్టులు అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ నాలుగు స్మార్ట్ సిటీల పరిధిలో ఇప్పటి వరకు రూ.2798 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. చేసిన ఖర్చులో ఇంకా నాలుగు వందల కోట్లకు పైగా బిల్లులు పెండిరగ్‌లో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన నిధులు సకాలంలో ఇవ్వకపోవటం వల్ల అత్యధిక పనులు మూలన పడిపోయాయి. అంతేకాక స్మార్ట్ సిటీ కింద ఎన్ని వేల కోట్ల విలువగల ప్రాజెక్టులు చేపట్టినా కేంద్రం ఇచ్చేది కేవలం ఒక్కో స్మార్ట్ సిటీకి రూ. 500 కోట్లు మాత్రమే. అదీ ఏడాదికి రూ.100 కోట్లు చొప్పున ఇస్తుంది. మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం లేదా స్మార్ట్ సిటీలు భరించుకోవాలనేది షరతు. దీంతో చాలా ప్రాజెక్టులు ఆదిలోనే నిలిచిపోయాయి.
కేంద్ర బిజెపి సర్కార్ దేశంలో ఆర్భాటంగా ప్రారంభించిన స్మార్ట్ సిటీ మిషన్‌కు ఏడేళ్లు పూర్తయింది. దేశంలో ఎంపిక చేసిన 100 స్మార్ట్ సిటీల నిర్మాణం త్వరలో పూర్తి కాబోతున్నదని, మనం చేపట్టిన ఈ ప్రయత్నం దేశంలో పట్టణీకరణకు సరికొత్త కోణాన్ని ఇచ్చిందని, ప్రపంచమంతా మన దేశ స్మార్ట్ సిటీల గురించే మాట్లాడుకోవాల్సిన పరిస్థితిని సష్టించామని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మాట్లాడారు. 2015 జూన్‌లో స్మార్ట్ సిటీ మిషన్‌ను ప్రారంభిస్తూ ఈ పథకం ద్వారా దేశ పట్టణ వ్యవస్థలో అనేక నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని, పట్టణాలు, నగరాలు నవీకరించబడి సరికొత్త జవసత్వాలు సంతరించుకొని రూపాంతరం చెందుతాయని ప్రకటించారు. ఈ మాటలన్నీ వట్టి బూటకమని గడిచిన ఏడేళ్ళ ఆచరణ తెలియజేస్తున్నది. అసలు ఎజెండా వేరుగా ఉందనేది కూడా తెలుస్తున్నది. అంతే కాకుండా నేడు దేశంలో ఎంపిక చేసిన స్మార్ట్ సిటీలన్నీ నిధులు లేక విలవిలలాడుతున్నాయి. చేపట్టిన పనులకు బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నాయి. అర్ధాంతరంగా అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి. రెండోవైపు పట్టణ స్థానిక సంస్థల అధికారాలను, హక్కులను హరించి వేస్తూ ప్రజలపై భారాలు మోపబడుతున్నాయి.
ప్రాజెక్టుల అమలు తీరు - నిధుల కొరత
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్మార్ట్ సిటీల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అమరావతిలను, తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేశారు. వీటి ఐదేళ్ల కాల పరిమితి కూడా పూర్తయింది. కానీ అత్యధిక ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఎ.పి లో నాలుగు స్మార్ట్ సిటీల కార్పొరేషన్లు సుమారు రూ.5670 కోట్ల విలువగల ప్రాజెక్టులు అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ నాలుగు స్మార్ట్ సిటీల పరిధిలో ఇప్పటి వరకు రూ.2798 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. చేసిన ఖర్చులో ఇంకా నాలుగు వందల కోట్లకు పైగా బిల్లులు పెండిరగ్‌లో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన నిధులు సకాలంలో ఇవ్వకపోవటం వల్ల అత్యధిక పనులు మూలన పడిపోయాయి. అంతేకాక స్మార్ట్ సిటీ కింద ఎన్ని వేల కోట్ల విలువగల ప్రాజెక్టులు చేపట్టినా కేంద్రం ఇచ్చేది కేవలం ఒక్కో స్మార్ట్ సిటీకి రూ. 500 కోట్లు మాత్రమే. అదీ ఏడాదికి రూ.100 కోట్లు చొప్పున ఇస్తుంది. మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం లేదా స్మార్ట్ సిటీలు భరించుకోవాలనేది షరతు. దీంతో చాలా ప్రాజెక్టులు ఆదిలోనే నిలిచిపోయాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరంగల్, కరీంనగర్ సిటీల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రూ.2250 కోట్ల విలువగల ప్రాజెక్టులను చేపట్టాయి. 2020 జూన్ నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తికావాలి. ఈ రెండు నగరాలకు కలిపి కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల నిధులు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు రూ.196 కోట్ల చొప్పున నిధులు బదిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండిటికీ కలిపి రూ.210 కోట్లు ఇచ్చింది. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా కక్షగట్టి వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష దాడికి దిగింది. దీంతో రెండు నగరాల్లో స్మార్ట్ ప్రాజెక్టులు అగమ్యగోచరంలో పడ్డాయి. తెలంగాణ మీదే కాదు...బిజెపి నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తున్న అన్ని బిజెపి యేతర రాష్ట్ర ప్రభుత్వాలపై ఇదే వివక్షత చూపిస్తూ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నది.
మొత్తం 100 స్మార్ట్ సిటీల పురోభివృద్ధి చూస్తే ఈ పథకం అమలు తీరును అర్థం చేసుకోవచ్చు. ఇటీవల లోక్‌సభకి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి తెలియజేసిన వివరాల ప్రకారం వంద స్మార్ట్ సిటీల్లో రూ.2.05 లక్షల కోట్ల విలువగల 5151 ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. ఈ మొత్తం ప్రాజెక్టుల విలువలో కేంద్ర ప్రభుత్వం భరించేది రూ.48 వేల కోట్లు అంటే 23 శాతం మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వాలు వాటాగా రూ.43 వేల కోట్లు భరిస్తాయి. మిగిలింది స్థానిక సంస్థలు అప్పుల ద్వారా నిధులు సమకూర్చుకోవాలి. లేని యెడల ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పి.పి.పి) లేదా పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు ప్రాజెక్టులు ఇచ్చి తద్వారా పూర్తి చెయ్యాలని నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చింది రూ. 28413 కోట్లు. అనగా తన వాటాలో 59 శాతం నిధులు విడుదల చేసింది. మొత్తం ప్రాజెక్టుల విలువలో కేంద్రం విడుదల చేసిన నిధులు చూస్తే 13 శాతం మాత్రమే. ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టుల్లో పూర్తయినవి 27.37 శాతం మాత్రమే. నాలుగో వంతు ప్రాజెక్టులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. టెండర్లు పిలిచినవి, నిర్మాణంలో వున్నవి కూడా నిధుల కొరతతో నత్తనడకలో సాగుతున్నాయి. ఈ పథకంలో చేపట్టిన ప్రాజెక్టు లన్నీ 2023 జూన్ లోపు పూర్తికావాలి. ఎందుకంటే ఈ పథక కాలపరిమితి అప్పటితో ముగుస్తుంది. కనుక ఏడాది కాలంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి అవుతాయో ప్రశ్నార్థకంగా మారింది.
స్మార్ట్ సిటీలుగా ఎంపిక అయిన నగరాలన్నీ స్మార్ట్‌గా అభివృద్ధి అవుతాయనే భావన ప్రజల్లో కల్పించారు. కాని ఈ పథకం క్రింద చేపట్టే ప్రాజెక్టులు అన్ని నగర వ్యాప్తంగా చేపట్టరు. ప్రజల అవసరాలను, నగరాల మౌలిక సదుపాయాల కొరతను, మురికివాడల అభివృద్ధి, నగర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రూపొందించినవి కావు. కేంద్రప్రభుత్వం ఈ మిషన్‌లో పేర్కొన్న ప్రాజెక్టులను మత్రమే చేపట్టాలనే నిబంధన విధించారు. ఫలితంగా ఎక్కువ భాగం నిధుల్లో 17 శాతం పట్టణ రవాణాకి, ఐటీ కమాండ్ కంట్రోల్‌కి 11 శాతం, ఎనర్జీకి 10 శాతం, వ్యాపార వాణిజ్య అభివృద్ధికి 12 శాతం కేటాయించారు. ప్రజలకు ఉపయోగపడే సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి 2 శాతం, మురుగునీటి కాలువలకి 2 శాతం, మంచినీటి సరఫరా కు 5 శాతం, సామాజిక సదుపాయాలకు 2 శాతం మాత్రమే నిధులు కేటాయింపు జరిగింది. అంతేగాక స్మార్ట్ విద్యుత్ పోల్స్, స్మార్ట్ రోడ్లు, స్మార్ట్ ఫుట్‌పాత్‌లు, స్మార్ట్ వీధులు, స్మార్ట్ విద్యుత్, నీటి మీటర్లు, బ్యూటిఫికేషన్, స్మార్ట్ డిస్‌ప్లేలు, స్మార్ట్ సైకిళ్లు, బైకులు ఇలా అనేక పేర్లతో వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారు. చేపడుతున్న ఈ ప్రాజెక్టులు కూడా నగర వ్యాపితంగా అమలు చేయడం లేదు. కేవలం నగరంలో కొద్ది భాగాన్ని స్మార్ట్ సిటీ ప్రాంతంగా ఎంపిక చేసి 80 నుండి 90 శాతం నిధులు ఆ ప్రాంతంలోనే ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో బాగా అభివృద్ధి చెంది, మౌలిక సదుపాయాలు ఉన్నతంగా ఉండి, ధనిక వర్గ ప్రజలు నివసించే ప్రాంతాలను ఎంపిక చేశారు. మొత్తం 100 స్మార్ట్ సిటీల్లో 59 స్మార్ట్ సిటీలను పరిశీలిస్తే 80 శాతం పైబడి ప్రాజెక్టులు (లక్షా 5 వేల కోట్ల రూపాయలు) కేవలం 246 చ.కిమీ వైశాల్యం (మొత్తం వైశాల్యంలో 2.7 శాతం)లోగల ప్రాంతంలో ఖర్చు చేస్తున్నారు.
విశాఖపట్నంను పరిశీలిస్తే స్మార్ట్‌సిటీ ఎలా నిర్మాణం అవుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. మొత్తం జనాభా 20 లక్షలు. నగర విస్తీర్ణం 531 చ.కిమీ. మొత్తం రూ.1620 కోట్ల విలువగల ప్రాజెక్టులు స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టారు. కేవలం 0.6 శాతం వైశాల్యం గల ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేశారు. ఈ ప్రాంతంలో 60 వేల మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇది ఉన్నత మధ్యతరగతి నివాస ప్రాంతం. అన్ని మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 100 స్మార్ట్ సిటీ లోను ఇదే పరిస్ధితి.
లిమిటెడ్ కంపెనీలు - స్థానిక సంస్థలపై వేటు
స్మార్ట్ సిటీల్లో నిధులు లేదా ప్రాజెక్టుల నిర్వహణ, ఇతర కార్యకలాపాలన్నీ ప్రత్యేక సంస్ధ ద్వారా జరుగుతుంది. 2013 కంపెనీ చట్టం క్రింద స్మార్ట్‌సిటీ లిమిటెడ్ కంపెనీలుగా ప్రత్యేకంగా స్మార్ట్ సిటీలను రిజిస్టర్ చేశారు. దీని నిర్వహణకు ప్రత్యేక లక్ష్య సంస్ధ (స్పెషల్ పర్పస్ వెహికిల్-ఎస్‌పివి)ను ఏర్పాటు చేశారు. పనులన్నీ ఈ సంస్ధే నిర్వహిస్తుంది. ఈ లిమిటెడ్ కంపెనీల్లో 40 శాతం వరకు భాగస్వామ్యాన్ని ప్రైవేట్ సంస్ధలకు కల్పిస్తున్నారు. ఎస్‌పివి సంస్థకి స్మార్ట్ సిటీపై సర్వ హక్కులు కల్పించారు. ప్రాజెక్టు కన్సల్‌టెంట్లను నియమించుకునే దగ్గర నుండి చెపట్టే ప్రాజెక్టులను ప్రవేటు సంస్ధలకు అప్పగించటం, అస్తులను తనఖా పెట్టటం, జాతీయ, అంతర్జాతీయ సంస్ధల నుండి అప్పులు సమకూర్చుకునే వరకు అన్ని అధికారాలు ఈ సంస్థకి కట్టబెట్టారు. అలాగే ఆ ప్రాంతంలో రకరకాల పన్నులు, యూజర్ చార్జీలు విధించే అధికారం కూడా ఈ సంస్థకి ఇచ్చారు. దీనితో ఇప్పటికే 21 శాతం ప్రాజెక్టులను పిపిపి క్రింద ప్రైవేట్ సంస్థలకి ఇచ్చేశారు. ఆస్తులను తనఖా పెట్టి సుమారు రూ.4 వేల కోట్ల పైన అప్పులు తీసుకున్నాయి.
స్మార్ట్‌సిటీ లిమిటెడ్ కంపెనీకి స్ధానిక మున్సిపల్ సంస్ధకి ఎటువంటి సంబంధం లేకుండా చేశారు. నగర పాలక సంస్ధలకు నిధులు, ప్రాజెక్టులపై ఎటువంటి నియంత్రణాధికారం ఉండదు. ఎన్నికైన మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కూడా ఈ లిమిటెడ్ కంపెనీపై ఎలాంటి అధికారం లేదు. దీనిలో కనీసం భాగస్వాములు కూడ కాదు. కౌన్సిళ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి స్ధానిక సంస్ధల అధికారాలను నిర్వీర్యం చేస్తున్నారు.
ప్రైవేట్ సంస్ధలకు ధారాదత్తం - ప్రజలపై భారాలు
గత రెండు దశాబ్దాల నుంచి పట్టణ రంగంలో ప్రైవేట్ పెట్టుబడికి అనుకూలంగా అనేక మార్పులు తీసుకురావటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ మిషన్ (జెఎన్‌ఎన్‌ఆర్‌యుఎం) పథకాన్ని తీసుకువచ్చి 63 నగరాల్లో అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా పట్టణ భూగరిష్ట పరిమితిని రద్దు చేశారు. స్టాంప్ డ్యూటీలను తగ్గించారు. ప్రణాళికా సంఘం నిధులను సంస్కరణలతో ముడిపెట్టారు. కేంద్రం ఇచ్చే గ్రాంట్లను కూడా అనేక షరతులకు ముడిపెట్టి ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు. కేంద్రంలో బిజెపి అధికారం లోకి వచ్చిన తరువాత ఈ సంస్కరణలను మరింత తీవ్రతరం చేసేందుకు స్మార్ట్ సిటీ పథకాన్ని ప్రవేశపెట్టింది. పట్టణ వ్యవస్థలో ప్రైవేట్ పెట్టుబడి విచ్చలవిడి కార్యకలాపాలను నియత్రించేందుకు వున్న అనేక చట్టాలను, నిబంధలను మార్చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళికను, జోనింగ్ విధానాలను పెట్టుబడిదారులకు అనుగుణంగా మార్చేస్తున్నారు. మౌలిక సదుపాయాల రంగాలను, పౌర సేవలను, ఉమ్మడి ఆస్తులను మున్సిపల్ సంస్థల బాధ్యత నుండి ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేస్తున్నారు. మున్సిపల్ సంస్థలో అయ్యే ఖర్చును పూర్తిగా ప్రజల నుండే రాబట్టాలనే విధానం అమలుకు పూనుకున్నారు. అందులో భాగంగా రకరకాల పన్నులు పెంచడం, కొత్త పన్నులు, యూజర్ చార్జీలు విధించడం లాంటి చర్యలు మనం చూస్తున్నాం. స్థానిక సంస్థల సుపరిపాలనను ధ్వంసం చేస్తూ పట్టణ వ్యవస్థపై ప్రైవేట్ పెట్టుబడి అధిపత్యాన్ని పెంచుతున్నారు.
/ వ్యాసకర్త సెల్ : 9490098792 /
డా|| బి.గంగారావు