Feb 19,2023 07:48

ప్రకతిలో అందంగా ఉండని పువ్వే ఉండదు. ఒక్కోపువ్వు ఒక్కో రకం అందం. దేనికదే సాటి. పూల ప్రపంచంలో ఎన్నో రకాల అద్భుతమైనవి. వాటిలో చిందే అందాలతో హృదయాలను రవళించే చిన్ని చిన్ని పూజాతి మొక్కలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని నిత్యం పూసే పువ్వులు, మరికొన్ని ఆయా సీజన్‌లలో పురివిప్పే విదేశీ పూల మొక్కలు కూడా ఉన్నాయి. అటువంటి అరుదైన చిన్ని పూల మొక్కల గురించి తెలుసుకుందాం.

  • జట్రోపా రెడ్‌..

ముదురు ఎరుపు రంగు పువ్వులు గుత్తులుగా విచ్చుకునే పూలమొక్క జట్రోపా రెడ్‌. ఆకులు త్రిశూలాకారంలో ఉంటాయి. ఆకుల మీద పసుపు రంగు చుక్కలు మనోహరంగా ఉంటాయి. మొక్క రెండు నుంచి మూడు అడుగుల వరకు పెరుగుతుంది. ఇది యుఫోర్బియేÛసి కుటుంబానికి చెందిన అమెరికా దేశపు మొక్క. దీనిలో విషతుల్య లక్షణాలుండటంతో బయో డీజిల్‌ తయారీలో ఉపయోగిస్తుంటారు. కుండీల్లోనూ, నేల మీద పెరుగుతుంది. ఇంటి ముంగిట ఈ మొక్కలు ఎంతో అందాన్ని ఇస్తాయి.

  • బిగోనియా రెడ్‌..
1

చిన్న పువ్వులతో చక్కటి ఆకులతో అలరించే మొక్కల్లో బిగోనియా ఒకటి. బిగోనియా పూలమొక్కల్లో వందల రకాలు ఉన్నాయి. పూల మధ్యలో పసుపురంగు పుప్పొడి మరింత అందం అద్దుతుంది. తొమ్మిది అంగుళాల నుంచి రెండు అడుగుల ఎత్తు వరకు పెరిగే బిగోనియా మొక్కలు ఉన్నాయి. తెలుపు, ఎరుపు, పింకు, వయోలెట్‌ ఇలా రకరకాల పువ్వులు పూసే బిగోనియా మొక్కలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇండోర్‌. మరికొన్ని అవుట్డోర్‌, ఇంకొన్ని సెమీషేడ్‌ పూల మొక్కలు ఉన్నాయి. ఇవి కుండీలోనే బాగా పెరుగుతాయి. కొన్ని మొక్కల ఆకులు ఆకుపచ్చగాను, మరికొన్ని చింతపిక్క రంగులోను, అనేక ఆకారాల్లోనూ ఉంటాయి.

  • సూడే రాంథెమం లాక్షిఫ్లోరం..

లేత నేరేడు రంగులో ఐదు రేఖల నక్షత్రాల తళుకులీనే తోట జాతి పూమొక్క సూడే రాంథెమం లాక్షిప్లోరం. పూలకి మధ్యలో ఉండే పుప్పొడి మరింత మనోహరంగా ఉంటుంది. అకాంతేసి కుటుంబానికి చెందిన దీన్ని షంటింగ్‌ స్టార్‌ అని కూడా పిలుస్తారు. మూడు అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ మొక్కకు అక్కడక్కడ పువ్వులు పూస్తాయి. జనవరి నుంచి హేమంతం వరకు పువ్వులు పూస్తూనే ఉంటుంది. అమెరికా దేశం దీని పుట్టుక. పూర్తి బయట వాతావరణంలో పెరుగుతుంది. పూలలో మకరందం మెండుగా ఉంటుంది.

  • బిగోనియా వైట్‌..
1

    బిగోనియాలో అత్యంత విలువైన మొక్క బిగోనియా వైట్‌. పువ్వులు పాలమీగడ తెలుపుతో చిన్న పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. పూ కొమ్మలు గాలికి కదులుతుంటే నాట్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది.

    • టికోమా క్యాపన్‌ సిస్‌..
    1

      టికోమా క్యాపన్‌ సిస్‌ వీటినే మద్రాసు కనకాంబరాలు అంటారు. పువ్వులు సన్నగా పొడవుగా లిల్లీ పువ్వుల ఆకారంలో ఉండి, కాషాయ రంగులో విరబూస్తాయి. రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు వరకు పెరిగే మొక్క. ఇది పూర్తిగా ఎండలో పెరుగుతుంది. కుండీల్లోనూ నేల మీద కూడా పెంచుకోవచ్చు. ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు పువ్వులు పూస్తాయి. వీటి పువ్వులలో మకరందాన్ని సేవించడానికి సీతాకోక చిలుకలు, బంగారు పిచ్చుకలు నిరంతరం వీటి చుట్టూ తిరుగుతుంటాయి. ఎర్ర మట్టి నేలల్లో బాగా పెరుగుతాయి.

      • ఫైర్‌ బుష్‌..
      1

      నారింజపండు రంగులో అంగుళం పొడవున్న కొట్టాల్లాంటి పువ్వులు చాలా అందంగా ఉంటాయి. మొక్క పొదలాగా అల్లుకుంటుంది. మొక్క నిండుగా పువ్వులు పూస్తాయి. శరదృతువు నాటికి పువ్వులు నిగారింపుగా ఉండి, మొక్క భలే కనువిందుగా ఉంటుంది. ఫైర్‌బుష్‌ అని పిలిచినా దీని శాస్త్రీయ నామం అమేలియా పేటెన్స్‌. ఇది కూడా అమెరికా జాతి మొక్కే. ఈ మొక్కని ఇంటి ముంగిట వేసుకొని కావలసిన ఆకారాల్లో కూడా కత్తిరించుకోవచ్చు. ఈ పువ్వుల్లో కూడా మకరందం పొదిగి ఉంటుంది. మొక్కకి నీటి వనరు అందిస్తే సరిపోతుంది.

      • ఎంజెలోనియా అంగుస్టి పోలియో బెంత్‌..
      1

      పొడవైన గెలగుత్తులకు ముదురు ఊదా రంగు రేఖల మాదిరిగా ఉండే పువ్వులు కళాత్మకంగా కనిపిస్తాయి. ఆకులు సన్నగా రెండు అంగుళాల పొడవు ఉంటాయి. ఈ ఎంజెలోనియా అంగుస్టి పోలియో బెంత్‌నే ఏంజెల్‌ ఫ్లవర్‌, సమ్మర్‌ ఆర్చిడ్‌ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క స్వస్థలం సింగపూర్‌. జనవరి నుంచి జూన్‌, జులై నెలల వరకు పువ్వులు పూస్తూనే ఉంటుంది. పొదలా ఎదుగుతుంది. ఎండలో పెరుగుతుంది. నేలమీద, కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఇంటి ముంగిట ప్రహరీగోడల వద్ద, బౌండరీ లైన్లుగా, ల్యాండ్‌ స్కేపింగ్‌ మధ్య ఈ మొక్కలను పెంచుకుంటే చక్కగా పువ్వులతో అలరిస్తాయి. తెల్లని కుండీల్లో ఈ మొక్క మరింత అందంగా కనిపిస్తుంది.

      - చిలుకూరి శ్రీనివాసరావు,
      89859 45506